ఐపీఎల్ కోసం స్పాన్సర్లు క్యూ కడుతున్నారు
దిశ, స్పోర్ట్స్: ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండిపోయినా.. ఇతర బోర్డులు క్రికెట్ మ్యాచ్‌లు రద్దు చేసుకున్నా.. బీసీసీఐ మాత్రం క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ను విదేశీ గడ్డపై విజయవంతంగా నిర్వహించింది. వీవో వంటి స్పాన్సర్లు వెనకడుగు వేయడం.. యూఏఈలో భారీగా ఖర్చు పెట్టాల్సి రావడం.. ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గేట్ ఆదాయం కూడా రాకపోవడంతో బీసీసీఐ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. గత సీజన్‌లో 50 శాతం వరకు ఆదాయం కోల్పోయినట్లు బీసీసీఐ స్వయంగా ప్రకటించింది. […]
దిశ, స్పోర్ట్స్: ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉండిపోయినా.. ఇతర బోర్డులు క్రికెట్ మ్యాచ్‌లు రద్దు చేసుకున్నా.. బీసీసీఐ మాత్రం క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌ను విదేశీ గడ్డపై విజయవంతంగా నిర్వహించింది. వీవో వంటి స్పాన్సర్లు వెనకడుగు వేయడం.. యూఏఈలో భారీగా ఖర్చు పెట్టాల్సి రావడం.. ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గేట్ ఆదాయం కూడా రాకపోవడంతో బీసీసీఐ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. గత సీజన్‌లో 50 శాతం వరకు ఆదాయం కోల్పోయినట్లు బీసీసీఐ స్వయంగా ప్రకటించింది. కానీ లాభాలు మాత్రం ఖజానాలో వేసుకున్నది. కానీ, ఈ ఏడాది పరిస్థితి మారిపోయింది. గత ఏడాది వెనకడుగు వేసిన స్పాన్సర్లే తిరిగి బీసీసీఐ వద్దకు వచ్చారు. 3 అధికార స్పాన్సర్ల బదులు ఈ సారి ఐదుగురు స్పాన్సర్లు వచ్చారు. అంతే కాకుండా అటు స్టార్ ఇండియాకు యాడ్స్ ఇవ్వడానికి కూడా కార్పొరేట్లు క్యూ కడుతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్‌కు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు.
తిరిగొచ్చిన వీవో.. కొత్తగా చేరిన అప్‌స్టాక్స్
ఇండో-చైనా ఉద్రిక్తల నేపథ్యంలో గత సీజన్ టైటిల్ స్పాన్సర్‌గా వీవోను తప్పించారు. ఏడాదికి రూ. 440 కోట్లు వీవో ద్వారా బీసీసీఐ ఖజానాలో చేరేవి. కానీ చివరి నిమిషంలో ఫాంటసీ లీగ్ సంస్థ డ్రీమ్11తో కేవలం రూ. 220 కోట్లకే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో గత ఏడాది టైటిల్ స్పాన్సర్ ద్వారా రూ. 220 కోట్ల నష్టం వాటిల్లింది. అంతే కాకుండా పలువురు అధికారిక భాగస్వామ్యులు కూడా వెనకడుగు వేయడంతో గత ఏడాది 50 శాతం ఆదాయం కోల్పోయింది. కానీ ఈ ఏడాది రూ. 708 కోట్ల మేర ఆదాయం పెరిగినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
గత ఏడాది కంటే ఇది 100 శాతం అధికమని వారు చెబుతున్నారు. టైటిల్ స్పాన్సర్ వీవో రూ. 440 కోట్లు, ఐదుగురు అఫీషియల్ భాగస్వాముల ద్వారా రూ. 210 కోట్లు, అంపైర్ స్పాన్సర్ ద్వారా రూ. 28 కోట్లు, టైమ్ అవుట్ పార్టనర్ ద్వారా రూ. 30 కోట్లు బీసీసీఐ ఆదాయం రానుంది. బీసీసీఐకి ఆదాయం పెరిగితే తద్వారా ఫ్రాంచైజీలకు కూడా ఆదాయం పెరుగుతుంది. బీసీసీఐకి వచ్చే ఆదాయాన్ని సమానంగా అన్ని ఫ్రాంచైజీలకు పంపిణీ చేస్తారు. దీంతో ఫ్రాంచైజీలు కూడా ఈ సారి చాలా సంతోషంగా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో తొలి సారిగా స్టాక్ బ్రోకింగ్ సంస్థ బీసీసీఐతో జత కట్టింది. అప్‌స్టాక్స్ అనే సంస్థ అధికారిక భాగస్వామిగా మూడేళ్ల కాంట్రాక్టు కుదుర్చుకుంది. రతన్ టాటాకు ఈ సంస్థలో మెజార్టీ వాటాలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)తో కూడా అప్‌స్టాక్స్ ఒప్పందం చేసుకున్నది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన జారీ కానున్నది.
స్టార్‌కు లాభాలే..
ఐపీఎల్‌ను ప్రసారం చేస్తున్న స్టార్ ఇండియా కూడా ఈ సారి యాడ్స్ ద్వారా భారీగా ఆర్జించబోతున్నది. గత ఏడాది కంటే ఈ సారి రూ. 1200 కోట్లు ఎక్కువగా సంపాదించాలని లక్ష్యం పెట్టుకున్నట్టు సమాచారం. ఈ సారి ఒక్కో యాడ్‌కు 10 సెకెన్లకు రూ. 13 లక్షల నుంచి రూ. 13.5 లక్షల వరకు సంపాదించనున్నది. స్టార్ సంస్థతో కో స్పాన్సర్ ప్యాకేజీ రూ. 120 కోట్లుగా నిర్దారించినట్లు సమాచారం. దీంతో పాటు అన్ని ఫ్రాంచైజీలు ప్రత్యేకంగా టైటిల్ స్పాన్సర్ వేటలో పడ్డాయి. ఇప్పటికే సీఎస్కే, ఆర్సీబీ బడా కంపెనీలను లైన్‌లో పెట్టాయి. దీని ద్వారా ఫ్రాంచైజీలు అదనపు ఆదాయం ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకులను అనుతించే విషయంపై ఇంకా స్పష్టత రానందున గేట్ ఆదాయంపై బీసీసీఐ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. సగం లీగ్ తర్వాత అయినా ప్రేక్షకులను అనుమతిస్తే ఆ మేరకు ఆదాయం పెరిగే అవకాశం ఉన్నదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.