కష్టమైన సొంతింటి కల.. సామాన్యుడిపై నిర్మాణ భారం

దిశ, తెలంగాణ బ్యూరో: ఇనుము, సిమెంట్ ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ రంగానికి పెను భారంగా మారాయి. ధరల పెరుగుదలతో కొత్త ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న మధ్య తరగతి ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూసి సొంతింటి ఆశలు కలగానే మిగిలిపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనాలు. రెండు నెలల క్రితం వరకు రూ. 280 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 340కి చేరింది. ఆకాశాన్నంటుతున్న బిల్డింగ్ మెటిరీయల్ ధరలతో ప్రారంభమైన భవనాలు […]

Update: 2021-06-08 13:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఇనుము, సిమెంట్ ధరలు పెరుగుతుండటంతో నిర్మాణ రంగానికి పెను భారంగా మారాయి. ధరల పెరుగుదలతో కొత్త ఇల్లు నిర్మించుకోవాలనుకుంటున్న మధ్య తరగతి ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ధరలు చూసి సొంతింటి ఆశలు కలగానే మిగిలిపోతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనాలు. రెండు నెలల క్రితం వరకు రూ. 280 ఉన్న బస్తా సిమెంట్ ధర ప్రస్తుతం రూ. 340కి చేరింది. ఆకాశాన్నంటుతున్న బిల్డింగ్ మెటిరీయల్ ధరలతో ప్రారంభమైన భవనాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ధరలు పెరుగుతుండటంతో లక్షలు వెచ్చించిన మెటిరీయల్ అమ్ముడుపతుందో లేదోనని వ్యాపారస్తులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భవనాలతో పాటు ఏ నిర్మాణాలు చేపట్టాలన్న ఉక్కు, సిమెంటే ప్రాణాధారం. కొన్నాళ్లుగా వాటి ధరలకు రెక్కలొస్తున్నాయి. నిర్మాణ రంగ చరిత్రలో సిమెంట్, ఇనుము ధరలు పెరగలేదు. రెండు మూడునెలల్లోనే టన్నుకు రూ.18వేల వరకు పెరిగాయి. పెరుగుదల నిర్మాణదారుల పైన అధికభారం పడుతోంది. గతేడాది రూ.349 ధర పలికిన యాభై కిలోల సిమెంటు బస్తా రేటు రూ.430-450 కి పెరిగింది. అలాగే టన్ను ఉక్కు ధర సంవత్సర కాలంలోనే రూ.40వేలనుంచి రూ.58వేలకు భారీగా పెరిగిపోయింది. దీంతో నిర్మాణం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు.

10శాతం అదనపు భారం

150 గజాల ఇంటిని(1200 ఎస్ఎఫ్‌టీలో) నిర్మించాలంటే సుమారు రూ.18 లక్షల అవుతుంది. అయితే కరోనా నేపథ్యంలో కూలీలు స్వగ్రామాలకు వెళ్లిపోవడంతో కొరతతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు కంపెనీలు ఇనుము, సిమెంట్ ధరలు పెంచాయి. దీంతో 10శాతం నిర్మాణ భారం పెరిగింది. అనుకున్న లక్ష్యానికి మించి ఒక్కసారిగా బడ్జెట్ పెరిగింది. సుమారు రూ.2లక్షల వరకు అదనపు భారం పడుతోంది. దీంతో ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

కలగానే సొంతింటికళ!

ఉక్కు, సిమెంటు ధరలు పట్టపగ్గాల్లేకుండా భగ్గుమనడం మధ్యతరగతి జీవుల సొంతింటి కల కళగానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు అనైతిక వ్యాపార పోకడలతో జట్టు కట్టి ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశాయంటూ 2016లో సీసీఐ (కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా) 10 సిమెంటు కంపెనీలపై సుమారు రూ.6,000 కోట్ల జరిమానా విధించగా- 10శాతం చెల్లింపులే జరిగాయి. దానిపై వివాదం కోర్టుకెక్కింది. పకడ్బందీ నియంత్రణ వ్యవస్థేమీ లేని వాతావరణంలో ధరల లూటీ పునరావృతమవుతోనే ఉంది. నెలల వ్యవధిలోనే ఉక్కు, సిమెంటు, ఇతర సామగ్రి ధరలు సుమారు 40 శాతానికిపై గా పెరగడంతో నిర్మాణ వ్యయం ఒక్కో చదరపు అడుగుకు రూ.200 అధికమైంది. దీంతో సాధారణ ప్రజల గుండెలు అవిసిపోతున్నాయి.

