నగరంలో ఈ మెట్రో రైలుకేమైంది..!

దిశ, తెలంగాణ బ్యూరో: భాగ్యనగర ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెట్రో రైల్​ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. మెట్రో ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా బాలారిష్టాలు ఇంకా తొలగలేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో మెట్రో సర్వీసులపై ప్రయాణికులకు నమ్మకం సన్నగిల్లుతోంది. విద్యుత్ స‌ర‌ఫరాలో స‌మ‌స్యలు, సిగ్నల్​ వ్యవస్థ లోపాలు, ట్రాక్‌లపై ఫ్లెక్సీలు పడిపోవడం వంటి సమస్యలతో పదుల సంఖ్యలో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా సిగ్నల్​ సమస్య కారణంగా మెట్రో ప్రయాణానికి […]

Update: 2021-01-06 20:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భాగ్యనగర ప్రజలకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెట్రో రైల్​ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. మెట్రో ప్రారంభమై మూడేళ్లు గడుస్తున్నా బాలారిష్టాలు ఇంకా తొలగలేదు. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో మెట్రో సర్వీసులపై ప్రయాణికులకు నమ్మకం సన్నగిల్లుతోంది. విద్యుత్ స‌ర‌ఫరాలో స‌మ‌స్యలు, సిగ్నల్​ వ్యవస్థ లోపాలు, ట్రాక్‌లపై ఫ్లెక్సీలు పడిపోవడం వంటి సమస్యలతో పదుల సంఖ్యలో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. తాజాగా సిగ్నల్​ సమస్య కారణంగా మెట్రో ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో మెట్రో ప్రతిష్ట మసకబారుతోంది.

హైదరాబాద్ మెట్రోలో టెక్నికల్ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రపంచస్థాయి టెక్నాలజీ, రవాణా వ్యవస్థలను అందించేందుకు తీసుకొచ్చిన హైదరాబాద్ మెట్రో సర్వీసుల్లో కొత్త లోపాలు బయటపడుతున్నాయి. మూడేండ్ల కింద ప్రారంభమైన మెట్రో వివాదాలకు కేంద్రంగా మారింది. వ్యవస్థలోని లోపాల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడం, ప్రయాణికులు కూడా భయాందోళనలకు గురయ్యే ఘటనలు చోటు చేసుకుంటుండటం మెట్రో ప్రతిష్టను మసక బారుతోంది.

సమస్యలు ఏవైనా మెట్రో అధికారుల నిర్వాకం కారణంగా అత్యంత వేగమైన ప్రయాణం అందిస్తామన్న రవాణా వ్యవస్థ తన స్టాండర్డ్స్‌ను కోల్పోతోంది. మెట్రో అందుబాటులోకి వచ్చిన మూడేళ్లలో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. మెట్రో స్టేషన్ పెచ్చులూడి మీదపడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన పెద్ద సంచలనంగా మారింది. మెట్రో ప్రయాణాల్లో, టెక్నాలజీలో వస్తున్న అంతరాయాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇష్టారీతిగా పనిచేసే టైమర్లు, షెడ్యూల్ ప్రకారం నడవని రైళ్లు ఇందుకు ఉదాహరణలు.. సిటీలో ట్రాఫిక్‌ను తప్పించుకుని అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుస్తాయనుకున్న మెట్రో ట్రైన్లు నిలిచిపోతున్నాయి. విద్యుత్ స‌ర‌ఫరాలో స‌మ‌స్యలు, సిగ్నలింగ్ వ్యవస్థ లోపాలు, ట్రాక్‌లపై ఫ్లెక్సీలు పడిపోవడం వంటి సమస్యలతో పదుల సంఖ్యలో మెట్రో సర్వీసులు ఆగిపోయాయి. తాజాగా సిగ్నలింగ్ సమస్య కారణంగా మెట్రో రైళ్ల ప్రయాణానికి అంతరాయం కలిగింది.

సీబీటీసీ టెక్నాలజీలో అంతరాయం..

