కాసులకు కక్కుర్తిపడ్డ అధికారులు.. ఏజెన్సీలో గిరిజనేతరుడి హవా
దిశ, వాజేడు: ఏజెన్సీ చట్టాలను, చుట్టాలుగా మలుచుకొని వలస గిరిజనేతరులు హవా కొనసాగిస్తున్నారు. గ్రామకంఠం భూములను సైతం వదలకుండా పట్టా చేయించుకొని యథేచ్చగా రైతుబంధు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు(జి) గ్రామంలోని సర్వే నెంబర్ 42 /1/1లో రెండెకరాల భూమిని పేరూరు గ్రామానికి పదేండ్ల క్రితం వలసొచ్చిన గిరిజనేతర వ్యక్తి గొడుగులూరి మోహన్ రావు దొడ్డిదారిన పట్టా చేయించుకున్నాడు. టీఆర్ఎస్‌లో చేరి అక్రమంగా రైతుబంధు డబ్బులు పొందడమే గాక బ్యాంకులో […]
దిశ, వాజేడు: ఏజెన్సీ చట్టాలను, చుట్టాలుగా మలుచుకొని వలస గిరిజనేతరులు హవా కొనసాగిస్తున్నారు. గ్రామకంఠం భూములను సైతం వదలకుండా పట్టా చేయించుకొని యథేచ్చగా రైతుబంధు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు(జి) గ్రామంలోని సర్వే నెంబర్ 42 /1/1లో రెండెకరాల భూమిని పేరూరు గ్రామానికి పదేండ్ల క్రితం వలసొచ్చిన గిరిజనేతర వ్యక్తి గొడుగులూరి మోహన్ రావు దొడ్డిదారిన పట్టా చేయించుకున్నాడు. టీఆర్ఎస్‌లో చేరి అక్రమంగా రైతుబంధు డబ్బులు పొందడమే గాక బ్యాంకులో ఆ పట్టా పెట్టి వ్యవసాయ రుణాలు పొందుతున్నాడు. ఏజెన్సీ చట్టాల ప్రకారం.. వలస గిరిజనేతరులకు ఏజెన్సీ ప్రాంతంలో పట్టా హక్కు పొందే అవకాశం లేనప్పటికీ, ఆత్మ డైరెక్టర్ అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కావడంతో రెవెన్యూ అధికారులు ఆయనకు రెండెకరాల భూమికి అక్రమంగా పట్టా హక్కు కల్పించారు.
తాత ముత్తాతల కాలం నుండి ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగించే గిరిజనులకు అరెకరం పట్టాచేయలేని రెవెన్యూ అధికారులు, అధికార పార్టీ నాయకుడికి మాత్రం నిబంధనలు తుంగలో తొక్కి గ్రామకంఠం భూమిని పట్టా చేయడం పలు విమర్శలు దారితీస్తోంది. ఆత్మ డైరెక్టర్ అప్పగించిన ముడుపులకు కక్కుర్తిపడి రెవెన్యూ అధికారులు అక్రమంగా పట్టా చేశారని గిరిజన సంఘాల నాయకులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేత భూ భాగోతంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై వాజేడు ఎమ్మార్వో అల్లం రాజ్ కుమార్‌ను ‘దిశ’ ప్రతినిధి ఫోన్‌లో వివరణ కోరగా ‘భూ ప్రక్షాళన’ సమయంలో నాటి అధికారులు పట్టా కల్పించారని, దీనిపైన సమగ్ర విచారణ జరుపుతామని తెలిపారు.