షర్మిల పార్టీ జెండా.. అజెండా ఇదే..?
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీకి ముహూర్తం ఫిక్సయింది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 8వ తేదీన పార్టీ జెండా, ఎజెండాను ఆమె ప్రకటించనున్నారు. ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ షర్మిల నివాళులర్పించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు పార్టీని ప్రకటించనున్నారు. ఫిలింనగర్ కు సమీపంలోని మణికొండ-దర్గా వద్ద ఉన్న […]
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీకి ముహూర్తం ఫిక్సయింది. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 8వ తేదీన పార్టీ జెండా, ఎజెండాను ఆమె ప్రకటించనున్నారు. ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ షర్మిల నివాళులర్పించనున్నారు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు పార్టీని ప్రకటించనున్నారు. ఫిలింనగర్ కు సమీపంలోని మణికొండ-దర్గా వద్ద ఉన్న జేఆర్ సీ కన్వెన్షన్ హాల్ లో పార్టీ ఏర్పాటు వేడుకను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేవలం అతికొద్ది మందిని మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్ నేపథ్యంలో వెయ్యి నుంచి 1500 మంది ముఖ్య అనుచరులు, వైఎస్సార్ అభిమానుల నడుమ పార్టీ జెండా, ఎజెండాను ఆమె ప్రకటించనున్నారు.
వర్చువల్ గానే..
వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన కోసం తొలుత భారీగా జన సమీకరణ చేసి అంగరంగ వైభవంగా చేపట్టాలని నిర్ణయించింది. సుమారు లక్ష మందికిపైగా జనాన్ని సమీకరించాలని ప్లాన్ చేసింది. కానీ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. జేఆర్ సీ కన్వెన్షన్ హాల్ లో అతికొద్ది మంది నడుమ మాత్రమే ఆమె పార్టీ జెండా, ఎజెండాను ప్రకటించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చూసేందుకు అనుగుణంగా వర్చువల్ పద్ధతిని ఆమె ఎంచుకున్నారు. ఇందుకు రాష్ట్రంలోని 17 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి పార్టీకి సంబంధించిన కార్యాచరణను కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు ఆయా ప్రాంతాల వారీగా మైదానాలు, స్టేడియాలు, ఇతర ఖాళీ ప్రాంతాలను పరిశీలించాలని షర్మిల ఆదేశించినట్లు తెలుస్తోంది. కొవిడ్ నేపథ్యంలో 17 లోక్ సభ నియోజకవర్గాల్లోనూ కేవలం 1000 నుంచి 1500 ముఖ్య అనుచరులకు మాత్రమే ఎంట్రీ ఉండే అవకాశాలున్నాయి.
వైసీపీ జెండాను పోలినట్లే..
తెలంగాణలో వైఎస్ షర్మిల తను పెట్టబోయే పార్టీ పేరును ‘వైఎస్సార్ టీపీ’ గా ఇటీవలే ప్రకటించింది. కాగా తాజాగా జెండా కూడా ఇప్పటికే ఖరారైనట్లు తెలుస్తోంది. తను పెట్టబోయే పార్టీకి చెందిన జెండా తన అన్న జగన్ పార్టీ వైసీపీకి చెందిన జెండాను పోలినట్లే ఉంటుందని లోటస్ పాండ్ వర్గీయులు చెబుతున్నారు.
వైఎస్‌ఆర్‌టీపీ జెండాలో పాలపిట్ట రంగు 80 శాతం, లేత ఆకుపచ్చ రంగు 20 శాతం ఉంటాయని లోటస్ పాండ్ వర్గీయులు చెబుతున్నారు. జెండా మధ్యలో తెలంగాణ మ్యాప్. అందులో తలపాగా లేకుండా తన తండ్రి వైఎస్సార్ ఫొటో ఉండేలా షర్మిల ప్రణాళికలు చేసింది. పాలపిట్ట రంగు సమన్యాయం, సమానత్వం, సంక్షేమానికి చిహ్నంగా.., ఆకుపచ్చ కలర్ రైతులకు, అభివృద్ధికి చిహ్నాలుగా ఉండేలా ఈ రంగులకు షర్మిల ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం. ఇక తలపాగా వేసుకుని ఉన్న వైఎస్సార్ బొమ్మ తన అన్న పార్టీకి ఉంటుంది కాబట్టి తన పార్టీ జెండాలో తల పాగా లేకుండా పెట్టుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఈ విషయంలో వైఎస్ షర్మిల ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
షర్మిల ఎజెండా ఇదే..!
