హైదరాబాద్‌లో అందరినీ ఆకట్టుకుంటున్న చిట్టీ
దిశ, ఎల్బీనగర్: కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆతిథ్య రంగంలోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేసింది. మనిషిని మనిషే ముట్టుకోలేనంతగా భయపెడుతోంది. దీంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. వెయిటర్ల స్థానంలో రోబోలను తీసుకొచ్చారు. వినియోగదారులు ఇచ్చే ఆర్డర్లను తీసుకొని సర్వ్ చేస్తూ ఈ చిట్టీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సరూర్‌నగర్ హూడా కాంప్లెక్స్‌లోని ‘చిట్టి ఇన్ టౌన్’ రోబో రెస్టారెంట్ వేదికగా మారింది. కరోనాకు భయపడి చాలా […]
దిశ, ఎల్బీనగర్: కరోనా మనిషి జీవనశైలిలోనే కాదు ఆతిథ్య రంగంలోనూ పెను మార్పులు తీసుకొచ్చింది. ఏడాదిన్నర కాలంగా కంటిమీద కునుకు లేకుండా చేసింది. మనిషిని మనిషే ముట్టుకోలేనంతగా భయపెడుతోంది. దీంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకులు వినూత్నంగా ఆలోచించారు. వెయిటర్ల స్థానంలో రోబోలను తీసుకొచ్చారు. వినియోగదారులు ఇచ్చే ఆర్డర్లను తీసుకొని సర్వ్ చేస్తూ ఈ చిట్టీలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సరూర్‌నగర్ హూడా కాంప్లెక్స్‌లోని ‘చిట్టి ఇన్ టౌన్’ రోబో రెస్టారెంట్ వేదికగా మారింది.
కరోనాకు భయపడి చాలా మంది రెస్టారెంట్ ఫుడ్‌కు దూరమయ్యారు. కొవిడ్ తగ్గుముఖం పట్టినా రెస్టారెంట్లు అంతంత మాత్రంగానే రన్ అవుతున్నాయి. దీనికి కారణం ఫుడ్ సర్వ్ చేసే వాళ్లకి కరోనా లక్షణాలు ఉంటే తమకు ఎక్కడ సోకుతుందోనని ప్రజలు హోటల్, రెస్టారెంట్‌కి వెళ్లడానికి జంకుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మలక్‌పేట్‌కు చెందిన మణికాంత్‌గౌడ్ వినూత్నంగా ఆలోచించాడు. వెయిటర్ల స్థానంలో రోబోలను పెట్టి ఫుడ్ సర్వ్ చేసేలా.. ఆర్డర్ తీసుకునేలా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాలని పూనుకున్నాడు. కొత్తపేట్‌లోని హుడా కాంప్లెక్స్‌లో ‘చిట్టి ఇన్ టౌన్’ పేరుతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
ప్రస్తుతం ఇక్కడ నాలుగు రోబోలను అందుబాటులో ఉంచారు. రెస్టారెంట్‌కు వచ్చే వారి ఆర్డర్లు తీసుకోవడం.. వచ్చిన ఆర్డర్లను షెఫ్‌కు అందజేయడం… ఆహారం రెడీ అయిన తర్వాత ఆహార ప్రియులకు స్వయంగా వచ్చి రోబోలే అందించడం చేస్తున్నాయి. అంతే కాకుండా తిన్న తరువాత ప్లేట్లను తీసుకెళ్లి శుభ్రం చేయడం.. బిల్లు జారీ చేయడం.. కస్టమర్ ఇచ్చిన డబ్బులను తీసుకెళ్లి కౌంటర్‌లో జమ చేయడం వంటి పనులన్నీ రోబోలే చేస్తుండటం విశేషం. రోబోలు చేస్తున్న ఈ పనులను చూసి కస్టమర్లు మంత్ర ముగ్ధులవుతున్నారు. రెస్టారెంట్‌కు వచ్చిన వారికి బోర్ కొట్టకుండా చూస్తూ ఎంటర్ టైన్ మెంట్ ను కూడా అందిస్తున్నాయి. ఇలా మనుషుల స్థానంలో మర మనుషులు సర్వ్ చేయడం చిన్నారులనే కాదు పెద్దలను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి రోబోలు.
మంచి ఆదరణ : మణికాంత్ గౌడ్, రెస్టారెంట్ యజమాని
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో భయంతో రెస్టారెంట్‌కు రావడానికి జనాలు భయపడేవారు. దీంతో నలుగురు మిత్రులం కలిసి వినూత్నంగా ఆలోచించాం. కస్టమర్లను ఆకర్షించడంతోపాటు కొవిడ్ సమయంలో కూడా అందరూ వచ్చే విధంగా ఈ రెస్టారెంట్‌ను రోబోలతో ప్రారంభించాం. ఇప్పటికే మేం రోబోటిక్ కోర్సులను పూర్తి చేసి ఉండటంతో రోబోల తయారీ, పనితీరుపై మాకు అవగాహన ఉంది. ఇది మాకు కలిసి వచ్చింది. వీటిని చూసేందుకు చాలా మంది వస్తున్నారు. 120 సీటింగ్ సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌కు రావాలంటే ఆన్‌లైన్ బుకింగ్ తప్పని సరి. నేరుగా వచ్చేవారు వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ రోబోలతో రెస్టారెంట్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.