21 రోజుల లాక్‌డౌన్.. నష్టమెంత!?

దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 మహమ్మారి కారణంగా అత్యవసర సేవలు మినహాయించి అన్ని రకాల వ్యాపార సముదాయాలు, సంస్థలు, సేవలు నిలిచిపోయాయి. కరోనాకు ముందే మన ఆర్థికవ్యవస్థ మందగమనంలో కొనసాగుతుండగా, ఈ పరిస్థితుల కారణంగా మరింత నష్టం మోయాల్సి ఉందని, లాక్‌డౌన్ పోడిగించే అవకాశం ఉన్నందున భవిష్యత్తు నష్టాలను ఊహించలేమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. రూ. 210 లక్షల కోట్ల వార్షిక స్థూల జాతియోత్పత్తి […]

Update: 2020-04-13 04:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 మహమ్మారి కారణంగా అత్యవసర సేవలు మినహాయించి అన్ని రకాల వ్యాపార సముదాయాలు, సంస్థలు, సేవలు నిలిచిపోయాయి. కరోనాకు ముందే మన ఆర్థికవ్యవస్థ మందగమనంలో కొనసాగుతుండగా, ఈ పరిస్థితుల కారణంగా మరింత నష్టం మోయాల్సి ఉందని, లాక్‌డౌన్ పోడిగించే అవకాశం ఉన్నందున భవిష్యత్తు నష్టాలను ఊహించలేమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

రూ. 210 లక్షల కోట్ల వార్షిక స్థూల జాతియోత్పత్తి ఉన్న ఇండియా లాంటి దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ వల్ల జీడీపీలో 4 శాతం వరకు నష్టం ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక నెలలో సగటున 8 నుంచి 9 శాతం వస్తువులు, సేవల ఉత్పత్తి జరిగితే లాక్‌డౌన్ కాలంలో ఏర్పడిన మూడింట రెండు వంతుల ఉత్పత్తి లోటుతో రూ. 8 లక్షల కోట్ల నష్టం తప్పదు. ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగించడం అధికారికంగా ఖరారైతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ప్రభుత్వం అవలంభించే చర్యలను బట్టి తర్వాతి పరిస్థితులు ఉంటాయి. మైనింగ్, నిర్మాణం, తయారీ, సేవల రంగాల్లో సుమారు 10 కోట్ల మంది కార్మికులు నిరుద్యోగులుగా మారే ప్రమాదముందని మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అభిప్రాయపడ్డారు.

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల సహకారం, లాక్‌డౌన్ పరిధిలో ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించిన తర్వాత జీడీపీలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల్లో 60 నుంచి 70 శాతం తగ్గనున్నట్టు తెలుస్తోందని చంద్ర గార్గ్ చెప్పారు. కార్మికులు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల కనీస వేతనం నెలకు రూ. 10,000 కోల్పోతారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం వారి అత్యవసర అవసరాలను తీర్చేందుకు కనీసం ఒక కార్మికుడికి రూ. 2,000 ఇవ్వచ్చు. దీనివల్ల ప్రభుత్వానికి నెలకు రూ. 20,000 కోట్లు ఖర్చవుతుంది. మూడు నెలల వరకూ ఇది కొనసాగితే ప్రభుత్వానికి రూ. 60,000 కోట్లు మాత్రమే నష్టం ఉంటుందని సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు.

సుభాష్ చంద్ర గార్గ్ వాదనకు మద్దతుగా మాజీ చీఫ్ గణాంకాల నిపుణులు ప్రణబ్ సేన్ రెండు వారాల లాక్‌డౌన్ వల్ల రూ. 6 లక్షల కోట్ల నష్టముండోచ్చాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది భారీ నష్టం. ఎందుకంటే కేంద్రం అధికారిక ప్రకటన చేయక ముందే రాష్ట్రాలు లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేశాయి. ఇప్పుడు లాక్‌డౌన్ కొనసాగే అవకాశం ఉన్నందున పరిణామాలు ఎలా ఉంటాయనేది నెలాఖరులో పరిశీలించాల్సి ఉందని ప్రణబ్ సేన్ అన్నారు. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా ఆర్థిక పునరుద్ధరణ సత్వరమే ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైన వెంటనే రికవరీ ఉండకపోవచ్చు. దీనికి కాస్త సమయం పడుతుంది.

ఈ అసాధారణ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టం భారీగా ఉంటుందని, దీనికి ఖచ్చితమైన సంఖ్యలతో లెక్కగట్టలేమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ప్రొఫెసర్ అయిన ఎన్ ఆర్ భానుమూర్తి అన్నారు. టోకు, రిటైల్ వ్యాపారం, హోటళ్లు, మైనింగ్, నిర్మాణ రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, విద్యుత్ రంగాలు కొంత మేర ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగం వాతావరణ పరిస్థితులను బట్టి మారే అవకాశమున్నందున ఆ రంగం గురించి ప్రస్తావించలేనని ఆయన చెప్పారు. వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు, కనీసావసరాలైన వస్తువులు, సేవలు లాక్‌డౌన్ సందర్భంలో మినహాయించబడ్డాయి. కొంతమేర నష్టాన్ని మాత్రమే ఎదుర్కొన్నాయి. ఈ-కామర్స్, ఔషధ సంబంధ వ్యాపారాలు పెద్దగా నష్టపోలేదు. లాక్‌డౌన్ ఎత్తివేసిన అనంతరమే ఈ వ్యాపారాలు బౌన్స్ బ్యాక్ అవుతాయని భానుమూర్తి తెలిపారు.

ముఖ్యంగా ఆందోళన కలిగించే విషయం వలస కార్మికులు ఆధారపడిన నిర్మాణం, మైనింగ్, చిన్న, చిన్న వ్యాపారాలకు చెందిన రంగాలు సరఫరా కొరత నుంచి తప్పించుకోలేవు. నగరాలను విడిచి వెళ్లిన కార్మికులు తిరిగి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. వీరికి వేతనాల సమస్య ఉంటుందని ఆయన చెప్పారు. వలస జీవితాలు పూర్తిగా భిన్నమైనవని ఆయన ప్రస్తావించారు. 1991 నాటి సంస్కరణల తర్వాత అతి తక్కువ వృద్ధి నమోదు అయ్యే పరిస్థితులున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టిన బలమైన ద్రవ్య, ఆర్థిక ఉద్దీపన చర్యలున్నా సరే వృద్ధి క్షీణత తప్పదని పేర్కొన్నారు. 21 రోజుల లాక్‌డౌన్ తర్వాత భారత ఆర్థికవ్యవస్థ భారీ నష్టాలను చూడనుందని, ఏప్రిల్ 14 తర్వాత కూడా ఇది కొనసాగితే నష్టాన్ని ఊహించడం కష్టంగా ఉందని, దీన్ని తగ్గించేందుకు కొంత వెసులుబాటు కల్పిస్తే మంచిదని వారు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను గమనిస్తే… రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు భారీస్థాయిలో నష్టపోయాయి. కేంద్రం వెంటనే రాష్ట్రాలకు ఇవ్వాల్సిన రూ. 30,000 కోట్ల జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాలి. అలాగే, కేంద్ర పన్నుల్లో రూ. 56,000 కోట్ల రాష్ట్రాల వాటాను ఏప్రిల్ 15లోగా విడుదల చేయడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు.

Tags : Coronavirus lockdown, Coronavirus, COVID-19, GDP, economic slowdown, Indian economy

Tags:    

Similar News