రాష్ట్రంలో అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో చాలా ప్రతిష్టాత్మకత కలిగి ఉంది. హెచ్ఎంఆర్ఎల్, ఎల్ అండ్ టీ సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందిస్తున్నామని మెట్రో అధికారులు ప్రకటిస్తున్నారు. దాదాపు 200 దేశాల్లో ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఇక్కడ వాడుతున్నట్లు హెచ్ఎంఆర్ ప్రకటించింది. అయినా చాలా చిన్నచిన్న లోపాలతో మెట్రో నెట్టుకొస్తుండడం గమనార్హం. కమ్యూనికేషన్ బేస్‌డ్ ట్రైన్ కంట్రోల్ (సీబీటీసీ) విధానంలో వచ్చిన లోపం కారణంగా మంగళవారం ఉదయం మెట్రో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.

నాగోల్ – అమీర్ పేట రూట్‌లో సుమారు అరగంటకు పైగా సిగ్నలింగ్ వ్యవస్థలో లోపంతో రైళ్లు నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆఫీసుకు వెళ్లే సమయంలో ఆలస్యం కావడంతో ఒకింత అసహనానికి లోనయ్యారు. వాహనాల రద్దీ, ట్రాఫిక్ జామ్​ సమస్యలను అధిగమించి సమయానికి ఆఫీసు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతున్న సందర్భంలో ఇలా ఝలక్ ఇవ్వడంతో సర్వీసులపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆటోమేటిక్ వ్యవస్థలో సమస్యలు వచ్చిన మాట వాస్తవమేనని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. పది నిమిషాల్లోనే సమస్యను పరిష్కరించి, సర్వీసులను సాధారణ స్థితిలోకి తీసుకొచ్చామన్న ఆయన 20 నిమిషాల పాటు మాన్యువల్ పద్ధతిలో రైళ్లు నడిపించినట్టు స్పష్టం చేశారు.

గతంలోనూ అనేక సార్లు..

మెట్రో రైళ్లు ఆగిపోవడం, టెక్నికల్ సమస్యలనేవి చాలా సాధారణంగా మారిపోయాయి. అయితే, నమ్మకంతో మెట్రోను ఆశ్రయిస్తున్న ప్రజలకు బాధలు తప్పడం లేదు. ప్రస్తుతమున్న వ్యవస్థ ప్రకారం నాగోల్ నుంచి మియాపూర్ వరకూ గరిష్ఠంగా 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ, ఇలాంటి సమస్యలతో ఆ సమయం గంటన్నర వరకూ పొడగించాల్సి వస్తోంది. సమస్యలు చిన్నవే అయినప్పటికీ సమయ భారాన్ని పెంచి, ప్రయాణికుల్లో చికాకు పెంచడంతో వారిలో విశ్వాసం సన్నగిల్లుతోంది. గతంలోనూ మెట్రో రైళ్లు ఇలా ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రాక్‌లపై రైళ్లు కదలకపోవడంతో ఎమర్జెన్సీ డోర్ల ద్వారా ప్రయాణికులను కిందకు దించాల్సి వచ్చింది. బేగంపేట – అమీర్ పేట మధ్య రాత్రి 8 గంటల సమయంలో విద్యుత్ సమస్య కారణంగా రైళ్లు ఆగిపోయినపుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డామని ప్రయాణికులు చెప్పుకొచ్చారు.

పట్టాలపై సిగ్నలింగ్‌కు సబంధించి ఇనుప రాడ్ పడిపోయి కూడా రైళ్లు ఆగిపోయాయి. ఆ సమయంలో కాలుష్యం కారణంగా రైళ్లు ఆగిపోయాయంటూ మెట్రో అధికారులు ప్రకటించడం కొసమెరుపు. మెట్రోలో టెక్నికల్​సమస్యలు పునరావృతమవుతుంటే పరిష్కరించాల్సింది పోయి అందివచ్చిన సాకులను చెబుతూ మెట్రో అధికారులు ప్రకటనలు చేస్తున్నారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఏకంగా టికెట్ కౌంటర్లు మూసివేయడంతో పాటు రైళ్లను రద్దు చేసిన రోజులు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత అన్ని జాగ్రత్తలతో మెట్రో సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయినా అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సాంకేతిక సమస్యలతో ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే మెట్రో తన ప్రతిష్టను కోల్పోక తప్పదు. ఇప్పటికైనా మెట్రో అధికారులు సమర్థవంతంగా సర్వీసులు నడిపించే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ప్రయాణికులు కోరుతున్నారు.

Tags:    

Similar News