కరోనా మానవాళికి ఏం చేసింది?
దిశ వెబ్ డెస్క్: కరోనా .. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ ప్రజలందర్నీ భయపెడుతోంది. మనుషులను కబళించుకుపోతుంది. మానవ శరీరాల్ని కుదేలు చేస్తోంది. దినసరి కూలీలను, మూగ జీవాలను పస్తులుంచుతోంది. కరోనా వైరస్ మానవాళికి చేస్తున్న నష్టం అపారమైంది. నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే .. కరోనా కలిగించిన ఈ నష్టమంతా ఒక వైపు. మరో వైపు… ప్రకృతికి, మానవులకు ఇది మరెంతో మేలు చేస్తోంది. ఇంతకీ ఏంటా మేలు? కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం దేశమంతా లాక్ […]
దిశ వెబ్ డెస్క్: కరోనా .. ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ ప్రజలందర్నీ భయపెడుతోంది. మనుషులను కబళించుకుపోతుంది. మానవ శరీరాల్ని కుదేలు చేస్తోంది. దినసరి కూలీలను, మూగ జీవాలను పస్తులుంచుతోంది. కరోనా వైరస్ మానవాళికి చేస్తున్న నష్టం అపారమైంది. నాణానికి బొమ్మ, బొరుసు ఉన్నట్లే .. కరోనా కలిగించిన ఈ నష్టమంతా ఒక వైపు. మరో వైపు… ప్రకృతికి, మానవులకు ఇది మరెంతో మేలు చేస్తోంది. ఇంతకీ ఏంటా మేలు?
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం దేశమంతా లాక్ డౌన్ విధించింది. ఒక్క మనదేశంలోనే కాదు… ప్రపంచపటంలోని చాలా దేశాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంది. మన దేశ చరిత్రలో కనివీని ఎరుగని రితీలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమై.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారు. పోలీసులంతా నిద్రాహారాలు మాని తమ విధుల్లో పనిచేస్తున్నారు. డాక్టర్లు, నర్సులంతా కుటుంబాలకు దూరంగా, గడియారంలోని ముల్లు చూడకుండా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులంతా తమ బాధ్యతను క్రమశిక్షణయుతంగా అమలు చేస్తున్నారు. ప్రమాదంలో ఉన్న దేశ ప్రజల కోసం.. వ్యాపారవేత్తలు, సినీ తారలు స్వచ్ఛంద విరాళాలు అందిస్తున్నారు. నాయకులంతా రాజకీయాలకు అతీతంగా ఒక్కటై ముందుకు నడుస్తున్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా సమయం వచ్చినప్పుడల్లా ప్రజలంతా ఐక్యతను చాటుతున్నారు. ఎక్కడా, ఎవరిలోనూ కించెత్తు స్వార్థం లేకుండా.. సాటి మనిషి ప్రాణం కాపాడటం కోసం సైనికులై పోరాటం చేస్తున్నారు. ఇలా దేశమంతా కరోనాపై ‘ఏక’మై యుద్ధం చేస్తోంది. కరోనా మానవత్వాన్ని మేల్కోలిపింది. సాటి మనిషి బాగుంటేనే తాను కూడా బాగుంటాననే సత్యాన్నే బోధించింది. ప్రకృతికి మానవాళి చేసిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఇప్పటికైనా మనిషి ప్రకృతిలో భాగమేననే నిజం తెలుసుకోకపోతే భవిష్యత్తులో రాబోయే ఉత్పాతాన్ని ముందే ట్రైలర్ లా చూపించింది.
