సాగర్ సమరంలో వాళ్ల ఓట్లే కీలకం..
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో సామాజిక వర్గాల ఓట్ల లెక్కలే కీలకంగా మారాయి. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక సైతం ఆ లెక్కల ఆధారంగానే జరిగిందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఓసీ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే.. అధికార టీఆర్ఎస్ పార్టీ బీసీ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చారు. ఈ రెండు పార్టీలకు భిన్నంగా బీజేపీ ఎస్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించారు. దీంతో గత కొద్ది రోజులుగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషం […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికలో సామాజిక వర్గాల ఓట్ల లెక్కలే కీలకంగా మారాయి. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక సైతం ఆ లెక్కల ఆధారంగానే జరిగిందంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఓసీ అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే.. అధికార టీఆర్ఎస్ పార్టీ బీసీ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చారు. ఈ రెండు పార్టీలకు భిన్నంగా బీజేపీ ఎస్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించారు. దీంతో గత కొద్ది రోజులుగా మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చివరి నిమిషం వరకు టికెట్ ఖరారుపై టీఆర్ఎస్, బీజేపీలు ఒకరికి మించిన వ్యుహాలను మరొకరు పన్నుతూ ముందుకు సాగారు. ఈ సంగతి ఏలా ఉన్నా.. ఉపఎన్నిక పోరులో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కేవలం బీసీలకు రెండు సార్లే..
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటివరకూ కేవలం రెండుసార్లు మాత్రమే ఓటర్లు బీసీలకు పట్టం కట్టారు. మిగతా అన్నీసార్లు రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించారు. అయితే 1996 ఎన్నికల్లో రామ్మూర్తియాదవ్, 2018 ఎన్నికల్లో నోముల నర్సింహాయాదవ్ మాత్రమే ఓసీయేతర ఎమ్మెల్యేలుగా గెలిచారు. తాజాగా మరోసారి కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే.. టీఆర్ఎస్ బీసీ వర్గానికి కేటాయించింది. బీజేపీ ఎంతో చాకచక్యంగా ఎస్టీ సామాజిక వర్గానికి అభ్యర్థిత్వం ఖరారు చేసింది. దీంతో నాగార్జునసాగర్ ఉపఎన్నిక మూడు సామాజిక వర్గాల కుమ్ములాటగా మారనుందనేది అక్షర సత్యమనే చెప్పాలి. అయితే నాగార్జునసాగర్ అసెంబ్లీ నుంచి రెండుసార్లు గెలిచిన ఓసీయేతర ఎమ్మెల్యేలు యాదవ సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనార్హం. బీజేపీ రెడ్డి, బీసీ సామాజిక వర్గం కాకుండా ఎస్టీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం వ్యుహాత్మకమనే చెప్పాలి.
ఓసీనా.. ఓసీయేతర అభ్యర్థా..
నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీచేసేందుకు కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గ లాబీయింగ్‌కు పెద్దపీట వేసింది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉన్న బీసీ సామాజికవర్గానికి.. అందులోనూ యాదవ సామాజికవర్గానికి టికెట్ ఇచ్చి బడుగుల పక్షపాతినంటూ చెబుతోంది. ఇదే సమయంలో బీజేపీ అనుహ్యంగా ఎస్టీ అభ్యర్థికి టికెట్ కేటాయించి గిరిజనులను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆ మేరకు బీజేపీ గిరిజనుల్లోకి ఎంత బలంగా వెళుతుందనేది ప్రశ్నార్థకమే. ఇదిలావుంటే.. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,19,745 ఓట్లు ఉన్నాయి. అందులో అత్యధికంగా బీసీ ఓటర్లు 1,05,495 మంది, ఎస్టీలు 40,398 మంది, ఎస్సీలు 37,671 మంది, ఓసీలు 31,485 మంది ఉన్నారు.