గులాబీలో వర్గపోరు..!

దిశ, మేడిపల్లి: ఫిర్జాదిగూడ కార్పొరేషన్‎లో టీఆర్ఎస్ ​కమిటీల లొల్లి రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. నువ్వా.. నేనా అన్నట్టుగా కమిటీలు వేస్తున్నారు. తొలుత కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో దర్గా దయాకర్ రెడ్డి ఈనెల 16న విలేకరుల సమావేశంలో కమిటీని ప్రకటించారు. ఈ తతంగం ముగిసిన కొద్ది వ్యవధిలోనే మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మరో కమిటీని వేసి పేర్లను వెల్లడించారు. ఇలా ఒక్కటే కార్పొరేషన్‎లో రెండు కమిటీలు ప్రకటించిన ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. […]

Update: 2020-09-24 21:16 GMT

దిశ, మేడిపల్లి: ఫిర్జాదిగూడ కార్పొరేషన్‎లో టీఆర్ఎస్ ​కమిటీల లొల్లి రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. నువ్వా.. నేనా అన్నట్టుగా కమిటీలు వేస్తున్నారు. తొలుత కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో దర్గా దయాకర్ రెడ్డి ఈనెల 16న విలేకరుల సమావేశంలో కమిటీని ప్రకటించారు. ఈ తతంగం ముగిసిన కొద్ది వ్యవధిలోనే మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మరో కమిటీని వేసి పేర్లను వెల్లడించారు. ఇలా ఒక్కటే కార్పొరేషన్‎లో రెండు కమిటీలు ప్రకటించిన ఇద్దరు నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరింది. దీంతో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వద్దకు కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు, రెండు వర్గాల నేతలు చేరుకొని జరిగిన విషయాన్ని మంత్రికి వివరించారు.

రెండు కమిటీల భవిష్యత్​ఎటూ తేలకపోవడంతో ఇదే అదనుగా మూడో కమిటీ తెరమీదకి వచ్చింది. డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ త్వరలోనే కమిటీని వేయయనున్నట్లు ప్రకటించారు. పార్టీకి పని చేసిన వారిని ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నాయకులను తోటి కార్పొరేటర్లను కలుపుకొని కమిటీ ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే అందరినీ కలుపుకొని పోయిన నాయకుడికే మద్దతు ఇవ్వాలని కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు ఒక్కతాటి పైకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. టీఆర్ఎస్​లోనే ఇలా రోజుకో కమిటీ, నాయకుల వర్గ పోరు తెరపైకి రావడంతో ప్రజలు, పార్టీ నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

కార్పొరేషన్‎లో కమిటీల కుంపటి రాజుకోవడంతో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. కార్పొరేషన్‎లో నగర పార్టీ అధ్యక్షుడి హోదాలో దర్గా దయాకర్ రెడ్డి కమిటీని ప్రకటిస్తే ఆ కమిటీతో సంబంధం లేదని వారి వర్గానికే కమిటీలో కేటాయింపులు జరిగాయని, సమాచారం లేకుండా కమిటీ వేశారంటూ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి మరో కమిటీని ప్రకటించారు. ఇదిలా ఉంటే అందరినీ కలుపుకొని పోలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో అందరూ మెచ్చేలా.. నచ్చేలా త్వరలో మరో కమిటీని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నానని డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ తెలిపారు. నిజానికి వర్గపోరు ఇలానే కొనసాగితే టీఆర్ఎస్ పార్టీకి తీరని నష్టం జరుతుందని కింది స్ధాయి కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు.

ఎవరికీ వారే అన్నట్లుగా కమిటీలను ప్రకటించడంపై కార్పొరేషన్ పరిధిలో చర్చ మొదలైంది. పార్టీ ప్రతిష్ట దెబ్బతింటోంది. ఈక్రమంలో మంత్రి మల్లారెడ్డి స్పందన కోసమే నాయకులంతా ఎదురుచూస్తున్నారు. ఆయన జోక్యం చేసుకొని నాయకుల మధ్య సయోధ్య కుదురుస్తారో లేదో అని వేచిచూస్తున్నారు. నిజానికి మంత్రి జోక్యం చేసుకొని ఏ కమిటీకి ఆమోద ముద్ర వేస్తారోనని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News