సమయం ఆసన్నమైంది.. నేడే ఐపీఎల్ ఆరంభం
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో క్రికెట్ పండుగ మరోసారి మొదలు కాబోతున్నది. చుక్కలనంటే సిక్సర్లు.. మెరుపు వేగంతో దూసుకెళ్లే బౌండరీలు మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. పరుగుల వరద పారించి తమన జట్లను గెలిపించేందుకు బ్యాట్స్‌మెన్ రెడీగా ఉంటే.. వారిని కట్టడి చేసే అద్భుతమైన బంతులు వేయడానికి బౌలర్లు సిద్దపడుతున్నారు. బ్యాట్స్‌మెన్ గేమ్ అయిన క్రికెట్‌లో వారిదే ఆధిపత్యం.. ఇక ఐపీఎల్ వంటి క్రికెట్ లీగ్‌లో బ్యాట్స్‌మెన్ ఆపడం ఎవరి తరమూ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించని వైవిధ్యమైన […]
దిశ, స్పోర్ట్స్: ఇండియాలో క్రికెట్ పండుగ మరోసారి మొదలు కాబోతున్నది. చుక్కలనంటే సిక్సర్లు.. మెరుపు వేగంతో దూసుకెళ్లే బౌండరీలు మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయనున్నాయి. పరుగుల వరద పారించి తమన జట్లను గెలిపించేందుకు బ్యాట్స్‌మెన్ రెడీగా ఉంటే.. వారిని కట్టడి చేసే అద్భుతమైన బంతులు వేయడానికి బౌలర్లు సిద్దపడుతున్నారు. బ్యాట్స్‌మెన్ గేమ్ అయిన క్రికెట్‌లో వారిదే ఆధిపత్యం.. ఇక ఐపీఎల్ వంటి క్రికెట్ లీగ్‌లో బ్యాట్స్‌మెన్ ఆపడం ఎవరి తరమూ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించని వైవిధ్యమైన షాట్లు ఆడటానికి ప్రతీ బ్యాట్స్‌మెన్ ప్రయత్నిస్తుంటాడు. ఇక బౌలర్లు యార్కర్లు, కట్టర్లు, గూగ్లీలు, ప్లిప్పర్లు, క్యారమ్ బంతులను మరింత పదునుగా ఉపయోగించి వారికి కట్టడి చేస్తూనే ఉంటారు. బ్యాట్, బాల్ మధ్య జరిగే ఈ సమయంలో ఎవరు గెలిచారన్నని పక్కనపెడితే ఈ 52 రోజులు క్రికెట్ అభిమానులకు కన్నుల పండుగే.
ప్రేక్షకులకు నో ఎంట్రీ..
కరోనా కారణంగా గత ఏడాది ఇండియా వెలుపల నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండేళ్ల తర్వాత తిరిగి సొంత దేశానికి తరలివచ్చింది. గతంలో కంటే తక్కువ సమయంలోనే ఐపీఎల్‌ను ముగించేలా బీసీసీఐ షెడ్యూల్ రూపొందించింది. 52 రోజుల పాటు జరిగే ఈ మెగా లీగ్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా స్టేడియంలలోకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. అయితే టీవీ, ఓటీటీ వంటి మాధ్యమాల్లో ప్రేక్షకులు మ్యాచ్‌లు వీక్షించేందుకు స్టార్ ఇండియా అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి విడతలో చెన్నై, ముంబై వేదికలుగా మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇప్పటికే ఆయా జట్ల ప్రేక్షకులు మ్యాచ్‌ల కోసం పూర్తి సాధన చేస్తున్నారు. శుక్రవారం తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగనున్నది.
ఫేవరెట్లు ముంబై ఇండియన్స్..
