అక్రమాలు జరిగింది నిజమే.. అయినా చర్యల్లేవ్!

దిశ, నర్సంపేట: నియోజకవర్గంలోని పీఎస్‌సీఎస్ కేంద్రాల్లో మక్కల కొనుగోళ్లలో తీవ్ర అవినీతి జరుగుతోంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అక్రమంగా దోచుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఇస్తోన్న డబ్బులు తీసుకుంటూనే మరోవైపు రైతుల డబ్బులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే ఈ విధమైన అక్రమాలకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు చూపించినా నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అనుమానం […]

Update: 2021-08-31 05:57 GMT

దిశ, నర్సంపేట: నియోజకవర్గంలోని పీఎస్‌సీఎస్ కేంద్రాల్లో మక్కల కొనుగోళ్లలో తీవ్ర అవినీతి జరుగుతోంది. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాల్లో అక్రమంగా దోచుకుంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం ఇస్తోన్న డబ్బులు తీసుకుంటూనే మరోవైపు రైతుల డబ్బులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న అధికారులే ఈ విధమైన అక్రమాలకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు చూపించినా నేటికీ చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నర్సంపేట నియోజకవర్గంలోని పీఎస్‌సీఎస్ కేంద్రాల్లో గతేదాడి మక్కల కొనుగోళ్లు చేపట్టారు. కొనుగోలు అనంతరం ధాన్యం తరలించడానికి రవాణా ఖర్చుల్ని రైతుల నుండి ముక్కుపిండి మరీ వసూలు చేశారు. అనంతరం ప్రభుత్వం రైతులకు రవాణా ఖర్చులను మంజూరు చేసింది. ఆ మంజూరు చేసిన డబ్బులను రైతులకు చెల్లించాలని ఆదేశాలు సైతం జారీ చేసింది. ఈ మేరకు జీవో జారీ చేసి నెలలు గడుస్తున్నా రైతులకు మాత్రం నేటికీ నయా పైసా అందలేదు. ఈ విషయంపై బాధిత రైతులు జిల్లా సహకార అధికారికి వివరించగా, విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అసిస్టెంట్ సబ్ రిజిస్ట్రార్ నారాయణను ఆదేశించారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేసిన నారాయణ అసలు విషయం గుర్తించాడు. ప్రభుత్వం రవాణా ఖర్చుల నిమిత్తం రైతులకు రూ.4,22,000 మంజూరు చేసింది. కానీ, అది రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీనికి పీఎస్‌సీ‌ఎస్ మహమ్మదాపురం కొనుగోలు కేంద్రం అధికారులు కారణమని, రైతుల డబ్బులు దుర్వినియోగం అయింది నిజమేనని నారాయణ ఈ ఏడాది మార్చిలో నివేదిక అందించారు. ఈ నివేదిక అందించి ఆరు నెలలు గడుస్తున్నా అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోలేదు. దీంతో రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు వెనకడుగు వేస్తున్నారు

అధికార పార్టీ నాయకులకు అధికారులు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అవినీతి జరిగిందని తేలినప్పటికీ చర్యలు తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. అక్రమాలు జరిగాయని బయటపెట్టిన రైతులు నేటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అసలు అధికారుల నిర్లక్ష్యం వెనకున్న ఆంతర్యమేంటనేది తెలియడం లేదు. నియోజకవర్గంలోని ఒక్క సెంటర్‌లోనే ఇంత అవినీతి జరిగితే, డివిజన్‌లోని మిగతా 28 సెంటర్‌లలో ఎంత అవినీతి జరిగి ఉంటుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యులపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. – పాలడుగుల జీవన్, పీఎస్‌సీఎస్ వైస్ చైర్మన్, మహమ్మదాపురం

నా దగ్గర రూ.10 వేలు తీసుకున్నారు

మహమ్మదాపురం సొసైటీకి గతేడాది 200 బస్తాల మక్కలు వేశాను. రవాణా ఖర్చు కోసం నా దగ్గర రూ.10 వేలు తీసుకున్నారు. డబ్బులు మంజూరై చాలా కాలం అయింది. అయినా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. మా ఊరిలో చాలా మంది రైతులది ఇదే పరిస్థితి. నేటికీ ఒక్కరికి కూడా డబ్బులు రాలేదు. – రాజాలు, రైతు మహమ్మదాపురం

ఒక్క పైసా అందలేదు

పీఎస్‌సీ‌ఎస్ సొసైటీకి మక్కలు వేసి ఏడాది దాటింది. ప్రభుత్వం రవాణా ఖర్చులు తిరిగి ఇస్తుందని అన్నారు. కానీ, నేటికీ ఒక్క పైసా కూడా అందలేదు. అధికారులను కలిశాను, ఎవరూ న్యాయం చేయడం లేదు. – ఎద్దు కృష్ణంరాజు, రైతు మహమ్మదాపురం

Tags:    

Similar News