ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జా.. రంగంలోకి NGT
ప్రత్యేక రాష్ర్టంలో నూతన జిల్లాగా రూపాంతరం చెందిన కందనూలు జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతలు భూబకాసురాలుగా మారారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేయడం… ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేయలనుకుంటే.. ఆ చెరువుల శిఖం భూములను దర్జాగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. […]
ప్రత్యేక రాష్ర్టంలో నూతన జిల్లాగా రూపాంతరం చెందిన కందనూలు జిల్లాలో కొందరు అధికార పార్టీ నేతలు భూబకాసురాలుగా మారారు. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేయడం… ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేయలనుకుంటే.. ఆ చెరువుల శిఖం భూములను దర్జాగా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఈవిషయమై పలువురు కోర్టును ఆశ్రయించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కాగా, దీనిపై నేడు కలెక్టరేట్ లో అధికారుల తుది సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
దిశ, నాగర్ కర్నూల్ : కందనూలు జిల్లాలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కబ్జాలకు తెరలేపారు. ఎక్కడ ఖాళీ జాగా కనపడితే అక్కడ తమ జెండా పాతి సొంతం చేసుకోవడం, ఎక్కువ ధరకు అమ్ముకోవడం వారి పనిగా మారింది. ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువులను అన్ని విధాల అభివృద్ధి పరుస్తామని చెప్తున్నా ఆ పార్టీ బడా లీడర్లంతా చెరువు శిఖం భూములను అమాంతం మింగేస్తున్నారు. జిల్లాలోని చెరువులు, కుంటలను వేల ఎకరాల్లో కబ్జా చేసి వెంచర్లుగా మార్చి సొమ్ము చేసుకున్నారు. వాటిపై ఎన్ని రకాలుగా ఫిర్యాదు చేసినా అందరిని మేనేజ్ చేసుకుంటూ తమ పని సాఫీగా చేసుకుంటూ వచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అత్యంత పెద్దదైన కేసరి సముద్రం చెరువు మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దిన అనంతరం ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. దాదాపు 3వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువును వందల ఎకరాల్లో మట్టి నింపి వెంచర్లుగా మార్చి అమ్మేశారు.
మరికొంతమంది రహస్య మంతనాలు జరిపేందుకు విలాసవంతమైన భవనాలను కూడా నిర్మించుకున్నారు. దీనిపై జిల్లాస్థాయి నుంచి సీఎం కార్యాలయం వరకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో సామాన్య జనం విసిగిపోయారు. దీనిపై మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై చెన్నై బెంచ్ విచారించి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల సమన్వయంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై గత వారం క్రితం ఇచ్చిన నివేదిక ఆధారంగా 31 ప్రాంతాల్లో శిఖం భూములను ఆక్రమించి నిర్మాణాలు జరిపినట్లు కోర్టుకు వివరించారు. కాగా, దీనిపై నేడు కలెక్టరేట్ లో అన్ని శాఖల సమన్వయంతో తుది సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది.
కబ్జా తొలగింపునకు రంగం సిద్ధం..
సుప్రీంకోర్టు రూలింగ్ ఆధారంగా చెరువులు, కుంటలు కబ్జా చేసి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగితే కూల్చేయాలని ఆదేశాలున్నాయి. ఇందులో ప్రభుత్వ భవనాలు ఉన్నా కూల్చాలని స్పష్టంగా పేర్కొంది. కాగా, సుప్రీం కోర్టు రూల్ అమలు చేయాలని చెప్పే అవకాశం ఉంది. దీంతో కబ్జాకోరుల గుండెల్లో గుబులు మొదలైంది.
ఎన్జీటీ తీర్పుతో పదవులకే ఎసరు..
ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మున్సిపల్ చట్టంలో ఎన్నికైన అభ్యర్థి ప్రజాధనాన్ని లూటీ చేసినా.. భూములను కబ్జా చేసినా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన తన అభ్యర్థి సభ్యత్వాన్ని రద్దు చేయనున్నట్లు చట్టంలో పేర్కొన్నారు. కాగా, జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న పుట్నాల కుంటను కొందరు ప్రజాప్రతినిధులు కబ్జా చేశారని ఫిర్యాదు చేయడంతో క్రిమినల్ కేసులు నమోదైనట్లు తెలిసింది. దీంతోపాటు ప్రస్తుతం నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువు భూములను కూడా కబ్జా చేసినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులో నిర్ధారణ అయితే కబ్జా చేసిన వారు ప్రజాప్రతినిధులుగా తమ పదవికి రాజీనామా చేయక తప్పదు.
సొంత భూమి అని నమ్మించిన మాజీ ప్రజా ప్రతినిధి భర్త..
జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉన్న ఉయ్యాలవాడ శివారు ప్రాంతంలో మహిళా సమైక్య భవనం నిర్మాణం కోసం ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త తన సొంత భూమిని దానం చేశారు. ఆ స్థలంలో ప్రభుత్వం ఎన్ఆర్ ఈజీఎస్ కింద రూ.32లక్షల నిధులతో భవనాన్ని నిర్మించారు. తీరా ఆ స్థలం ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో జిల్లా అధికారులే కంగుతిన్నారు. ఆ ప్రజాప్రతినిధి భర్త తన వెంచర్ డెవలప్ మెంట్ కోసం ఈ పథకం రచించినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆ భవనం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పుతో నేలమట్టం కానుంది.