టీఆర్‌ఎస్ పథకాలు బీజేపీ కాపీ?
తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌తోనే టీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకొచ్చినా.. ఆ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే రెండోసారి భారీ గెలుపునకు కారణమయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్రవేశపెట్టిన అన్ని పథకాలూ, అమలయ్యాయా? లేదా? అనే విషయం పక్కన పెడితే, వాటి వివరాలను ప్రజల్లోకి చేరవేయడంలో మాత్రం కేసీఆర్ అండ్ టీం ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, రుణమాఫీ, నిరుద్యోగభృతి, దళితులకు […]
తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌తోనే టీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకొచ్చినా.. ఆ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే రెండోసారి భారీ గెలుపునకు కారణమయ్యాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ప్రవేశపెట్టిన అన్ని పథకాలూ, అమలయ్యాయా? లేదా? అనే విషయం పక్కన పెడితే, వాటి వివరాలను ప్రజల్లోకి చేరవేయడంలో మాత్రం కేసీఆర్ అండ్ టీం ఫుల్ సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ, రుణమాఫీ, నిరుద్యోగభృతి, దళితులకు రెండెకరాల భూమి వంటి కొన్ని పథకాలు పూర్తి స్థాయిలో అమలుకాకపోయినా.. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, రైతు బంధు, పింఛన్ల పెంపు, రైతులకు 24గంటల ఉచిత కరెంట్, మిషన్ కాకతీయ వంటి పథకాలు ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే, కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలను బీజేపీ.. అటు కేంద్రంలో, ఇటు పాలిత రాష్ట్రాల్లో పేర్లు మార్చి కాపీ కొడుతున్నదని టీఆర్ఎస్ నాయకులు సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శిస్తున్నారు. దీనిలో నిజానిజాలెలా ఉన్నాయో ఓ సారి పరిశీలిద్దాం.
గత లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘రైతుబంధు’ పథకాన్ని ప్రధాని మోడీ ‘పీఎం కిసాన్’గా, ఇంటింటికీ తాగునీరు అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ను అదే లక్ష్యంతో ‘జల్ శక్తి అభియాన్’గా మార్చారని తెలిపారు. నిజానికి కేంద్రం ప్రవేశపెట్టిన ఆ రెండు పథకాలు కూడా రైతుబంధు, మిషన్ భగీరథ పథకాలకు దాదాపు దగ్గరి పోలికలే ఉంటాయి. అంతేకాకుండా 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ మ్యానిఫెస్టోలో అచ్చుగుద్దినట్టు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాల మాదిరిగానే ఉన్నాయి. కర్నాటకలోని సరస్సులు, చెరువులన్నింటినీ పునర్ వ్యవస్థీకరించే లక్ష్యంతో ‘మిషన్ కళ్యాణి’ అనే పథకం అమలు చేస్తామని హామీనిచ్చారు. ఇదే ఉద్దేశంతో తెలంగాణలో అంతకుముందు నుంచే ‘మిషన్ భగీరథ’ పథకం ఉన్న విషయం తెలిసిందే. అలాగే, ‘రైతు బంధు’ పథకం తరహాలోనే రైతులకు అండగా ‘రైత బంధు మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్’ను అమలు చేస్తామని వెల్లడించారు. ‘మిషన్ భగీరథ’ మాదిరిగానే స్వచ్ఛమైన తాగునీటి కోసం ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకొస్తే రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ తెలంగాణలో టీఆర్ఎస్ ఎప్పుడో ఇచ్చింది. ఇవేకాకుండా పరిశ్రమలకు వీలైనంత తొందర అనుమతినిచ్చే సింగిల్ విండో వ్యవస్థ ‘టి.ఎస్-ఐపాస్’ను కూడా ‘ఇంక్రీస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తామని బీజేపీ తెలిపింది. తెలంగాణలో స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రోత్సహించేందుకు టీ-హబ్ తీసుకొస్తే, ఇదే ఆలోచనతో కర్నాటకలో ఆరు కె-హబ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ‘కళ్యాణ లక్ష్మి’, ‘షాదీ ముబారక్’ లానే పేద కుటుంబాల్లో జరిగే ఆడపిల్లల వివాహాలకు కర్నాటకలోనూ ‘వివాహ్ మంగళ యోజనే’ పేరుతో మూడు గ్రాముల బంగారం, రూ.25వేలు అందజేస్తామని ప్రకటించారు. అయితే, ఇన్ని హామీలు ఇచ్చినప్పటికీ కర్నాటక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాలేదన్న విషయం అప్రస్తుతం. ఒక్క కర్నాటకలోనే కాకుండా నిన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లోనూ కళ్యాణ లక్ష్మీ తరహాలో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయంగా రూ.51వేలు అందజేస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది.
అయితే, కాంగ్రెస్ హయాంలోని పలు పథకాలను సైతం బీజేపీ దించేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో కాంగ్రెస్ పాలనలో ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్’ పథకాన్ని ‘జన్ ధన్ యోజన్’ గా, ‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రోగ్రామ్స్’..ను ‘బేటి బచావో బేటీ పడావో యోజన’గా, ‘ఆరోగ్య శ్రీ’ని.. ‘ఆయుష్మాన్ భవ’గా, ‘జన్ ఔషధీ’ పథకాన్ని.. ‘పీఎం జన్ ఔషధీ యోజన’గా, ‘నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ’ని.. ‘మేక్ ఇన్ ఇండియా’గా, ‘నేషనల్ ఇ-గవర్నెన్స్ ప్లాన్’ను.. ‘డిజిటల్ ఇండియా’గా, ‘నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’ను..‘స్కిల్ ఇండియా’గా మార్చి కాపీ కొట్టిందని విమర్శిస్తున్నారు. అయితే, ఓ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను మరో పార్టీ కాపీ కొట్టినా, లేదంటే కొత్తగా సృష్టించినా అంతిమంగా అందాల్సింది ప్రజలకే. కాబట్టి మంచిని ఎక్కడినుంచి తీసుకున్నా తప్పులేదనీ, అది ప్రజలకు ఉపయోగపడిందా లేదా అన్నదే ముఖ్యమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.