రేట్లు తగ్గితేనే..

మార్కెట్లో ఒక్కోసారి ఇసుక టన్ను ధర రూ.1000 ఉంటుంది. ఒక్కోక్కసారి రూ.2000లకు పైగా ఉన్నప్పుడు సిమెంట్, ఇనుము ధరలు తగ్గితే నిర్మాణ దారుడికి వేసులుబాటు ఉంటుంది. కానీ, ఇసుకతోపాటు సిమెంట్, ఇనుము ధరలు పెరిగితే యజమానికి అదనపు భారం పడుతోంది. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. లేకుంటే నిర్మాణ పనులు ఆపివేయాల్సిందే.

ఇంటి నిర్మాణం ఆపా

గతేడాది నవంబర్లో ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టా. అప్పడు సిమెంట్ రూ.230కి, ఇనుము క్వింటాకు రూ.4వేలకు వచ్చేది. అయితే కరోనాతో కూలీల కొరత ఉందని పనులు మేస్త్రీ ఆపివేశాడు. ధరలు పెరిగాయని ఎస్ఎఫ్‌టీ ధర పెంచాలని మేస్త్రీ కోరుతున్నాడు. నేనేమో అగ్రిమెంట్ ప్రకారం చేయాలని అంటున్నా. ఇప్పడు ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2లక్షలు అదనపు భారం అవుతోంది. ఏం చేయాలో తోచడం లేదు. ప్రస్తుతం ఇంటి నిర్మాణం ఆపా. -బండపల్లి నరేష్, ఇంటి నిర్మాణదారుడు

అగ్రిమెంట్ ప్రకారం చేయాల్సిందే..

భవన నిర్మాణ సమయంలో ఓనర్ తో అగ్రిమెంట్ చేసుకుంటాం. ఎస్ఎఫ్‌టీకి రూ.1400 మాట్లాడుకుంటాం. అయితే ధరలు పెరిగినా ఓనర్ కు సంబంధం ఉండదు. నష్టం వస్తే భరించాల్సిందే. ఒకవేళ నష్టం వస్తుందని నిర్మాణం ఆపితే మార్కెట్లో మళ్లీగిరాకీలు రావు. సిమెంట్, ఇనుము ధరలు పెరిగిన సమయంలో ఇసుక రేటు తగ్గితే కొంత వెసులుబాటు ఉంటుంది. లేకుంటే అంతే సంగతులు. ఇప్పటికే పెరిగిన ధరలతో నా కూలీ కాకుండానే సుమారు రూ.70వేలు అప్పులు చేసి కూలీలకు ఇచ్చా. -స్వామి, మేస్త్రీ, నాగోల్

ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

సిమెంట్ ,స్టీల్ ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్నాం. కాంట్రాక్టర్లు, బిల్డర్లను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం టాక్సీలతో పాటు సబ్సిడీ రుణాలు అందజేసి వెసులు బాటు కల్పించాలి. కంపెనీల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచకుండా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం పెరిగిన ధరలతో అపార్టుమెంట్లలోని ఒక్కో ప్లోర్ కు సుమారు 2లక్షల నుంచి 3 లక్షల వరకు అదనం అవుతుంది. అడిగితే అగ్రిమెంట్ ప్రకారం చేయాలంటున్నారు. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ప్రభుత్వమే ఆదుకోవాలి. -దుగుంట్ల నరేష్, బిల్డర్

Tags:    

Similar News