15వేల ఓట్లను చీల్చిన స్వతంత్రులు
దిశ, తెలంగాణ బ్యూరో: లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందనుకున్న టీఆర్ఎస్ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలనేకాక ప్రజలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక్కడ పోటీ చేసిన 23మందిలో నలుగురు మినహా మిగిలినవారంతా స్వతంత్ర అభ్యర్థులే. వారందరూ కలిపి దాదాపు 15వేల కంటే ఎక్కువ ఓట్లనే చీల్చగలిగారు. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి దెబ్బ పడుతుందని చాలా మంది రాజకీయ నాయకులు భావించారుగానీ స్వతంత్ర అభ్యర్థులు ఇంత పెద్ద మొత్తంలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందనుకున్న టీఆర్ఎస్ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలనేకాక ప్రజలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక్కడ పోటీ చేసిన 23మందిలో నలుగురు మినహా మిగిలినవారంతా స్వతంత్ర అభ్యర్థులే. వారందరూ కలిపి దాదాపు 15వేల కంటే ఎక్కువ ఓట్లనే చీల్చగలిగారు. ఓట్లను చీల్చడం ద్వారా బీజేపీకి దెబ్బ పడుతుందని చాలా మంది రాజకీయ నాయకులు భావించారుగానీ స్వతంత్ర అభ్యర్థులు ఇంత పెద్ద మొత్తంలో ఓట్లను చీల్చగలుగుతారని అనుకోలేదు. ఆరుగురు అభ్యర్థులకు తలా వెయ్యి కంటే ఎక్కువ ఓట్లే వచ్చాయి. బండారు నాగరాజు అనే స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా మూడున్నర వేల కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. చివరకు ఇదే తమ కొంప ముంచిందని టీఆర్ఎస్ శ్రేణులు సరికొత్త వాదనను తెరపైకి తెచ్చాయి.
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తుగా ఉన్న కారును పోలినట్లే బండారు నాగరాజు అనే స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన రొట్టెల పీట-కోల గుర్తు ఉందని, హఠాత్తుగా చూడగానే ఈ గుర్తు కారులా ఉంటుందని, ఆ రకంగా టీఆర్ఎస్‌కు పడాల్సిన ఓట్లు స్వతంత్ర అభ్యర్థికి పడ్డాయని చర్చించుకుంటున్నారు. ప్రచారం సమయంలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరే జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య చాలా టఫ్ ఫైటే ఉందని తేలిపోయింది. చివరకు పోలింగ్ రోజున సైతం ఓటర్ల నాడిని పసిగట్టడంలో ఏ పార్టీ కూడా స్పష్టతకు రాలేదు. గెలుస్తామన్న ధీమా ఏ పార్టీకీ లేదు. కౌంటింగ్ రోజున సైతం చివరి రౌండ్ వరకూ అదే టెన్షన్ కంటిన్యూ అయింది.
అలాంటి ఉత్కంఠ నడుమ చివరకు బీజేపీ అభ్యర్థి 1,079 ఓట్లతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు చీల్చిన ఓట్లు లేదా బండారు నాగరాజు అనే అభ్యర్థికి పడిన ఓట్లు టీఆర్ఎస్‌కు పడినా గెలుపు ఖాయమయ్యేదని ఆ పార్టీ స్థానిక నేతలు పోస్టుమార్టమ్ విశ్లేషణలు చేస్తున్నారు. సునాయాస గెలుపు అని భావించిన సమయంలో టీఆర్ఎస్ అక్కడ పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థుల గురించి పెద్దగా పట్టించుకోలేదు. వారు ఓట్లు చీల్చగలుగుతారని కూడా భావించలేదు. కానీ ఆ పరిస్థితి క్రమంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్య గట్టి పోటీ దిశగా మారిన తర్వాత స్వతంత్ర అభ్యర్థులకు పడిన ఓట్లపై దృష్టి పడింది. స్వల్ప మెజారిటీ ఉన్నప్పుడు సహజంగానే ఇలాంటివి చర్చకు వస్తుంటాయని, దుబ్బాకలో పరిస్థితిని అతిగా అంచనా వేసుకున్న తర్వాత ఓటమిపాలు కావడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని టీఆర్ఎస్ మాత్రమేకాక కాంగ్రెస్, బీజేపీ స్థానిక నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు.