‘జీవ క్రాంతి’ లేదు.. భ్రాంతే
“మా ఊళ్లో గొర్రెలు, మేకల పెంపకందార్ల కుటుంబాలు యాభై ఉంటాయి. అందులో పాలికి మేపే ఒక్కరికే ఈ పథకం వచ్చింది. మిగతా తొమ్మిది జీవాలు పెంచేవాళ్లు కాదు. పోన్లే వాళ్లకన్నా జీవాలు వస్తాయన్న నమ్మకం లేదు. రూ.75 వేలకు 14 గొర్రెపిల్లలు, ఓ పోతు ఎలా వస్తాయి ? వీటితోనే కుటుంబం గడవదు. కనీసం 30 పిల్లలన్నా ఉండాలి. బ్యాంకు నుంచి రూ.2 లక్షలు లోన్ ఇప్పించి ఈ రూ.75 వేలను సబ్సిడీగా ఇస్తే పోయేది. చేయూత […]
“మా ఊళ్లో గొర్రెలు, మేకల పెంపకందార్ల కుటుంబాలు యాభై ఉంటాయి. అందులో పాలికి మేపే ఒక్కరికే ఈ పథకం వచ్చింది. మిగతా తొమ్మిది జీవాలు పెంచేవాళ్లు కాదు. పోన్లే వాళ్లకన్నా జీవాలు వస్తాయన్న నమ్మకం లేదు. రూ.75 వేలకు 14 గొర్రెపిల్లలు, ఓ పోతు ఎలా వస్తాయి ? వీటితోనే కుటుంబం గడవదు. కనీసం 30 పిల్లలన్నా ఉండాలి. బ్యాంకు నుంచి రూ.2 లక్షలు లోన్ ఇప్పించి ఈ రూ.75 వేలను సబ్సిడీగా ఇస్తే పోయేది. చేయూత పథకం కింద గవర్నమెంటు డబ్బులేసిన మరుసటి రోజే ఖాతా నుంచి తీసేశారు. కరోనా వల్ల అప్పులతో సతమతమవుతున్నారు. రూ.18,750 మళ్లీ బ్యాంకులో ఏస్తేనే పథకం ఇస్తారంట. ఇలాగైతే ఎలా సార్!” అంటూ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మైనంపాడుకు చెందిన ఓ గొర్ల పెంపకందారుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం చేయూత, ఆసరా పథకాల ద్వారా ఇస్తున్న సొమ్ముతో పాడి గేదెలు, గొర్లు, మేకల పెంపకంతో ఉపాధి కల్పిస్తామని చెబుతోంది. అయితే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈపాటికే పడ్డ సొమ్ము ఎప్పుడో ఖర్చయిపోయింది. పేద కుటుంబాల్లో కరోనా వల్ల ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. ఖాతాల్లో డబ్బు పడ్డ రోజునే డ్రా చేశారు. వాళ్లకు గేదెలు, ఆవులు, గొర్లు, మేకల యూనిట్లు రావు. తిరిగి రూ.18,750 బ్యాంకులో జమ చేస్తేనే పథకాన్ని వర్తింపజేస్తామంటున్నారు. ఎక్కువ శాతం తిరిగి బ్యాంకులో నగదు జమ చేసే పరిస్థితి లేదు. వాస్తవానికి గ్రామాల్లో కొద్దోగొప్పో భూ వసతి, కట్టేసుకోవడానికి వీలుగా సొంతిల్లుండి ఈపాటికే ఒకటి రెండు గేదెలున్నోళ్లకు, గొర్లున్నోళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. వాళ్ల గేదెలు, ఆవులను చూపించి ఉపాధి కల్పించినట్లు కాకి లెక్కలేస్తారు. అంతకుమించి కొత్తగా గేదెలు తీసుకునేవాళ్లు లేరు. కొత్తగా గొర్లు, మేకలు పెంచుకునే వాళ్లూ లేరు.
పది జీవాలకు మించి రావు..