వైఎస్ షర్మిల తను తెలంగాణలో పెట్టబోయే పార్టీకి ఎజెండాను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సారే తన స్ఫూర్తి అని, తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని, తెలంగాణలో రాజన్నన రాజ్యస్థాపన చేస్తానని ఇప్పటికే పలుమార్లు ఆమె ప్రకటించింది. ఇందుకు ఉమ్మడి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాలనే తన ఎజెండాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొవిడ్ వైద్యాన్ని ఆరోగ్య శ్రీలో చేర్చాలని పలుమార్లు షర్మిల ట్వీట్లు చేశారు.
తన ఎజెండాలో ప్రధానంగా ఉచిత విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళల భద్రత, నిరుద్యోగ సమస్యలపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఆమె చేసిన జిల్లాల పర్యటనలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వీటికి తోడు ఏపీలో తన అన్న జగన్ అక్కడి ప్రజల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన పథకాలను ఇక్కడ ఖరారు చేసేందుకు కూడా అవకాశాలు లేకపోలేదు. ఏపీలో మెజారిటీ ప్రజలను ఆకర్షించేలా ఉన్న వైసీపీ ఎజెండాను తెలంగాణలోనూ అమలు చేసేలా నిర్ణయాలను తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
సామాజిక, ఆర్థికపరంగా ఏపీ, తెలంగాణ మధ్య కొంత వ్యత్యాసం ఉన్నందున.. దానికి అనుగుణంగా, క్షేత్రస్థాయి పరిస్థితులు, వాస్తవాలను ప్రతిబింబించేలా పార్టీ విధి విధానాలను ఖరారు చేస్తారని సమాచారం. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించేలా, విధి విధానాలు ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా పార్టీ ప్రకటన చేపట్టిన అనంతరం రెండు, మూడు వారాల్లోనే పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లేందుకు షర్మిల ప్రణాళికలు చేసుకున్నారు.
చుట్టూ ఉన్న కోటరీతోనే ఇబ్బంది
ప్రజల కీలక సమస్యలపై పోరాడుదామని షర్మిల అనుకున్నప్పటికీ ఆమె చుట్టూ ఉన్న కోటరీ వల్ల విఫలమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఆమె చేపట్టిన జిల్లాల పర్యటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. జన సమీకరణ చేయడంలో వారు జిల్లాస్థాయి నేతలు, కార్యాకర్తలతో సమన్వయం చేయలేకపోతున్నట్లు సమాచారం. పలు జిల్లాల్లో ఆమె చేపట్టిన పర్యటనల్లో జనం పలుచగా ఉండటానికి ఇదే కారణమని తెలుస్తోంది.
వరంగల్ జిల్లా పర్యటనలో స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ లో ఫీజు రీయింబర్స్ మెంట్ పై మాట్లాడేందుకు వెళ్లినా అక్కడ 20 మంది విద్యార్థులు కూడా లేనట్లు సమాచారం. దీంతో షర్మిల పర్యటలనలు తూతూ మంత్రంగా.. మొక్కబడిగా మాత్రమే సాగుతున్నాయి. ఆమె చుట్టూ ఉన్న కోటరీ చెప్పినట్లుగా షర్మిల నడుచుకోవడంతో గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో పార్టీకి చాలా నష్టం చేకూరే అవకాశాలు సైతం ఉన్నాయి. ఇదిలా ఉండగా షర్మిల పార్టీ ఏర్పాటు కోసం నాయకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఇన్ని రోజులు ఎదురుచూశారు. మరీగా జిల్లాల నేతల సంగతి చెప్పక్కర్లేదు. అయితే వర్చువల్ మీటింగ్ కు వెయ్యి నుంచి 1500 మందిని మాత్రమే అనుమతించే అవకాశం ఉండటంతో వారు కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది.