సీఎస్‌పై ఐఏఎస్ అధికారుల ఆగ్రహం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఐఏఎస్ అధికారులలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి పనిలో జోక్యం చేసుకోవడపై వారు మండిపడుతున్నారు. ఫైళ్లు ముందుకు కదలకపోవడం, గ్రీవెన్స్ సమస్యలు కూడా పరిష్కరించేందుకు అనుమతి లేకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. కిందిస్థాయిలోనూ తనదే పెత్తనం ఉండాలనేలా సీఎస్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీంతో తమ శాఖల పరిధిలోనూ పనులు చేయలేక పోతున్నామంటున్నారు. విసిగిపోయిన కొందరు అధికారులు […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర పాలనా యంత్రాంగంలో అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ఐఏఎస్ అధికారులలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి పనిలో జోక్యం చేసుకోవడపై వారు మండిపడుతున్నారు. ఫైళ్లు ముందుకు కదలకపోవడం, గ్రీవెన్స్ సమస్యలు కూడా పరిష్కరించేందుకు అనుమతి లేకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. కిందిస్థాయిలోనూ తనదే పెత్తనం ఉండాలనేలా సీఎస్ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీంతో తమ శాఖల పరిధిలోనూ పనులు చేయలేక పోతున్నామంటున్నారు. విసిగిపోయిన కొందరు అధికారులు సీఎస్ తీరు మీద 24 అంశాలతో సీఎంకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీఎస్ మీద కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారులు తిరుగుబావుటా ఎగురవేయడం విశేషం.
ఇదీ పరిస్థితి..
కిందిస్థాయి ఉద్యోగులను బదిలీ చేసేందుకు ఇటీవల వాణిజ్య పన్నుల శాఖలో ఓ ఫైల్సిద్ధమైంది. ఈ విషయం ఆ శాఖ కమిషనర్ నీతూప్రసాద్‌కు కూడా తెలియదు. నేరుగా సీఎస్ ఈ జాబితాను తయారు చేశారు. ఇంకా పోస్టింగులు ఇవ్వ లేదు. తన జోక్యం లేకుండా జరుగుతున్నందున కమిషనర్ దానిని అడ్డుకుంటున్నారు. దీంతో బదిలీలు, పదోన్నతులకు బ్రేక్ పడింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సత్యనారాయణరెడ్డి నెల రోజులు సెలవు పెట్టి విదేశాలకు వెళ్లారు. ఆ తర్వాత విధులకు వచ్చారు. సీఎస్ అందుకు అనుమతించలేదు. తనకు తెలియకుండా విధులలో ఎలా చేరతారంటూ మండిపడ్డారు. దీంతో సత్యనారాయణరెడ్డి సెలవులోనే ఉండిపోయారు. ఆబ్కారీశాఖలోనూ ఏళ్ల తరబడి బదిలీలు పెండింగులో ఉన్నాయి. సీఎస్‌కు పైల్పెట్టినా సమాధానం రావడం లేదు. ఆ శాఖ మంత్రి కూడా స్వయంగా పలుమార్లు సీఎస్‌కు నివేదించారు. అయినా స్పందన లేదు. కీలక స్థానాలు ఖాళీగా ఉండటంతో ఆదాయం తగ్గుతోంది. బదిలీలు, పదోన్నతులపై డీపీసీ క్లియరెన్స్వచ్చి కూడా ఏడాది గడిచింది. సీఎస్‌నుంచి ఆదేశాలు మాత్రం రాలేదు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ చిరంజీవులుతో బహిరంగ వాగ్వివాదమే జరిగింది. ధరణి, రిజిస్ట్రేషన్ అంశాలలో సీఎస్‌ను ప్రశ్నించారని, తన విధానాలకు అడ్డు చెప్పారని అంటూ చిరంజీవిని అక్కడి నుంచి తప్పించారు. వేరేచోట పోస్టింగ్ కూడా ఇవ్వలేదు.ధరణి అంశం కొనసాగుతుండటంతో సీఎం కూడా సీఎస్‌ను వెనకేసుకొచ్చారు. ఇలా పలువురు సీనియర్ ఐఏఎస్‌లతో తరచూ వివాదాలు జరుగుతున్నాయి. పలువురు శాఖాపరమైన అంశాలలో విభేదిస్తున్నారు. మరికొందరికి సీఎస్ అసలు సమయం ఇవ్వడం లేదని సమాచారం. దీంతో వారు తమను చిన్నచూపు చూస్తున్నారంటూ బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు. పని చేయడానికి తమకు కూడా అవకాశం ఇవ్వడం లేదని కలెక్టర్లు కూడా ఆవేదన చెందుతున్నారు.
అవసరమైతే సెలవులో
ఈ నేపథ్యంలో పలువురు ఐఏఎస్ అధికారులు సెలవులో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. ఈ విషయం మీద ఇప్పటికే కొందరు సీఎస్ కు, సీనియర్లకు సమాచారమిచ్చారని అంటున్నారు. చాలా మంది ఐఏఎస్‌లు విధులకే దూరంగా ఉంటున్నారు. జిల్లాల నుంచి వచ్చిన చాలా ఫైళ్లు కూడా క్లియర్ కావడం లేదు. చిన్న చిన్న అంశాలపై కూడా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవడం లేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నా, అలా ఎందుకు చేశారంటూ సీఎస్వెంటనే అడుగుతున్నారని తెలిసింది. దీంతో వారు ఫైళ్లను పక్కనేస్తున్నారు. నిధుల వినియోగంలోనూ ఇదే పరిస్థితి. కలెక్టర్ల ఫండ్ ఉన్నా, సీఎస్ అనుమతి లేకుంటే రూపాయి కూడా వాడే అవకాశాలు ఉండటం లేదని అంటున్నారు. అత్యవసర పనులకు కూడా సీఎస్ నుంచి అనుమతి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. అనుమతి కోసం ఫైల్ పంపిస్తే నిర్ణయం తీసుకోకుండా పక్కనేస్తున్నారని చెబుతున్నారు.
సీఎం ఆగ్రహంతో వెలుగులోకి వేదన
సీఎస్‌పై సీఎం కేసీఆర్ఆగ్రహంతో ఉన్నారనే ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఐఏఎస్ అధికారులు ముందుకు వచ్చి సీఎస్‌పై ఫిర్యాదు చేస్తున్నారు. సలహాదారులుగా ఉన్న రిటైర్డ్ఐఏఎస్అధికారులు కూడా ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ధరణి ఫెయిల్యూర్, ఎల్ఆర్ఎస్ వంటి అంశాలపై సీఎం చాలా సీరియస్ గా ఉన్నారని సమాచారం. ఈ క్రమంలో సీఎస్, డీజీపీని బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.