జగన్.. రాజన్న రాజ్యం అంటే ఇదేనా?

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోందని ఆరోపించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ములు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రబీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయని..వాటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు […]

Update: 2021-06-23 06:36 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోందని ఆరోపించింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ములు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రబీ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇంకా రూ. 4 వేల కోట్ల బకాయిలు పెండింగులో ఉన్నాయని..వాటిని ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని జనసేన డిమాండ్ చేసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 28 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడంపై మండిపడింది. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికోసం, రైతుల కోసం కేంద్రం ఇస్తున్న నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించేస్తున్నారని ఆరోపించింది.

రైతులు డబ్బులు అడుగుతుంటే కేంద్రం నుంచి రూ. 3 వేల కోట్లు రావాలని నెట్టేయడం దుర్మార్గమని జనసేన మండిపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కూడా ప్రభుత్వం ఇలానే డబ్బులు చెల్లించకపోవడంతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పవన్ దీక్ష ప్రభావంతో ప్రభుత్వం దిగివచ్చి బకాయిలు చెల్లించిందని జనసేన పార్టీ గుర్తు చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి బకాయిలను చెల్లించాలని, లేదంటే జనసేన పార్టీ కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరించింది. ధాన్యం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామన్న హామీ ఏమైందని నిలదీసింది. మడమ తిప్పడం అంటే ఏమిటో సీఎం జగన్ తన చేతల్లో చూపిస్తున్నారని ఎద్దేవా చేసింది. జగన్ తీసుకొస్తానన్న రాజన్న రాజ్యం ఇదేనా అని ప్రశ్నించింది. రైతుల కళ్లలో నీళ్లు తెప్పించడమే మీ విధానమా? అని నిలదీసింది. ఇప్పటికైనా స్పందించి వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే రైతుల ఆగ్రహానికి గురవ్వకతప్పదని ప్రభుత్వాన్ని జనసేన హెచ్చరించింది.

Tags:    

Similar News