స్వచ్ఛమైన గాలి:
చిన్న చిన్న గ్రామాల నుంచి మహా మహా నగరాల వరకు.. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ. అంతటా పెరిగిపోయిన వాహనాల వాడకం. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న పరి శ్రమలు. వాటి నుంచి వెలువడుతున్న పొగ. దాంతో గాలి పూర్తిగా కలుషితమైంది. కొన్ని దేశాల్లో ‘స్వచ్ఛమైన గాలి’ కొనుక్కునే స్థితి వచ్చిందంటే… మానవాళి ఎంతటి విపత్తులో ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలి కాలుష్యం వల్ల మన దేశ రాజధాని ఢిల్లీ ఎదుర్కొన్న పరిస్థితులను కళ్లారా చూస్తున్నాం. మన దేశంలోని మరెన్నో రాష్ట్రాల్లో వాయు కాలుష్యం ఎంత తీవ్రంగా ఉందో తేల్చి చెబుతున్న లెక్కలు సరేసరి. రోజు వారి పనుల కోసం ప్రభుత్వ వాహనాలను ఉపయోగించాలని, లేని పక్షంలో కార్ పూలింగ్, బైక్ పూలింగ్ అనుసరించాలని ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి. కార్ పూలింగ్ వల్ల వాహనాల వాడకం తగ్గుతుంది, రోడ్లపై రద్దీ తగ్గుతుంది, ఇంధనం కూడా ఆదా అవుతుంది. కానీ ఆ దిశగా పౌరులెవరు ఆలోచించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇలా మనుషులు చేసే తప్పిదాల వల్ల స్వచ్ఛమైన గాలి దొరకడం గగనమై పోయింది. కరోనా కారణంగా వాహనదారులు రొడ్డెక్కడం లేదు. పరిశ్రమలన్నీ మూతపడ్డాయ్. దాంతో చాలా నగరాలు, పట్టణాల్లో గాలి కాలుష్యం చాలా తగ్గింది. ఢిల్లీ, నోయిడాల్లోనూ గాలి కాలుష్యం తగ్గిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. లక్షలాది వాహనాలు విడుదల చేసే కాలుష్యం తగ్గిపోతే.. ప్రకృతి ఎలా ఉంటుందనడానికి పంజాబ్, జలంధర్ లోని ప్రజలు చూసిన ఓ అద్భుతమైన దృశ్యమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ధౌలధర్ పర్వత శ్రేణి జలంధర్ నుండి 213 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ జలంధర్ ప్రజలు.. ఇన్ని సంవత్సరాలుగా కాలుష్యం కారణంగా ఈ పర్వత శ్రేణి అందమైన దృశ్యాలను చూసే అవకాశాన్ని పొందలేకపోయేవారు. జలంధర్ ప్రజలు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అయ్యింది. క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా తన ఇంటిపై నుంచి దౌలదర్ పర్వత శ్రేణుల్ని తీసిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
నీటి కాలుష్యం:
నగరాలు, పట్టణాల్లో ఆఖరకు గ్రామాల్లోనూ పుట్టగొడుగుల్లా పరిశ్రమలు వెలుస్తున్నాయి. అవి విడుదల చేసే పొగ వల్ల గాలి కాలుష్యం కలిగితే.. అవి విడుదల చేసే రసాయన వ్యర్థాల వల్ల కాలువలు, చెరువులు, నదులు తద్వారా సముద్రాలు కలుషితమైపోతున్నాయి. లాక్ డౌన్ కారణంతో పరిశ్రమలన్నీ మూతపడ్డాయ్. దాంతో నీళ్లు స్వచ్ఛంగా మారిపోయాయి. ఇటలీలోని రోమ్ నగర కాలువల్ని, మన దేశంలో గంగా నదిని నీటి కాలుష్యం తగ్గిందనడానికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.
గంగానది నీటి నాణ్యత పెరిగిందని ఐఐటీ బీహెచ్‌యూ, వారణాసి కెమికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ డాక్టర్ పీకే మిశ్రా తాజాగా వెల్లడించారు. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు మూతపడటమే ఇందుకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. గంగా నదిలో కలిసే వ్యర్థాల్లో పరిశ్రమల నుంచి విడుదలయ్య వ్యర్థాలే పది శాతం వరకు ఉంటాయి. ఇవి మూతపడటంతో గంగా నీటి నాణ్యత 30 నుంచి 40 శాతం పెరిగిందని మిశ్రా వెల్లడించారు. గంగా నదిని ప్రక్షాళన చేయడానికి ఎన్నో విధాల ప్రయత్నించారు. కానీ కుదరలేదు. కరోనా వల్ల అది కూడా సాధ్యమైంది. ఇక రోమ్ విషయానికి వస్తే.. అక్కడికి వివిధ దేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. దాంతో అక్కడి నీరంతా కలుషితమైంది. లాక్ డౌన్ వల్ల పర్యాటకులు రాకపోవడంతో.. అక్కడి నీళ్లు తేటగా, స్వచ్ఛంగా కనిపిస్తున్నాయని రోమ్ ప్రజలు తెలిపారు. అంతేకాదు చాలా సంవత్సరాల నుంచి కనిపించని చేపలు, పెంగ్విన్ లు కనిపిస్తున్నాయన్నారు.
