కొత్త ఫార్మాట్‌లో ఐపీఎల్ 2021
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ ముగిసి నెల రోజులు కాకముందే 14వ సీజన్ గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది. మరో నాలుగు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం కసరత్తు ప్రారంభమైంది. ఈ సారి మరో రెండు కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ సూత్రప్రాయంగా ఆంగీకరించింది. ఈ నెల 24న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 8 జట్లు లీగ్ ఆడితే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు […]
దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ ముగిసి నెల రోజులు కాకముందే 14వ సీజన్ గురించి విస్తృతమైన చర్చ జరుగుతున్నది. మరో నాలుగు నెలల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సీజన్ కోసం కసరత్తు ప్రారంభమైంది. ఈ సారి మరో రెండు కొత్త ఫ్రాంచైజీలకు బీసీసీఐ సూత్రప్రాయంగా ఆంగీకరించింది. ఈ నెల 24న జరిగే బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 8 జట్లు లీగ్ ఆడితే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌లు రౌండ్ రాబిన్ పద్దతిలో ఆడుతున్నాయి. ఇప్పుడు 10 జట్లయితే ప్రతీ జట్టు 18 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అలా జరిగితే ఐపీఎల్ సుదీర్ఘంగా జరగాల్సి ఉంటుంది. ఇది బీసీసీఐకి నష్టదాయకంగా మారుతుంది. అందుకే 10 జట్లు కనుక లీగ్ ఆడితే కొత్త ఫార్మాట్‌లో లీగ్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది.
గ్రూప్ పద్దతి..
ప్రస్తుతం ఐపీఎల్‌లో లీగ్ దశను రౌండ్ రాబిన్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ప్రతీ జట్టు ఒక హోం గ్రౌండ్ మ్యాచ్, మరొక ప్రత్యర్థి గ్రౌండ్ మ్యాచ్ ఆడుతుంది. అలా ప్రస్తుతం ఉన్న 8 జట్లు లీగ్ దశలో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడుతున్నది. అయితే రాబోయే సీజన్‌లో జట్ల సంఖ్య పెరిగితే రౌండ్ రాబిన్ పద్దతిలో మార్పు చేయాలని భావిస్తున్నది. 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించి రౌండ్ రాబిన్ పద్దతిలో ఆడించాలని అనుకుంటుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న జట్లు ఒక్కో జట్టుతో రెండు సార్లు, వేరే గ్రూప్‌లోని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనున్నది. 2011లో కూడా బీసీసీఐ ఇదే పద్దతిలో లీగ్ నిర్వహించింది. రెండు గ్రూపులు కలిపి టాప్ 4 పొజిషన్‌లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. ఇక రెండు గ్రూపులను డ్రా పద్దతిలో విడదీస్తారు. లీగ్ ప్రారంభానికి ముందే ఈ డ్రా నిర్వహిస్తారు. ఈ పద్దతి వల్ల గతంలో కంటే మ్యాచ్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉండదు. అంతే కాకుండా పోటీ కూడా మరింత టఫ్‌గా మారి ఐపీఎల్‌కు ఆదరణ లభిస్తుందని బీసీసీఐ భావిస్తున్నది.
ఇరువురికి నష్టం లేదు..
కరోనా కారణంగా యూఏఈలో ఐపీఎల్ 13 సీజన్ నిర్వహించారు. దీని ద్వారా బీసీసీఐకి ఆదాయం వచ్చినా.. గత ఏడాదితో పోల్చుకుంటే లాభాలు మాత్రం తగ్గాయి. విదేశాల్లో నిర్వహించడం వల్లే లాభాలు తగ్గిపోవడంతో కొత్త జట్లను చేర్చడం ద్వారా లాభాలు పెంచుకోవాలని బీసీసీఐ వ్యూహం రచిస్తున్నది. బ్రాడ్‌కాస్టర్ స్టార్ ఇండియా మ్యాచ్‌లు సంఖ్య పెరిగితే మ్యాచ్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నది. అంతే కాకుండా బీసీసీఐకి కూడా మ్యాచ్‌ల సంఖ్య పెరగడం వల్ల నష్టమే. కాబట్టి జట్లు పెరిగినా మ్యాచ్‌ల సంఖ్యను మాత్రం పెంచకూడదని బీసీసీఐ భావిస్తోంది. దీనివల్ల బీసీసీఐకే కాకుండా స్టార్ ఇండియాకు కూడా నష్టం ఉండదని తెలుస్తున్నది. అహ్మదాబాద్‌తో పాటు లక్నో నుంచి మరో ఫ్రాంచైజీ కొత్త సీజన్లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త టీమ్‌లకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కొత్త ఫార్మాట్‌పై కసరత్తు చేయనున్నది.