ఉన్నవి రెండే సీట్లు.. ఆశావహులెందరో!

దిశ, న్యూస్ బ్యూరో: రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. ఉన్నవి రెండే సీట్లయినా అధికార టీఆర్ఎస్ పార్టీలో పోటీపడేవారి సంఖ్య మాత్రం పదికంటే ఎక్కువే. గతంలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా హామీ ఇచ్చారనేవారు కొందరైతే.. సామాజిక సమీకరణాల ప్రకారం తమకే దక్కుతుందనేవారు మరికొందరు. ఇక పార్టీలో సీనియర్‌గా తమకంటూ ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఇస్తారనుకునేవారు ఇంకొందరు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినందున కనీసం రాజ్యసభ సభ్యురాలిగానైనా పార్లమెంటులో […]

Update: 2020-02-26 07:51 GMT

దిశ, న్యూస్ బ్యూరో:
రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులు ఎన్నిక కావాల్సి ఉంది. ఉన్నవి రెండే సీట్లయినా అధికార టీఆర్ఎస్ పార్టీలో పోటీపడేవారి సంఖ్య మాత్రం పదికంటే ఎక్కువే. గతంలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా హామీ ఇచ్చారనేవారు కొందరైతే.. సామాజిక సమీకరణాల ప్రకారం తమకే దక్కుతుందనేవారు మరికొందరు. ఇక పార్టీలో సీనియర్‌గా తమకంటూ ఉన్న ప్రాధాన్యతను గుర్తించి ఇస్తారనుకునేవారు ఇంకొందరు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినందున కనీసం రాజ్యసభ సభ్యురాలిగానైనా పార్లమెంటులో కవిత అడుగుపెట్టాలనుకుంటున్నట్లు మరికొన్ని వార్తలు.. ఏదేమైనా కేసీఆర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఆ యోగం ఎవరికి దక్కుతుందో ఆయనకు మాత్రమే తెలుసు. అధికారికంగా పేర్లను ప్రకటించేవరకు అన్నీ ఊహాగానాలే. పార్టీ సెక్రటరీ జనరల్ అయినా సొంత కూతురైనా కేసీఆర్ తీసుకునే నిర్ణయానికి ఓ లెక్క ఉంటుంది. అది తేలేంతవరకూ పెద్దలసభకు వెళ్ళేది ఎవరనే చర్చ సాగుతూనే ఉంటుంది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కోటా నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం అనుంగు అనుచరుడు, పార్టీ సెక్రటరీ జనరల్ కె. కేశవరావుకు బహుశా ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలవుతాయా? లేక తెలంగాణ కోటాలో మరోమారు అవకాశం దక్కుతుందా? తెలియాల్సి ఉంది. అయితే తాను ఎంపీగా ఉన్న సమయంలోనే బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా కేసీఆర్‌ను ఇటీవలే కోరారు కేకే. దానికి కేసీఆర్ సైతం ‘ఇప్పుడు ఎంపీ టర్మ్ అయిపోతుంటే మళ్ళీ ఎంపీగా ఉండవనే అనుమానమేమైనా ఉందా!’ అని చేసిన వ్యాఖ్య ఇక్కడ చర్చనీయాంశం. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సభ్యుల్లో సీనియర్‌గానే కాక, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వ్యవహారాలను చక్కబెట్టే అనుభవం, కేంద్రంలోని పెద్దలతో ఉండే పరిచయాలు కేశవరావు సొంతం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేశవరావును మళ్ళీ రాజ్యసభ సభ్యుడిని చేయాలనే ఆలోచన కేసీఆర్‌కు ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాల సమాచారం.

అయితే కుమార్తె కవితను రాజ్యసభకు పంపిస్తే కేశవరావు సేవలను రాష్ట్రానికి వినియోగించుకోవచ్చన్న ఆలోచనా ఆయన మదిలో ఉన్నట్లు సన్నిహితుల సమాచారం. అలాంటి పరిస్థితి వస్తే కేకేకు ఎమ్మెల్సీ పదవి అప్పగించి ఆయన కుమార్తెకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పదవిని ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి కవితకు కేటాయిస్తే, మరో సీటు ఎవరికనేది ఆసక్తికరం. ఆశావహుల్లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రొఫెసర్ సీతారాం నాయక్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకుడు నాయిని నర్సింహారెడ్డి వంటి నేతల పేర్లే చాలానే ఉన్నాయి. ఇక సామాజికవర్గాల సమీకరణాలు చూస్తే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో ఒకరికి కేటాయించవచ్చన్న ఊహాగానాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఏదేమైనా కేసీఆర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కాదనే ధైర్యం పార్టీ నేతల్లో ఎవ్వరికీ లేదు. ఆశావహులను నిరాశపర్చకుండా ఆ తర్వాత ఎమ్మెల్సీ లేదా ఇతర నామినేటెడ్ పోస్టులతో వారిని సంతృప్తిపర్చే అవకాశాలూ ఉన్నాయి.

Tags:    

Similar News