భారీగా క్షీణించిన పసిడి దిగుమతులు.!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలల కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 47 శాతం తగ్గిన బంగారం దిగుమతులు సుమారు రూ. 69 వేల కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే కొవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్, ధరలు భారీ స్థాయిలో పెరగడంతో బంగారం కొనుగోళ్లు క్షీణించాయి. ఫిబ్రవరిలో బంగారం రూ. 40 వేల కంటే దిగువన ఉండగా, కేవలం మూడు నెలల కాలంలో అది […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలల కాలంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య 47 శాతం తగ్గిన బంగారం దిగుమతులు సుమారు రూ. 69 వేల కోట్లకు పరిమితమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే కొవిడ్-19 మహమ్మారి, లాక్‌డౌన్, ధరలు భారీ స్థాయిలో పెరగడంతో బంగారం కొనుగోళ్లు క్షీణించాయి. ఫిబ్రవరిలో బంగారం రూ. 40 వేల కంటే దిగువన ఉండగా, కేవలం మూడు నెలల కాలంలో అది రూ. 58 వేలకు చేరుకుంది. ప్రస్తుతం రూ. 52 వేల వరకు పసిడి ధరలు కొనసాగుతున్నాయి.
భారీ ధరల కారణంగా సెప్టెంబర్ వరకు కొనుగోళ్లు పెద్దగా జరగలేదు. అనంతరం అంతర్జాతీయ పరిణామాలకు తోడు, మార్కెట్ల పరిస్థితి మెరుగ్గా ఉండటంతో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత నెల నుంచి పండుగ సీజన్ ప్రారంభం కావడంతో అమ్మకాలు బాగున్నప్పటికీ, ఎక్కువ శాతం బంగారం కాయిన్స్ కొనడానికే ఆసక్తి చూపించారు. ఇక, ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బంగారం దిగుమతులు గతేడాది ఉన్న రూ. 1.31 లక్షల కోట్ల కంటే దాదాపు సగానికి తగ్గాయి. అయితే, అక్టోబర్ నెలలో మాత్రం దిగుమతులు 36 శతం పెరగడం విశేషం. పండుగ సీజన్‌తో పాటు కొత్త ధరలకు ప్రజలు అలవాటు పడటంతో బంగారం కొనుగోళ్లు పెరిగడమే దీనికి కారణమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. బంగారంతో పాటు వెండి దిగుమతులు కూడా 64.65 శాతం పడిపోయి సుమారు రూ. 54.9 వేల కోట్లకు పడిపోయాయి. అలాగే, ఈ ఏడు నెలల కాలంలో బంగారం, వెండి దిగుమతులు సగం మేర క్షీణించడంతో వాణిజ్య లోటు సుమారు రూ. 2.37 లక్షల కోట్లుగా నమోదైంది. రత్నాలు, ఆభరణాల దిగుమతులు కూడా 49.5 శాతం పడిపోయి దాదాపు రూ. 85.9 వేల కోట్లకు చేరుకున్నాయి.