జూరాల నుంచి నీటి విడుదల
దిశ, మహబూబ్ నగర్ : ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో 20 రోజుల ముందుగానే ప్రాజెక్టు గేట్లు ఎత్తి జూరాల నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జూరాల ఆయకట్టుకు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల […]
దిశ, మహబూబ్ నగర్ : ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జూరాలకు ఇన్ ఫ్లో పెరిగింది. దీంతో 20 రోజుల ముందుగానే ప్రాజెక్టు గేట్లు ఎత్తి జూరాల నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీటిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జూరాల ఆయకట్టుకు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డిలతో కలిసి మంత్రి విడుదల చేశారు. ఎన్నడూ లేని విధంగా ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వరదనీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతోంది. దీంతో తొలిసారి జూరాల కుడి, ఎడమ కాల్వలకు ఒకేసారి నీటిని విడుదల చేశారు. ఈ ఏడాది కర్ణాటకలోని నారాయణపూర్, తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుల మధ్య భాగాన భారీ వర్షాలు కురవడంతో జూన్ 29 నుంచే జూరాలకు వరద నీరు వస్తోంది. ఈ నేపథ్యంలోనే జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు మీద ఆధార పడ్డ నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల ప్రాజెక్టులకు ఇప్పటికే నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 8 టీఎంసీల నీరు జూరాలలో ఉంది. అయితే , ఆదివారం ఉదయం నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో సుమారు 12వేల క్యూసెక్కుల వరద నీరు 48 గంటల్లో జూరాలకు చేరుకుంటుంది.దాంతో కుడి, ఎడమ కాల్వలకు కూడా నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.