షర్మిల ప్రకటనపై ఆ పార్టీలో వణుకు
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి అధికార టీఆర్ఎస్లో వణుకు మొదలైందని ఇందిరా శోభన్ అన్నారు. పార్టీ ప్రకటనకే పాలకుల్లో ఇంత అభద్రతాభావం నెలకొంటే ఇక పూర్తిస్థాయిగా ప్రజల్లోకి వెళ్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. షర్మిల పార్టీ బలపడితే తాము ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందేమోనన్న భయంతో టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటన చేసినప్పటి నుంచి అధికార టీఆర్ఎస్లో వణుకు మొదలైందని ఇందిరా శోభన్ అన్నారు. పార్టీ ప్రకటనకే పాలకుల్లో ఇంత అభద్రతాభావం నెలకొంటే ఇక పూర్తిస్థాయిగా ప్రజల్లోకి వెళ్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదని ఆమె పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. షర్మిల పార్టీ బలపడితే తాము ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందేమోనన్న భయంతో టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏప్రిల్ 9వ తేదీన ఖమ్మంలో నిర్వహిస్తున్న సభ విజయవంతమైతే తన పరువు పోతుందేమోనన్న భయం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొదలైందన్నారు.
ఇటీవల రఘునాథపాలెంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం కావడమే అందుకు నిదర్శనమని ఆమె విమర్శించారు. వైఎస్సార్ హయాంలో ప్రతి పేద విద్యార్థికి రీయింబర్స్ మెంట్ అందించారని, కానీ నేడు టీఆర్ఎస్ కేవలం 10వేల ర్యాంకు వరకు మాత్రమే రీయింబర్స్ మెంట్ అందిస్తామని విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల చేపడుతున్న ఆత్మీయ సమ్మేళనాల ద్వారా ప్రజల సమస్యలు వారి సంక్షేమానికి రాజన్న రాజ్యం తెచ్చేందుకు కృషిచేస్తారని అన్నారు. షర్మిల తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి తీరు ఉందన్నారు. తెలంగాణ ఆవిర్భవించాక ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీలో కలిపాలని వివరించారు. 2014 జూలై 11న లోక్ సభ ఆమోదం తెలిపితే 2018 సెప్టెంబర్ 23న గెజిట్ వెలువడిందని, మొత్తం 170 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ వారికేం చేశారని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి తన భూముల వ్యవహారంలో ప్రభుత్వంపై కేసు వేసిన గంగుల ముంపు ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవాలని ఇందిరా శోభన్ డిమాండ్ చేశారు.