ఐపీఎల్ 14వ సీజన్ ఫేవరెట్లు ముంబై ఇండియన్సే అని విశ్లేషకులు చెబుతున్నారు. గత సీజన్‌లో ఆడిన జట్టే ఈ సారి కూడా బరిలోకి దిగుతున్నది. జట్టులో పెద్దగా మార్పులు ఏమీ లేవు. ఐపీఎల్ 13వ సీజన్ ముగిసి ఐదు నెలలే అయ్యింది. జట్టులోని ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నది. ముంబై జట్టును ఓడించాలంటే ప్రత్యర్థులు కష్టపడాల్సిందే. ఇక తొలి మ్యాచ్‌లో ముంబై జట్టుతో తలపడనున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గత ఏడాది ప్లేఆఫ్స్‌కు చేరుకున్నది. గత సీజన్‌లో అద్బుతంగా ఆడిన ఆ జట్టు చివరి ఐదు మ్యాచ్‌లు ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సారి జట్టులోకి మ్యాక్స్‌వెల్ చేరడం బ్యాటింగ్‌కు అదనపు బలం. కరోనా నుంచి పడిక్కల్ కోలుకొని జట్టుతో చేరాడు. అయితే తొలి మ్యాచ్‌లో అతడికి చోటు దక్కుతుందా లేదో చూడాలి.
ప్లేఆఫ్స్ అంచనా..
సీజన్ ప్రారంభం కాకముందే ప్లేఆఫ్స్‌కు ఏ జట్లు చేరతాయనే అంచనా వేయలేము. అయితే గత సీజన్ ప్రదర్శన, ప్రస్తుతం జట్టులో ఉన్న క్రికెటర్ల ఫామ్‌ను బట్టి విశ్లేషకులు ఒక అంచనా వేస్తున్నారు. ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ఆయా జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ సమతూకంగా ఉండటంతో పాటు మంచి ఫామ్‌లో ఉండటం కలసి వస్తుందని అంటున్నారు.
పిచ్ ఎలా ఉంది?
తొలి విడతలో చెన్నై చేపాక్, ముంబై వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. చెన్నైలో ఇటీవల ఇండియా-ఇంగ్లాండ్ మధ్య రెండు టెస్టులు జరిగాయి. తొలి టెస్టుకు ఫ్లాట్ పిచ్ ఉపయోగించడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేశారు. వారిని నిలువరించడం బౌలర్ల వల్ల కాలేదు. దీంతో రెండో టెస్టుకు స్పిన్ పిచ్ ఉపయోగించారు. ఇందులో టీమ్ ఇండియా స్పిన్నర్లు రాణించారు. ఐపీఎల్‌లో ఫ్లాట్ పిచ్‌నే ఉపయోగించే వీలుంది. చెన్నై పిచ్‌పై పరుగుల వరద పారే అకాశం ఉన్నది. గత సీజన్‌లో చేపాక్ పిచ్‌పై 145 సగటు పరుగులుగా నమోదైంది. ఈ పిచ్‌పై ఛేదన సులభంగా ఉంటుంది. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియం పూర్తిగా బ్యాట్స్‌మాన్‌కు సహకరిస్తుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉన్నది. వాంఖడేలో తొలి ఇన్నింగ్స్ సగటు 240గ ఉంది. భారీ స్కోర్లను ఛేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి.
ఎక్కడ వీక్షించవచ్చు..?
ఐపీఎల్ 14వ సీజన్‌ను డిస్నీ స్టార్ ఇండియా గ్రూప్ తమ నెట్‌వర్క్‌లో ప్రసారం చేస్తున్నది. 25 చానల్స్‌లో 8 భాషల్లో మ్యాచ్‌లను ప్రసారం చేయనున్నట్లు స్టార్ ఇండియా ప్రకటించింది. స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 చానల్స్‌లో హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రసారాలు వీక్షించవచ్చు. దీంతో పాటు ప్రాంతీయ భాషల్లో స్టార్ స్పోర్ట్స్ తమిళ్, స్టార్ స్పోర్ట్స్ తెలుగు, స్టార్ స్పోర్ట్స్ కన్నడ, స్టార్ స్పోర్ట్స్ బంగ్లా, స్టార్ స్పోర్ట్స్ ప్రవాహ్, ఏసియా నెట్ ప్లస్‌లో వీక్షించవచ్చు. ఆదివారాల్లో విజయ్ సూపర్, స్టార్ మా మువీస్, స్టార్ సువర్ణ, స్టార్ జల్సా చానల్స్‌లో ప్రసారం చేస్తారు. ఈ చానల్స్‌తో పాటు డిస్నీ+హాట్‌స్టార్‌లో ఐదు భాషల్లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. జియో అకౌంట్ ఉన్న వాళ్లు జియో క్రికెట్ టీవీ, ఎయిట్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో కూడా ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించే అవకాశం ఉంటుంది.