డేవిడ్ మలన్ కోసం ఫ్రాంచైజీల పోటీ

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ టీ20 స్టార్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్ కోసం ఈ సారి ఐపీఎల్ వేలం పాటలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ మలన్.. గత కొంత కాలంగా దూకుడుకు మారుపేరుగా మారిపోయాడు. నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో అండగా ఉంటున్న డేవిడ్ మలన్ గత ఏడాది క్రికెట్ లీగ్స్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో హోబట్ హరికేన్స్ […]

Update: 2021-02-07 10:40 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ టీ20 స్టార్ బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్ కోసం ఈ సారి ఐపీఎల్ వేలం పాటలో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో ఉన్న డేవిడ్ మలన్.. గత కొంత కాలంగా దూకుడుకు మారుపేరుగా మారిపోయాడు. నిలకడైన ప్రదర్శనతో జట్టు విజయాల్లో అండగా ఉంటున్న డేవిడ్ మలన్ గత ఏడాది క్రికెట్ లీగ్స్‌లో హాట్ ఫేవరెట్‌గా ఉన్నాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో హోబట్ హరికేన్స్ తరపున ఆడుతున్న ఈ స్టార్ క్రికెటర్.. ఈ సారి ఐపీఎల్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నెల 18న చెన్నైలో ఐపీఎల్ మినీ వేలంలో డేవిడ్ మలన్‌ను తీసుకోవాలని పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

మలన్ కోసం..

ఐపీఎల్ 13వ సీజన్‌లో కొన్ని ఫ్రాంచైజీలు సరైన ఆటగాళ్లు లేక ఇబ్బందులు పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఆఫ్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరైన బ్యాట్స్‌మెన్ దొరక ఇబ్బంది పడ్డాయి. శనివారం ముగిసిన బీబీఎల్‌ సీజన్‌లో మలన్ నిరాశాజనకమైన ప్రదర్శన చేశాడు. కానీ అతడి ఐసీసీ ర్యాంకింగ్, గత మ్యాచ్‌లలో అతడి బ్యాటింగ్‌లో దూకుడు పరిశీలించిన పలు ఫ్రాంచైజీలు ఈ సీజన్‌లో మలన్ జట్టులో ఉంటే బ్యాటింగ్‌లో బలం పెరుగుతుందని భావిస్తున్నాయి. బీబీఎల్‌ 2021లో 10 మ్యాచ్‌లు ఆడిన మలన్ 265 పరుగులు చేశాడు. అతడి అత్యధిక స్కోర్ 75 మాత్రమే. అయినా సరే మలన్ కోసం ఆ మూడు ఫ్రాంచైజీలతో పాటు ఇతరులు కూడా పోటీ పడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

బేస్ ప్రైస్ రూ. 1.5 కోట్లు

ఐపీఎల్‌ మినీ వేలంలో డేవిడ్ మలన్ బేస్ ప్రైస్ రూ. 1.5 కోట్లుగా నిర్ణయించారు. అయితే ఈ సారి వేలంలో ఇతడి కోసం పోటీ గట్టిగా ఉండటంతో రికార్డు ధరకు అమ్ముడు పోతాడని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో అత్యధిక ధర పొందిన బెన్ స్టోక్స్ (రూ. 14.5 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (రూ. 10.5 కోట్లు), క్రిస్ మోరీస్ (రూ. 10 కోట్లు) ధరను ఈ సారి డేవిడ్ మలన్ అధిగమించే అవకాశం ఉన్నది. లండన్‌లో పుట్టి సౌతాఫ్రికాలో పెరిగిన డేవిడ్ మలన్ తండ్రి, సోదరుడు కూడా ఫస్ట్ క్లాస్ ఆడిన క్రికెటర్లే. 2006లో మిడిల్‌సెక్స్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన డేవిడ్.. 2019 నుంచి మిడిల్‌సెక్స్ తరపున ఆడుతున్నాడు. ఆ జట్టుకు మూడు ఫార్మాట్లలో మలన్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న మలన్ చాలా ఆలస్యంగా ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. టీ20 క్రికెట్‌లో అతి తక్కువ కాలంలోనే ప్రపంచ నెబర్ 1 ర్యాంకర్‌గా ఎదిగాడు.

Tags:    

Similar News