కొత్త కరోనా కేసుల్లో భారత్ 3వ స్థానం

దిశ, సెంట్రల్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు పదివేలకు చేరవవుతున్నాయి. ఇక్కడ వరుసగా మూడు రోజులుగా తొమ్మిది వేలకుపైగా కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్యా విపరీతంగా హెచ్చుతున్నది. గడిచిన రెండువారాల్లోనే మనదేశంలో లక్ష కేసులు నమోదుకావడం గమనార్హం. మే 24న 1.31లక్షలున్న కేసులుండగా శనివారం(జూన్ 6)నాటికి 2.36 లక్షలకు చేరాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో నమోదవుతున్న దేశాలు ప్రపంచంలో అతి తక్కువగా ఉన్నాయి. రోజువారీ చొప్పున […]

Update: 2020-06-06 07:54 GMT

దిశ, సెంట్రల్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు పదివేలకు చేరవవుతున్నాయి. ఇక్కడ వరుసగా మూడు రోజులుగా తొమ్మిది వేలకుపైగా కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్యా విపరీతంగా హెచ్చుతున్నది. గడిచిన రెండువారాల్లోనే మనదేశంలో లక్ష కేసులు నమోదుకావడం గమనార్హం. మే 24న 1.31లక్షలున్న కేసులుండగా శనివారం(జూన్ 6)నాటికి 2.36 లక్షలకు చేరాయి. కొత్త కేసులు ఈ స్థాయిలో నమోదవుతున్న దేశాలు ప్రపంచంలో అతి తక్కువగా ఉన్నాయి. రోజువారీ చొప్పున కరోనా కేసులు అమెరికా, బ్రెజిల్ తర్వాత మనదేశంలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి. రోజుకు దాదాపు ఎనిమిది వేల కేసులతో రష్యా నాలుగో స్థానంలో మన తర్వాత నిలిచింది. ఇప్పటికే అత్యధిక కేసుల దేశాల జాబితాలో భారత్ ఇటలీని దాటేసి ఆరోస్థానానికి చేరింది. కొత్త కేసుల నమోదు రేటు ఈ స్థాయిలో కొనసాగితే వారంలోనే స్పెయిన్, యూకేలను దాటి నాలుగో స్థానానికి చేరుతుంది.

రోజువారీగా కరోనా దడ

ప్రస్తుతం అత్యధిక కేసులు(సుమారు 18.72 లక్షలు) అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో బ్రెజిల్(6.14 లక్షలు), రష్యా(4.5లక్షలు), యూకే(2.84లక్షలు), స్పెయిన్(2.40లక్షలు) ఉండగా, 2.36 లక్షల కేసులతో భారత్ ఆరోస్థానంలో ఉన్నది. ఇందులో కొన్ని దేశాల్లో కరోనా పరాకాష్టకు చేరగా, మరికొన్ని దేశాల్లో ఇప్పుడిప్పుడే విజృంభిస్తున్నది. ఏప్రిల్ తొలి వారాల్లో భారీగా కేసులు వెలుగుచూసిన అమెరికాలో ఒకానొక దశలో రోజుకు సుమారు 36వేల కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు కొత్త కేసులు తగ్గుముఖం(రోజుకు 20వేలకు అటుఇటుగా రిపోర్ట్ అవుతున్నాయి) పడుతున్నాయి. కానీ, బ్రెజిల్ మాత్రం కొత్త కేసులతో వేగంగా దూసుకెళ్తున్నది. రోజుకు సుమారు 30వేల కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. రష్యాలోనూ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు రోజుకు 11వేలకు పైగా కేసులు వెలుగుచూసిన ఈ దేశంలో ఇప్పుడు రోజుకు సుమారుగా ఎనిమిదివేలుగా నమోదవుతున్నాయి. కాగా, యూకే, స్పెయిన్‌లూ చాలా వరకు కరోనాను కట్టడి చేయగలిగాయి. ఇప్పుడు యూకేలో రోజుకు రెండు వేల నుంచి 1,800 మధ్యలో రిపోర్ట్ అవుతున్నాయి. స్పెయిన్‌లో రోజువారీ కేసులు మూడంకెలకు పడిపోయాయి. ఇప్పుడు సుమారుగా మూడు నుంచి నాలుగు వందల లోపే కొత్త కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. కాగా, భారత్‌లో కరోనా కేసులు రోజుకు సుమారుగా 10వేలకు దరిదాపుల్లో నమోదవుతున్నాయి. వారం రోజుల పాటు కరోనా పెరుగుదల ఇలాగే కొనసాగితే యూకే, స్పెయిన్‌లలోని మొత్తం కేసులను మనదేశం సులువుగా అదిగమిస్తుంది. అత్యధిక కేసులున్న నాలుగో దేశంగా ఎగబాకే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా మరణాల్లో ఊరట!

మనదేశంలో 2.36లక్షల కరోనా కేసులు నమోదైనా మరణాలు మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే స్వల్పంగానే ఉన్నాయి. మనదేశంలో కరోనా మరణాలు 6,642 నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ కరోనావైరస్ రీసోర్స్ సెంటర్ సమాచారం ప్రకారం, అమెరికాలో అత్యధికంగా(సుమారు 1.09లక్షలు) కరోనా మరణాలు సంభవించాయి. తర్వాతి స్థానంలో సుమారు 40వేల కరోనా మరణాలతో యూకే ఉన్నది. కరోనా కేసుల్లో మనదేశంలో వేగంగా దూసుకెళ్తున్నా మరణాల్లో 12వ స్థానంలో నిలవడం కాస్త ఊరట కలిగిస్తున్నది. మన కంటే ఎక్కువ మరణాలు అమెరికా, యూకేలతోపాటు బ్రెజిల్(దాదాపు 34వేలు), ఇటలీ(33.7వేలు), ఫ్రాన్స్(29.1వేలు), స్పెయిన్(27.1వేలు), మెక్సికో(13.1వేలు), బెల్జియం(9.5వేలు), జర్మనీ(8.6వేలు), ఇరాన్(8.1వేలు), కెనడా(7.7వేలు)లలో మనకంటే ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి. మనకంటే తక్కువ కేసులున్న దేశాల్లోనూ ఎక్కువ మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, మన దేశంలో మాత్రం కరోనా కేసులు 2.36లక్షలకు చేరుకున్నా ఆరువేలలోనే మరణాలున్నాయి.

Tags:    

Similar News