మోడ్రన్ ఆదిశక్తి… చిన్మయి శ్రీపాద

దిశ, స్పెషల్‌డెస్క్: తను గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. కానీ, అదంతా వృత్తిలో భాగమే. నిజజీవితంలో ఆమె నిస్సహాయ మహిళలకు పెద్ద భరోసా. సినిమాల్లో హీరోయిన్లకు గాత్రదానం చేసి, విజయాలను అందించినట్లే… సోషల్ మీడియాలో కూడా ఆడవాళ్లకు అండగా తన గొంతు వినిపించి, వారిలో ధైర్యాన్ని నింపుతారు. ఆమే చిన్మయి శ్రీపాద. సమంతలో సగం మాత్రమే అని కాదు.. మొత్తం మహిళా కుటుంబానికి సొంత అక్కలా చిన్మయి పేరు తెచ్చుకుంది. నగ్న చిత్రాలు పంపమని […]

Update: 2020-03-08 05:35 GMT

దిశ, స్పెషల్‌డెస్క్: తను గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని అందరికీ తెలుసు. కానీ, అదంతా వృత్తిలో భాగమే. నిజజీవితంలో ఆమె నిస్సహాయ మహిళలకు పెద్ద భరోసా. సినిమాల్లో హీరోయిన్లకు గాత్రదానం చేసి, విజయాలను అందించినట్లే… సోషల్ మీడియాలో కూడా ఆడవాళ్లకు అండగా తన గొంతు వినిపించి, వారిలో ధైర్యాన్ని నింపుతారు. ఆమే చిన్మయి శ్రీపాద. సమంతలో సగం మాత్రమే అని కాదు.. మొత్తం మహిళా కుటుంబానికి సొంత అక్కలా చిన్మయి పేరు తెచ్చుకుంది. నగ్న చిత్రాలు పంపమని అడిగిన వాడికి లిప్‌స్టిక్ ఫొటోలు పంపి చెంపదెబ్బ కొట్టినట్లు సమాధానం చెప్పడం ఆమెకే చెల్లుతుంది. తమకు జరిగిన అన్యాయాన్ని అక్కతో పంచుకున్నట్లుగా ఒక్కొక్కరు పంచుకుంటుంటే. చదివి కళ్లు చెమ్మగిల్లినా.. న్యాయం కోసం పోరాటం చేయాలనే తపన ఆమెది. ప్రత్యర్థి ఎంతటి పలుకుబడి ఉన్నవాడైనా ఎదురు నిలబడే ధైర్యం ఆమెది. ప్రతిభ ఉన్నవాళ్లకు సిఫారసులు అవసరం లేదని నిరూపించిన తెగువ ఆమెది. ఆదిశక్తిలో అన్ని లక్షణాలను పుణికిపుచ్చుకుని మోడ్రన్ ఆదిశక్తిగా కనిపిస్తున్న చిన్మయి ప్రస్థానం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకోసం.

మీటూ ఉద్యమంలో..

హాలీవుడ్‌లో నిర్మాత హార్వీ వీన్‌స్టీన్ ఉదంతంతో మీటూ ఉద్యమం ప్రారంభమైంది. ఒక్క హాలీవుడ్‌లోనే కాదు అంతటా మీటూ ఉద్యమం అవసరమని తనకు చిన్నతనంలో జరిగిన సంఘటనను బయటపెట్టి చిన్మయి, కోలీవుడ్‌లో మీటూ ఉద్యమాన్ని తన భుజాల మీదకి ఎత్తుకుంది. రచయిత వైరముత్తు చేసిన దుశ్చర్యను అందరితో చెప్పింది. ఆమె ధైర్యం చూసి ఆ రచయితలో చేతిలో ఇబ్బంది పడిన మరికొంతమంది మహిళలు కూడా ముందుకు రావడంతో మీటూ ఉద్యమం పుంజుకుంది. ఇక ఆ వెంటనే డబ్బింగ్ యూనియన్‌లో రాధారవి తప్పుడు పనులను బయటపెట్టి చిన్మయి చిన్నపాటి విప్లవమే తీసుకొచ్చింది.

బెదిరింపులకు లొంగకుండా..