ప్రభుత్వం ఇచ్చే రూ.75 వేలకు పాలు మరిచిన నాలుగైదు నెలల వయసుండే పది జీవాలకు మించి రావు. అవి జీవనోపాధికి సరిపోవు. ప్రభుత్వం మాత్రం 14 గొర్రె పిల్లలు, ఓ పోతు పిల్లతో యూనిట్‌గా 2.46 లక్షల యూనిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించింది. అందుకోసం చేయూత, ఆసరా పథకాల ద్వారా రూ.1,869 కోట్లు ఇచ్చినట్లు చెబుతోంది. అలాగే ఇవే పథకాల కింద రూ.3,500 కోట్లతో 4.69 లక్షల యూనిట్ల గేదెలు, ఆవుల పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం కొనికి గ్రామంలో 30 మంది లబ్ధిదారులకు చేయూత పథకం కింద నగదు బదిలీ చేశారు. అందులో ముగ్గురు మాత్రమే తాము ఖాతాల నుంచి డ్రా చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లిస్తామన్నారు. మిగతావాళ్లు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. కరోనా సమస్యతో ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఖర్చయిపోయినట్లు తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం గొర్లు, బర్రెలను ఇచ్చినా ఎక్కడ మేపుకోవాలి.. ఎలా పోషించాలని ప్రశ్నిస్తున్నారు. గేదెలైతే తీసుకుంటాం. ఎలాగో మేపుకుంటాం. ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో 14 గొర్రె పిల్లలు రావు. వాటితో కుటుంబం జరగదు. అందుకే ప్రభుత్వం తమకు ఇచ్చిన సొమ్మును తిరిగి ఇవ్వలేమని సచివాలయ అధికారులకు చెప్పారు.
ఒకేసారి 3 జీవాలు చనిపోతేనే క్లెయిమ్..
ప్రభుత్వం గ్రామాల్లో ఇచ్చే సెంటున్నర, అర్బన్‌లో సెంటు స్థలం ఇంట్లో గేదెలు ఎక్కడ కట్టేయాలి, వాటికి పచ్చి గడ్డి ఎక్కడ నుంచి తేవాలి, ఎండు గడ్డి, ఇతర దాణా ఎక్కడ నిల్వ పెట్టుకోవాలనే అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించడం లేదు. గొర్లు, మేకలు తిప్పుకోవడానికి స్థలాలు ఎక్కడున్నాయి, వాటికి జబ్బు చేస్తే దగ్గరలో ఆస్పత్రుల్లేవు. ఉన్నా అందులో వైద్యుల్లేరు. కేవలం సహాయకులతో ఆస్పత్రులు నడుస్తున్నాయి. కొత్తగా ఆర్బీకేల్లో వెటర్నరీ అసిస్టెంట్లను నియమించారు. వాళ్లకు అనుభవం లేదు. వైద్యుల పోస్టులు భర్తీ కావడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే గొర్లు, మేకల బీమా పథకం మరీ డొల్లగా ఉంది. కనీసం ఒకేసారి మూడు జీవాలు చనిపోతేనే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత అని పెట్టారు. ఏ రైతుకీ ఒక్కసారి ఇలా చనిపోవు. ఒక్కటి చనిపోయినా బీమా సొమ్ము ఇచ్చేట్లుంటేనే రైతుకు ప్రయోజనం. క్షేత్ర స్థాయిలో ఈ అంశాలేవీ పట్టించుకోకుండా కేవలం బర్రెలిచ్చాం.. గొర్రెలిచ్చామని చేతులు దులుపుకుంటే ప్రయోజనం లేదు.
ఈ పథకం ఆచరణలో సాధ్యం కాదు
ప్రభుత్వం ఇచ్చే రూ.75 వేలకు 14 పిల్లలు, పోతు పిల్లలు రావు. బ్యాంకుల ద్వారా కనీసం రూ.2 లక్షలు రుణంగా ఇప్పించి ప్రభుత్వం ఇచ్చే సొమ్మును సబ్సిడీగా విడుదల చేస్తే బావుండేది. జీవాలకు బీమా పథకం కూడా రైతులకు ఉపయోగపడేట్టు లేదు. ఒక్కటి చనిపోయినా బీమా వర్తింపజేయాలి. అయినా ఇప్పటికి ఒక్క ప్రకాశం జిల్లాలోనే రూ.7 కోట్ల దాకా క్లెయిములు చెల్లించాలి. జనవరి నుంచి ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో తెలీడం లేదు. ఓ పథకాన్ని ప్రకటించేటప్పుడు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు, ఇబ్బందులను అధ్యయనం చేయకుంటే ఎలా ? కేవలం అధికారుల అంకెల గారడీలోనే అభివృద్ధి కనిపిస్తుంది.
-కిలారి పెద్దబ్బాయి, గొర్లు, మేకల పెంపకందారుల సంఘ నేత