భారంగా మారిన చిరు వ్యాపారుల బతుకులు
దిశ, తెలంగాణ బ్యూరో: నేటితరానిది ఉరుకుల పరుగుల జీవితాలు. పొద్దంతా ఎవరికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై.. పొద్దు పోతే కానీ ఇంటికి చేరుకోం. అన్ని పనులకు సంబంధించిన టెన్షన్ ను వదిలించుకునేందుకు స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. అక్కడి నుంచి వీధి చివర్లో ఉన్న మిర్చి బండి దగ్గరికో.. పక్కనే ఉన్న పానీపూరి బండి దగ్గరికో వెళ్లి స్పైసీ రుచులు ఆస్వాదిస్తాం. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన జీవితాల్లోకి కరోనా ఎంటరైంది. ఇదే […]
దిశ, తెలంగాణ బ్యూరో: నేటితరానిది ఉరుకుల పరుగుల జీవితాలు. పొద్దంతా ఎవరికి సంబంధించిన పనుల్లో నిమగ్నమై.. పొద్దు పోతే కానీ ఇంటికి చేరుకోం. అన్ని పనులకు సంబంధించిన టెన్షన్ ను వదిలించుకునేందుకు స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. అక్కడి నుంచి వీధి చివర్లో ఉన్న మిర్చి బండి దగ్గరికో.. పక్కనే ఉన్న పానీపూరి బండి దగ్గరికో వెళ్లి స్పైసీ రుచులు ఆస్వాదిస్తాం. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన జీవితాల్లోకి కరోనా ఎంటరైంది. ఇదే ఇప్పుడు చిరువ్యాపారుల పాలిట శాపమైంది. కొవిడ్ ఫస్ట్ వేవ్ తోనే మనం ఎన్నో కష్టనష్టాలు భరించాం. సెకండ్ వేవ్ అంతకుమించి అన్నట్లుగా తీవ్రంగా విజృంభించింది. దీంతో ప్రభుత్వం లాక్ డౌన్ కు పూనుకుంది. కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాక విడతల వారీగా లాక్ డౌన్ సడలింపులు కల్పిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. లాక్ డౌన్ తో తీవ్రంగా నష్టపోయిన చిరువ్యాపారులు.. అన్ లాక్ అయినా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కరోనా భయంతో జనం
కొవిడ్ కారణంగా జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. దాదాపు చిరుతిండ్లు తగ్గించేశారు. నచ్చిన వంటకాలన్నీ ఇంట్లోనే తయారుచేసుకుంటూ ఇంటిల్లిపాది తినేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో చిరు తిండ్లకు ఆదరణ తగ్గిపోయింది. కొవిడ్ నేర్పిన పాఠాలతో ప్రజల జీవితాల్లో ఎన్నో మార్పులు సంభవించాయి. అయితే ఈ ఎఫెక్ట్ మాత్రం చిరు వ్యాపారుల మీద భారీగానే పడింది. వారి బతుకులు అగమ్యగోచరంగా మారాయి. ఇన్ని రోజులు కరోనా కాటుకు ఇబ్బంది పడిన వారు.. ఇప్పుడు ఆదరణ కరువై నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం అన్ లాక్ చేసి మూడురోజులైనా కూడా ప్రజలు ప్రియారిటీ ఇవ్వడంలేదని వారంటున్నారు.
పెరిగిన నిత్యావసరాల ధరలు
కరోనా వైరస్ కారణంగా నిత్యావసర సరుకుల ధరలు అడ్డగోలుగా పెరిగాయి. వంట నూనె ధర రెట్టింపైంది. చిరు వ్యాపారాలు కొనసాగించే వారికి నూనె ప్రధానం. వాటి ధరలు అమాంతం పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకే ఎంతో శ్రమించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. అంతకుముందు ధరలు తక్కువగా ఉండటంతో ప్లేట్ మిర్చిబజ్జీల ధర రూ.20 నుంచి రూ.30 వరకు ఉండేది. ఇప్పుడు పెరిగిన వంట నూనె, పిండి, ఇతర సరుకుల కోసమే అధికంగా వెచ్చిస్తుండటంతో ధరలు పెంచకుంటే గిట్టుబాటయ్యే చాన్సే లేదంటున్నారు చిరు వ్యాపారులు. ధరలు పెంచితే వచ్చే వారు కరువయ్యే అవకాశం ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు చిరు వ్యాపారులు.
అద్దె చెల్లించేందుకు కష్టాలు
సాధారణంగా చిరువ్యాపారులు రోడ్డుకిరువైపులా బండి పెట్టుకొని బతుకీడుస్తారు. అయితే వారు తమ సామగ్రిని దాచుకునేందుకు సమీపంలోనే చిన్న గదులు ఏర్పాటు చేసుకుంటారు. కరోనా రాకముందు గిరాకీ బాగానే వచ్చేది. అప్పుడు అద్దె చెల్లించడం పెద్దగా ఎవరికీ ఇబ్బందిగా అనిపించలేదు. అయితే కొవిడ్ మహమ్మారి రాకతో ఆ పరిస్థితులు లేకుండా పోయాయి. లాక్ డౌన్ తో అన్న మూసివేయాల్సి వచ్చింది. ఆ సమయంలోనే పూట గడిచేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు చిరువ్యాపారులు. ఆ గదుల అద్దె చెల్లించేందుకు అప్పులు కూడా చేయాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. మూడు రోజులైనా కూడా చిరుతిండ్లకు పెద్దగా జనం ఆసక్తి కనబరచడంలేదని వారంటున్నారు. దీంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారాయని వారు ఆవేదన చెందుతున్నారు.
లాక్ డౌన్ ఎత్తేసినా గిరాకీ లేదు
మైత్రివనం వద్ద ఫేమస్ చాట్ లో నాదీ ఒకటి. ఒకప్పుడు రెగ్యులర్ గా చాలామంది వచ్చి టేస్ట్ చేసేవారు. అలా రోజుకు రూ.2000 వరకు వచ్చేవి. అందులో నా పెట్టుబడి, బండి పెట్టినందుకు ప్రతిరోజు రూ.400 తీసేస్తే రూ.600 నుంచి రూ.800 వరకు మిగిలేది. కరోనా వచ్చి నా వ్యాపారాన్ని దెబ్బతీసింది. పూట గడిచేందుకు కూడా ఇబ్బందులు పడ్డాం. లాక్ డౌన్ ఎత్తేసినా కూడా గిరాకీ లేదు. పొద్దంతా బండి పెడితే కనీసం రూ. 200 కూడా మిగలడంలేదు-సుల్తాన్ మీర్జా, మైత్రివనం, చిరు వ్యాపారి
తీవ్రంగా నష్టపోయా
కరోనా రాకముందు నా షాపు ముందు క్యూ కట్టేవారు. నా షాపు వల్ల ఇద్దరు ముగ్గురికి ఉపాధి కూడా దొరికేది. కరోనా వచ్చి అంతా ఆగం చేసింది. కిరాయి కూడా కట్టేలా లేదు. కొవిడ్ కారణంగా తీవ్రంగా నష్టపోయాను. అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ విధించిన సమయంలో గిరాకీ లేనేలేదు. ఇప్పుడు ఆంక్షలన్నీ తొలగించినా కూడా ఎవరూ ముందుకు రావడంలేదు- మహమ్మద్ అఫ్రద్, పంజాగుట్ట, వ్యాపారి