మంచి వెంటనే చెడు వస్తుందన్నట్లు చిన్మయి చేస్తున్న పనులు కొంతమందికి రుచించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే చిన్మయికి బెదిరింపు మెసేజ్‌లు, అసభ్య ఫొటోలు కోకొల్లలుగా వచ్చాయి. కానీ, ఆమె బెదరలేదు. వచ్చిన ప్రతి మెసేజ్‌కూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చి వాళ్లకు చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఆమె కెరీర్ మీద దెబ్బకొట్టడానికి ప్రయత్నించారు. డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించినప్పటికీ ఆమె తన ప్రతిభతో నిలదొక్కుకుంది. తమకు జరిగిన అకృత్యాల గురించి మహిళలు ఒక్కొక్కరుగా పంచుకుంటుంటే పెద్దక్కలాగ వారికి అండగా నిలబడింది. ఆ క్రమంలో సింగర్ కార్తీక్ లాంటి వాళ్ల బండారం బయటపెట్టింది. పైకి అభిమానులు సంపాదించుకున్న సినీ పెద్దలను కూడా రచ్చకు ఈడ్చింది. దీంతో ఆమెకు ఫెమినిస్ట్ అనే ముద్ర వేశారు. మన్మథుడు 2 సినిమా సమయంలో ఈ గొడవలోకి ఆమె భర్త రాహుల్‌ను లాగడానికి కూడా ప్రయత్నించారు. అయినప్పటికీ దంపతుల మధ్య ప్రేమ, అర్థం చేసుకునే మనసు ఉంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎలాంటి అనర్థం జరగదని ఆమె నిరూపించారు.

మహిళను తప్పుగా చూపిస్తే ఇక అంతే!

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాంలలో మహిళను తప్పుగా కానీ, తక్కువ చేసి కాని చూపిస్తే చిన్మయి వెంటనే స్పందిస్తారు. తప్పుగా ఫొటోలు వేసిన మీమ్ పేజీలను చీల్చి చెండాడతారు. ప్రతి విషయాన్ని లాజికల్‌గా మాట్లాడి పేజీల కొద్ది స్టేటస్‌‌లు అవసరమైనప్పటికీ పూర్తిగా అర్థమయ్యేలా చెబుతారు. అన్యాయానికి గురైన మహిళ వివరాలు, ఫొటోలను ప్రచురించొద్దని చట్టం ఉన్నప్పటికీ హద్దు దాటుతున్న ఛానళ్ల నడ్డి విరుస్తారు. మూడు పాటలు, రెండు షోలు, ఒక సినిమాకు డబ్బింగ్ చెప్పుకుని సంపాదించుకోక ఎందుకమ్మా నీకు లొల్లి… అన్న వాళ్లకి ఇదే విషయం నీ తల్లితోనో చెల్లితోనో చెప్పించు అనగల స్థితప్రజ్ఞురాలు చిన్మయి.

ఇదొక్కటే కాదు..

కేవలం మీటూ విషయంలో మాత్రమే చిన్మయి సోషల్ మీడియా ద్వారా మహిళలకు సాయం చేస్తోందనుకుంటే పొరపాటే. ఇటీవల ఆమె ప్రారంభించిన ఐల్ ఆఫ్ స్కిన్ ఉత్పత్తుల ద్వారా మహిళల అందచందాలకు ప్రకృతి సొగసులు దిద్దే పనిలో పడ్డారు. అంతేకాకుండా మేకప్, అందాన్ని కాపాడుకోవడం వంటి పాఠాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా నేర్పిస్తున్నారు. ఆమె యూట్యూబ్ మేకప్ పాఠాలు ఎంత ఫేమస్ అంటే… మగవాళ్లు కూడా తమ అందాన్ని కాపాడుకోవడానికి ఏమైనా సలహాలు ఇవ్వమని అడిగారంటే అర్థం చేసుకోవచ్చు.

సాయం చేయడానికి చేదోడు వాదోడు

నాకు ఏదీ ఊరికే వద్దు.. అనే చిన్మయి.. మీకేదైనా కావాలంటే అడగండి అనడంలో ఎప్పుడూ ముందే ఉంటారు. పాటలో కమ్మదనమే కాదు.. సాయం చేయడంలోనూ అమ్మతనాన్ని చిన్మయి చూపిస్తారు. అడిగినవారు మగా ఆడా అని చూడకుండా తనకు వీలైతే చేస్తారు, లేదంటే చేయగల వాళ్లకు చెబుతారు. మొన్నటికి మొన్న పరీక్ష ఫీజు కట్టడానికి ఓ వ్యక్తి డబ్బు అందేలా చేయడానికి చిన్మయి సోషల్ మీడియా సాయం తీసుకున్నారు. అంతేకాదు..తన లాంగ్వేజ్ సర్వీసెస్ కంపెనీ ద్వారా ఫ్రీలాన్స్‌లో ఉద్యోగాలు కూడా చిన్మయి కల్పిస్తున్నారు. జీవితంలో డబ్బు విషయంలో తాను మోసపోయిన సందర్భాలను తెలియజేస్తూ మహిళలు ఆర్థికంగా పటిష్టంగా ఉండేందుకు సాయపడుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. మహిళా దినోత్సవం ఆనందంగా జరుపుకోవడానికి దక్షిణ భారతదేశంలో ఒక్క చిన్మయి కారణమని అనుకోవడంలో కూడా అతిశయోక్తి ఉండదు. ఆమె లాంటి ధైర్యం అందరు అమ్మలు, అక్కలకు రావాలని కోరుకుంటూ..‘దిశ’ తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

tags: chinmaya, women’s day, kollywood industry

Tags:    

Similar News