పెరిగిన పరిశుభ్రత:
కరోనా రాకుండా జాగ్రత్త పడాలంటే.. చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలని, ముఖానికి మాస్క్ లు ధరించాలని డాక్టర్లు సూచించడంతో ప్రజలంతా వాటిని తూచ తప్పకుండా పాటిస్తున్నారు. వీలైనవాళ్లు శానిటైజర్లు వాడుతున్నారు. అవి లేని వాళ్లు సబ్బులతో చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నారు. అయితే మన దేశంలో 50 శాతానికి పైగా ప్రజలు అన్నం తినేముందు, వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత, బయటకు వెల్లొచ్చిన తర్వాత ఇలా చాలా సందర్భాల్లో చేతులు కడుక్కోరిని ఓ సర్వేలో తేలింది. కానీ కరోనా కారణంగా ప్రజల్లో కాస్త మార్పు వచ్చింది. దాదాపు చాలా మంది విధిగా చేతులు , కాళ్లు కడుక్కుంటున్నారు.
తగ్గిన దొంగతనాలు, రొడ్డు ప్రమాదాలు:
లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇల్లకే పరిమితమవడంతో దొంగలు కూడా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా దొంగతనాలు జరగడం లేదు. క్రైమ్ రేట్ చాలా వరకు తగ్గినట్లు రికార్డుల ప్రకారం తెలుస్తోంది. వాహనాదారులు రోడ్లమీదకు రాకపోవడంతో రొడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి.
స్వేచ్ఛావిహరం:
మనిషి తన గూడు కోసం అడవులను నరికివేస్తూ వెళ్లాడు. దాంతో చాలా జంతువులకు గూడు లేకుండా పోయింది. చాలా జంతువులకు ఆహారం లేకుండా పోయింది. దాంతో ఎన్నో మూగజీవాలు కనుమరుగైపోయాయి. ఈ మధ్య కాలంలో అన్ని ప్రాంతాల్లో కోతుల బెడద పెరగడానికి అడవుల నరికివేతనే ప్రధానం కారణమని పర్యావరణ ప్రియులు అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్ రేడియోషన్ వల్ల పిట్టల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. కానీ కరోనా కారణంతో మనుషులు రోడ్లపై తిరగకపోవడంతో.. పిట్టలు మళ్లీ కనిపిస్తున్నాయి. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతున్నాయ్. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇది కూడా కరోనా వల్లే జరిగిందనడంలో ఏ సందేహం లేదు.
కుటుంబంతో:
నిత్యం పనులతో, బాధ్యతలతో సతమతమయ్యే వారికి కూడా కరోనా మంచే చేసిందని చెప్పాలి. కుటుంబ సభ్యులందరినీ ఒక్క చోటుకి చేర్చింది. ఉరుకుల పరుగుల జీవితంలో, టైమ్ తో పరుగులు తీసే ఎందరికో ఇంటి సభ్యులతో విలువైన సమయం గడిపే అవకాశం ఇచ్చింది. ఇంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణలకు ప్రణాళిక వేసుకునే వెసులుబాటు కల్పించిది.
మనిషి ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తూ పోతే.. వినాశనం తప్పదని కరోనా హెచ్చరిస్తుందన్నది పర్యావరణ ప్రియుల వాదన. అంతేకాదు.. మానవాళి ఇప్పుడు మేల్కొనక పోతే.. ఇంకా ముందు ముందు మరెన్నో భయంకరమైన వైరస్ లు, వ్యాధులు వస్తాయనడానికి కరోనా ముందస్తు సంకేతమని వారంటున్నారు. సో కరోనా వల్ల మానవాళికి ఎంతో నష్టం జరిగింది. అది కాదనలేని వాస్తవం. కానీ ప్రకృతికి లాభం చేకూరిందని అంటే.. దాని వల్ల మేలు పొందేది మనిషి కదా.
Tags: coronavirus, lockdown,man,humanity, decrease in pollution