నో రూల్స్.. నో రిజిస్ట్రేషన్ : ఐజీ చిరంజీవులు
దిశ, న్యూస్ బ్యూరో: నిబంధనలను పాటించని రియల్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ షాక్ ఇచ్చింది. ఇక నుంచి అక్రమ లే అవుట్లలోని ప్లాట్లకు, అనుమతి లేని నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌లు ఉండవని తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని జిల్లా రిజిస్ట్రార్‌లకు, సబ్ రిజిస్ట్రార్‌లకు ఆ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ టి. చిరంజీవులు బుధవారం ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం ఆమోదించిన లే అవుట్లలోని ప్లాట్లకు, చట్ట ప్రకారం అనుమతులున్నవాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించబడిన […]
దిశ, న్యూస్ బ్యూరో:
నిబంధనలను పాటించని రియల్టర్లకు రిజిస్ట్రేషన్ శాఖ షాక్ ఇచ్చింది. ఇక నుంచి అక్రమ లే అవుట్లలోని ప్లాట్లకు, అనుమతి లేని నిర్మాణాలకు రిజిస్ట్రేషన్‌లు ఉండవని తేల్చి చెప్పింది. ఈ మేరకు అన్ని జిల్లా రిజిస్ట్రార్‌లకు, సబ్ రిజిస్ట్రార్‌లకు ఆ విభాగం ఇన్‌స్పెక్టర్ జనరల్ టి. చిరంజీవులు బుధవారం ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం ఆమోదించిన లే అవుట్లలోని ప్లాట్లకు, చట్ట ప్రకారం అనుమతులున్నవాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించబడిన ప్లాట్లను కూడా రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామన్నారు. గతంలో అక్రమ లేఅవుట్ల లోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నప్పటికీ, ఇక ముందు ఆ ప్లాట్‌కు కూడా రిజిస్ట్రేషన్ ఉండదని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో, పురపాలక సంఘంలో, మునిసిపల్ కార్పొరేషన్, పట్టణాభివృద్ది సంస్థ పరిధిలోనూ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇల్లు, భవనం, అపార్టుమెంటు, ఫ్లాట్లు లేదా ఏదైనా నిర్మాణం సంబంధిత అధికారి లేదా అధికారిక సంస్థతో అనుమతి కలిగి ఉండి, పక్కా డాక్యుమెంట్లు ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని స్పష్టంగా తెలిపారు. బీఆర్ఎస్, బీపీఎస్, కింద అనుమతులు ఉన్న నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. గ్రామ కంఠంలో ఉన్న భవనాలను తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
కొత్త మునిసిపల్ చట్టం-2019 అమలు..
తెలంగాణలో భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరుకు అమలులో ఉన్న జీఓ 168 మేరకు నిర్మాణాలు జరిగితేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తామని చిరంజీవులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిర్మాణాలను క్రమబద్దీకరిచుకోని, కనీసం ఆసక్తి చూపనివారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. చట్ట విరుద్ధంగా ఉన్న ప్లాట్లను జీఓ 151 ప్రకారం క్రమబద్దీకరించుకోవాలని పదేపదే ప్రచారం చేసినా ముందుకురాని వారికి ఇప్పుడు కష్టకాలం వచ్చి పడింది. ఇక ముందు సాధారణ భవన నియమాల 26 (h) జీఓ 168 ప్రకారం మంజూరు చేసిన ప్రణాళిక ప్రకారంగా భవనాలు నిర్మితమై ఉండాలని, భవనం లోపల అంతర్నిర్మిత ప్రాంతాలు కూడా మంజూరు చేసిన భవన ప్రణాళిక మేరకు ఆ కాపీని దాఖలు చేసిన తరువాతనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని అధికారులు తేల్చారు.
మంజూరు చేసిన భవన ప్రణాళికకు అనుగుణంగానే అంతస్థుల నిర్మాణాలు జరగాలని సూచించారు. తెలంగాణ మునిసిపాలిటీ చట్టం, 2019 లోని సెక్షన్ 172 (16) ప్రకారంగా అనుమతులు లేని కొత్త ప్లాట్లు లేదా ఉపవిభాగం (సబ్ డివిజనల్) ప్లాట్లు నమోదు చేయకూడదని స్పష్టం చేశారు. తెలంగాణ మునిసిపాలిటీ చట్టం, 2019 లోని సెక్షన్ 178 (3) ప్రకారం ఏ భవనం లేదా నిర్మాణాన్ని లేదా ఆమోదించిన మంజూరు చేసిన ప్రణాళిక ఉంటేనే భవనానికి, భవన భాగానికి రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం వెల్లడించింది.