By-election: హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తే.. ఆ ఇద్దరు మహిళల మధ్యే పోటీ..?
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఆయనతో బరిలో నిలిచేదెవరూ, టీఆర్ఎస్.. టికెట్ ఎవరికి ఇస్తుంది అన్న చర్చే ఇప్పుడు ప్రధానంగా వినపడుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి.. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌తో సై అంటే సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి తన బలమేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఆయన ప్రత్యర్థి ఎవరన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఈటల తరువాత ఆయన స్థానాన్ని భర్తీ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ఆయనతో బరిలో నిలిచేదెవరూ, టీఆర్ఎస్.. టికెట్ ఎవరికి ఇస్తుంది అన్న చర్చే ఇప్పుడు ప్రధానంగా వినపడుతోంది.
టీఆర్ఎస్ అభ్యర్థి..
ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌తో సై అంటే సై అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి తన బలమేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తే ఆయన ప్రత్యర్థి ఎవరన్నదే అంతుచిక్కకుండా పోయింది. ఈటల తరువాత ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకుడు ప్రత్యక్ష్యంగా లేకపోవడమే ఇందుకు కారణం. రాజేందర్ ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించిన 17 ఏళ్లలో ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించే నాయకుడు తయారు కాకపోవడం గమనార్హం. దీంతో రాజేందర్ రాజీనామ అస్త్రం ప్రయోగిస్తే బరిలో ఎవరు ఉంటారన్నదే ప్రధాన చర్చగా సాగుతోంది.
అయితే సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కెప్టెన్ లక్ష్మీకాంతరావు కుటుంబం నుంచి అభ్యర్థి ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం గత రెండు రోజులుగా ఊపందుకుంది. కెప్టెన్ సతీమణి సరోజనమ్మకు అవకాశం ఇస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. సరోజనమ్మ గతంలో హుజురాబాద్ ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు వాక్ చాతుర్యం కూడా ఉండడంతో కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. అయితే.. గత ఎన్నికల్లో సరోజనమ్మను ఎంపీపీ పదవి నుండి తొలగించేందుకు.. ఎంపీటీసీలు ఈటల మద్దతుతోనే అవిశ్వాసం పెట్టించారని కెప్టెన్ ఆరోపించారు. దీంతో ఈటలకు పోటీగా సరోజనమ్మను నిలబెట్టి గెలిపించుకుని.. ప్రతీకారం తీర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.
బరిలో జమునా రెడ్డి..
ఒకవేళ అధికార టీఆర్ఎస్ పార్టీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు భార్య సరోజనమ్మను పోటీలో నిలిపితే ఈటల రాజేందర్ కూడా తన వ్యూహాన్ని రచించుకున్నట్టుగా తెలుస్తోంది. సరోజనమ్మపై పోటీ చేసేందుకు రాజేందర్ తన భార్య జమునారెడ్డిని బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళతో పోటీ చేసేందుకు రాజేందర్ ఉత్సుకత చూపడం లేదని.. జమునా రెడ్డితో పోటీ చేయిస్తేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఈటల వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. హుజురాబాద్‌లోని అన్ని మండలాల కేడర్లతో ఈటల భార్య జమునా రెడ్డికి ప్రత్యక్ష పరిచయాలు కూడా ఉండడం లాభిస్తుందని భావిస్తున్నారు. ఆమె పోటీలో ఉంటే నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గంతో పాటు బీసీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇదే నిజమైతే..
టీఆర్ఎస్, ఈటల తరుఫున హుజురాబాద్ నుండి మహిళా అభ్యర్థులే పోటీ చేస్తే అత్యంత అరుదైన రికార్డు నమోదు కానుంది. ఇప్పటి వరకు మహిళలే పోటీ చేయని హుజురాబాద్ నుండి ప్రధాన ప్రత్యర్థులు ఇద్దరు కూడా మహిళలు కావడం చరిత్రకెక్కనుంది. అయితే ఇది ఎంత వరకు సాధ్యమన్నది మాత్రం భవిష్యత్తులో తేలనుంది.