ఇక్కడ 3 రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్.. కారణం..?

దిశ ప్రతినిధి, కరీంనగర్: నక్సల్బరి ఉద్యమ వ్యవస్థాపకుడు చార్ మజుందార్, విప్లవ పోరాటాలకు బీజం వేసిన కన్హాయ్ ఛటర్జీలను స్మరించుకునేందుకు మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జులై 18న కన్హాయ్ ఛటర్జీ, 28న చార్ మజుందార్ చనిపోవడంతో వారిని స్మరించుకుంటూ మావోలు మూడు దశాబ్దాలుగా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏటా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన వారిని స్మరిస్తూ పట్టున్న ప్రాంతాల్లో శాశ్వత, […]

Update: 2020-07-21 20:48 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: నక్సల్బరి ఉద్యమ వ్యవస్థాపకుడు చార్ మజుందార్, విప్లవ పోరాటాలకు బీజం వేసిన కన్హాయ్ ఛటర్జీలను స్మరించుకునేందుకు మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జులై 18న కన్హాయ్ ఛటర్జీ, 28న చార్ మజుందార్ చనిపోవడంతో వారిని స్మరించుకుంటూ మావోలు మూడు దశాబ్దాలుగా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఏటా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. ఎన్‌కౌంటర్లలో మరణించిన వారిని స్మరిస్తూ పట్టున్న ప్రాంతాల్లో శాశ్వత, తాత్కాలిక స్మారక స్థూపాలను నిర్మించడం అమరులకు నివాళులు అర్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు దాడులకు కూడా పాల్పడుతుంటారు. అయితే ఆ సందర్భంలో వాటిని నిలువరించేందుకు పోలీసులు ఏరివేత కార్యక్రమం చేపట్టేవారు. కానీ, ఈ ఏడాది అమర వీరుల వారోత్సవాలకు 14 రోజుల ముందు నుంచే సరిహద్దు అడవుల్లో అలజడి మొదలైంది.

పెద్దఎత్తున కూంబింగ్..

తెలంగాణలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అడవుల్లో, భద్రాద్రి జిల్లా కరుకుగూడెం అటవీ ప్రాంతంలో మావోలకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. దశాబ్దకాలానికిపైగా ఈ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల కార్యకలాపాలు లేకుండా పోయాయి. గత కొంతకాలంగా అటవీ ప్రాంతంలో కరపత్రాలు, వాల్ పోస్టర్లు వెలువడటం కలకలం సృష్టించింది. తాజాగా మావోయిస్టులే సాయుధులుగా తిరగడం పోలీసులకు తారసపడటంతో గోదావరి పరివాహక ప్రాంతం అంతా ఉలిక్కిపడింది. అమర వీరుల వారోత్సవాలే లక్ష్యంగా మావోలు తెలంగాణ సరిహద్దుల్లో పాగా వేసేందుకు చొరబడ్డారని తెలుస్తోంది. ఈ సందర్భంగా దాడులకు పూనుకోవడం, టార్గెట్లను లక్ష్యం చేసుకుని ముందుకు సాగడం వంటి కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాలని భావించిన మావోలు గోదావరి తీరంలో సంచారం ప్రారంభించారని సమాచారం. ఈ సమాచారం అందుకున్న నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసు వర్గాలను హెచ్చరించడంతో కూంబింగ్ బలగాలు అడవులను జల్లెడ పట్టడంతో ఎదురు కాల్పుల చోటు చేసుకున్నాయి.

స్థూపం కూల్చివేత..

ఇదే సమయంలో చత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యంలోని బస్తర్ అటవీ ప్రాంతంలో కూడా స్మారక స్థూపాలను నిర్మించే పనిలో మావోయిస్టులు నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడి డీఆర్జీ బలగాలు అటవీ ప్రాంతంలోని స్థూపాన్ని కూల్చేశారు. వారోత్సవాలు నిర్వహించేందుకు మావోయిస్టులు పెద్ద ఎత్తున సమాయత్తం అవుతున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో మూడు రాష్ట్రాల(తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్) పోలీసులు జాయింట్ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.

Tags:    

Similar News