అనుమతులకు మించి తవ్వకాలు.. ఇదేమంటే మీరేం చేస్తారంటూ బెదిరింపులు
దిశప్రతినిధి, రంగారెడ్డి/మహేశ్వరం : మహేశ్వరంలో అడ్డగోలుగా మైనింగ్ తవ్వకాలు సాగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం పలుగు తవ్వకాలు చేస్తుండటంతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గ్రామ పరిధిలో వెలుగుచూసింది. పలుగు తవ్వకాలతో వేల కోట్లు సంపాదించే వ్యాపారులు వందల రూపాయలతో ఖర్చు చేసి రోడ్డుకు మట్టి పోసేందుకు పేచీ పెడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో వ్యాపారి ఇష్టానుసారంగా పలుగు తవ్వకాలు జరుపుతున్నారు. […]
దిశప్రతినిధి, రంగారెడ్డి/మహేశ్వరం : మహేశ్వరంలో అడ్డగోలుగా మైనింగ్ తవ్వకాలు సాగుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం పలుగు తవ్వకాలు చేస్తుండటంతో స్ధానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూర్ గ్రామ పరిధిలో వెలుగుచూసింది. పలుగు తవ్వకాలతో వేల కోట్లు సంపాదించే వ్యాపారులు వందల రూపాయలతో ఖర్చు చేసి రోడ్డుకు మట్టి పోసేందుకు పేచీ పెడుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పెద్దగా పట్టించుకోకపోవడంతో వ్యాపారి ఇష్టానుసారంగా పలుగు తవ్వకాలు జరుపుతున్నారు. ఊరికి అతి సమీపంలో పలుగు తవ్వకాలు సాగుతుండటంతో బ్లాస్టింగ్ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో ఉండే ప్రజలు, పశువులు, పంట పొలాల వద్ద ఉండే రైతులు ఈ బ్లాస్టింగ్ శబ్దాలకు భయాందోళనకు గురవుతున్నారు. అనేక మార్లు ఈ విషయంపై ఆ వ్యాపారికి విన్నవించినా ఆయన పెడచెవిన పెడుతున్నాడు. మాకు అన్ని రకాల అనుమతులున్నాయి. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనే ధోరణితో పలుగు తవ్వకాలు జరిపే వ్యాపారి బెదిరిస్తున్నట్లు సమాచారం.
అనుమతికి మించి తవ్వకాలు..
జిల్లాలోని మైనింగ్, రెవెన్యూ అధికారులు చేతివాటంలకు ఆలవాటు పడి తవ్వకాలపై దృష్టి పెట్టడం లేదు. ఎంత లోతు వరకు తీసుకునే అనుమతినిచ్చారని అధికారులను, వ్యాపారులను అడిగితే మీకేందుకు చెప్పాలనే సమాధానం వినిపిస్తోంది. పలుగు రవాణా చేసే వాహనాలు అనుమతికి మించి లోడింగ్ చేసి పంపుతున్నారు. దీంతో తారు రోడ్డు, మట్టి రోడ్డులు పగిలి గుంతలుగా ఏర్పాడ్డాయి. ఈ దుమ్ము, ధూళికి స్థానికులు శ్వాసకోశ వ్యాధులతో సతమతమవుతున్నారు. అనుమతికి విరుద్ధంగా జేసీబీలు, హిటాచీలు, కంప్రెషన్ మిషన్లను ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారు.
పశువులు మృత్యవాత..
మహేశ్వరం మండలం తుమ్మలూర్ గ్రామంలోని పలుగు గుట్ట (ఎన్నేగడ్డ) కనుమరుగైపోతున్నది. చేతివాటంలకు ఆలవాటు పడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఓ బడా వ్యాపారికి పలుగు గుట్టను తాకట్టు పెట్టారు. దీంతో ఆ వ్యాపారి ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేయడంతో స్థానికులు, రైతులు అనుమతిని ఎత్తివేయాలని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకుండా, సమస్యలకు సమాధానం ఇవ్వకుండా వ్యాపారులకు మద్దతు పలుకుతున్నారు. పలుగును పగలగొట్టేందుకు బ్లాస్టింగ్ ఉపయోగించిన సమయంలో నేటికి పదుల సంఖ్యలో పశువులు మృత్యవాత పడ్డాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకుని సమస్యలకు పరిష్కారం సూచించాలని ప్రజలు కోరుతున్నారు.
మొక్కలు నాటడం ఓకే.. కొట్టేసే వారిపై చర్యలేవి
ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలు నాటాలని చెబుతున్నా… దానికి విరుద్ధంగా అక్రమార్కులు గుట్టమీద ఉన్న పెద్ద పెద్ద చెట్లు, సీతాఫలాల చెట్లను, ఇతర పండ్ల చెట్లను జేసీబీలతో తీసివేసి, కంప్రెషన్ మిషన్లతో పలుగును బ్లాస్టింగ్ చేసి, భూతలంలో లోతుగా గుంతలు చేసి జేసీబీ, హిటాచ్‌లతో పలుగును బయటకు తీస్తున్నారు. పలుగును బ్లాస్టింగ్ చేయడం వల్ల అటవీ ప్రాంతంలో ఉన్న పక్షులు, జాతీయ పక్షి నెమళ్లు చనిపోతున్నాయని చుట్టూ ప్రక్కల ఉండే రైతులు ఆరోపిస్తున్నారు.
పలుగు తవ్వకాలతో అవస్థలు : రమేష్, స్థానికుడు
నిత్యం తుమ్మలూరు నుంచి తుమ్మలూరు గేట్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై పలుగుతో పాటు మట్టితో కూడిన టిప్పర్లు ఓవర్ లోడ్, ఓవర్ టేక్ చేస్తూ వెళ్తుంటాయి. గ్రామంలోకి వెళ్లే ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రయాణం ఇబ్బందిగా మారిందన్నారు.