వ్యాక్సిన్లకు గేట్​ వేగా హైదరాబాద్​

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను, సమర్థవంతమైన ఫార్మా పరిశ్రమలను కలిగి ఉన్న భారతదేశం కొవిడ్-19 వ్యాక్సిన్ల పంపిణీలో చాలా వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్, దాని సమీప ప్రాంతాలు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉన్నాయి. భారత్ నుంచి తయారయ్యే వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా తయారీదారుల దిగుమతి అవసరాలను తీర్చడంతో పాటు […]

Update: 2021-01-04 21:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను, సమర్థవంతమైన ఫార్మా పరిశ్రమలను కలిగి ఉన్న భారతదేశం కొవిడ్-19 వ్యాక్సిన్ల పంపిణీలో చాలా వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్, దాని సమీప ప్రాంతాలు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా ఉన్నాయి. భారత్ నుంచి తయారయ్యే వ్యాక్సిన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా తయారీదారుల దిగుమతి అవసరాలను తీర్చడంతో పాటు కొవిడ్ -19 వ్యాక్సిన్ల దేశీయ పంపిణీలో హైదరాబాద్‌ విమానాశ్రయానికున్న కనెక్టివిటీ బాగా ఉపయోగపడుతుంది.

ఈ నేపథ్యంలో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్ కార్గో, దుబాయ్ విమానాశ్రయాలు కలిసి ‘హైదరాబాద్ – దుబాయ్ గ్లోబల్ వ్యాక్సిన్ కారిడార్’అనే ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ మేరకు ఒప్పందాల మీద జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్, హైదరాబాద్ ఎయిర్ కార్గో సీఈఓ సౌరభ్ కుమార్, దుబాయి ఎయిర్ పోర్టు ఈవీబీ కమర్షియల్ యూజీన్ బారీలు సోమవారం వర్చువల్ కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్, దుబాయ్ విమానాశ్రయాలు వివిధ ఖండాలకు రవాణా అయ్యే టెంపరేచర్-సెన్సిటివ్ వ్యాక్సిన్ రవాణాకు ప్రాధాన్యతనిస్తాయి.

కస్టమైజ్డ్, సరళీకృత ప్రక్రియల ద్వారా కొవిడ్ -19 వ్యాక్సిన్ తయారీ కేంద్రాల నుంచి విమానాశ్రయం, అక్కడి నుంచి హబ్ లాజిస్టిక్స్, అటు నుంచి ఎండ్-కస్టమర్లకు వ్యాక్సిన్ల డెలివరీని క్రమబద్ధీకరిస్తారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ సరఫరా కోసం వ్యూహాత్మక ఎయిర్‌కార్గో భాగస్వామిగా గుర్తించింది. అదే సమయంలో హైదరాబాద్, దుబాయ్ విమానాశ్రయాన్ని గ్లోబల్ వ్యాక్సిన్ సరఫరా గొలుసును సులభతరం చేసే కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా ఉపయోగించుకుంటుంది. ఈ భాగస్వామ్యం ద్వారా పరస్పర టెక్నాలజీ సహకారాన్ని కూడా అందుకుంటారు. ఈ ఒప్పందం కింద రెండు సంస్థలు ఒక సమగ్ర ఐటీ సొల్యూషన్‌పై కలిసి పని చేస్తాయి. దీని వల్ల వినియోగదారులకు, వివిధ ప్రపంచ గమ్యస్థానాలకు రవాణా అయ్యే కార్గో, వ్యాక్సిన్ల ఉష్ణోగ్రత, వాటి ట్రాకింగ్‌తో సహా ఎండ్-టు-ఎండ్ సేవలు అందుతాయి.

హైదరాబాద్ ముఖద్వారం

భారతదేశం నుంచి వ్యాక్సిన్ ఎగుమతులకు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఇప్పుడు ఒక గేట్​ వేగా ఉందని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ప్రదీప్ పణికర్ అన్నారు. ప్రస్తుత కొవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్లను సురక్షితంగా, సమర్థవంతంగా రవాణా చేయడానికి కచ్చితమైన ప్రణాళిక, సహకారాలు అవసరమన్నారు. అందుకే కొవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయడం కోసం తాము దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. కోల్డ్ టు అల్ట్రా-కోల్డ్ ఉష్ణోగ్రత పరిధులు అవసరమైన కొవిడ్ -19 వ్యాక్సిన్ల కోసం తమ సామర్థ్యాన్ని గణనీయంగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ల ఎగుమతి/దిగుమతులు, వ్యాక్సిన్ల దేశీయ పంపిణీలో తాము భారతదేశపు అతి పెద్ద ఎయిర్ కార్గో కేంద్రంగా అవతరించనున్నట్లు ప్రకటించారు.

జీఎంఆర్ గ్రూపు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఎస్‌జీకే కిషోర్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ల రవాణాకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో దుబాయ్ ఎయిర్ పోర్ట్స్‌ సహకారంతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఎయిర్ ఫ్రైట్ కారిడార్, వ్యాక్సిన్ల రవాణాకు ఎలాంటి ఆటంకాలూ లేకుండా జరగడానికి తోడ్పడుతుందన్నారు. దుబాయ్ విమానాశ్రయాల సీఈఓ పాల్ గ్రిఫిత్స్ మాట్లాడుతూ.. రాబోయే కొన్ని నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ -19 వ్యాక్సిన్లను సమర్థవంతంగా, సురక్షితంగా పంపిణీ చేయడానికి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉందన్నారు.

పలు దేశాలకు రవాణా

హైదరాబాద్ విమానాశ్రయం అనేక ప్రధాన వ్యాక్సిన్ తయారీదారులకు సమీపంలో ఉంది. యూరప్, ఆఫ్రికా, అమెరికా ఆసియాలోని మార్కెట్లను లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ల తయారీకి హైదరాబాద్ కేంద్రంగా ఉంది. టెంపరేచర్ సెన్సిటివ్ వ్యాక్సిన్ కార్గోను నిర్వహించే హైదరాబాద్ విమానాశ్రయం, దుబాయ్ విమానాశ్రయం లాంటి ప్రధాన హబ్‌ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వాటిని పంపిణీ చేస్తుంది. జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో ఫార్మా, వ్యాక్సిన్ రవాణాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం నిల్వ, పంపిణీ పద్ధతులను పాటిస్తున్నారు.

గుర్తింపు పొందిన సర్టిఫైడ్ కార్గో విమానాశ్రయమిది. దేశంలో మొదటి డెడికేటెడ్ ఫార్మా జోన్, అతి పెద్ద టన్నెల్ ఎక్స్-రే మెషిన్, కొవిడ్ వ్యాక్సిన్ల సురక్షిత రవాణాకు కీలకమైన ఎన్విరోటైనర్, వా-క్యూ-టెక్, సీసేఫ్, డోకాస్చ్ వంటి వివిధ కూల్ కంటైనర్ల ప్రధాన స్టాకింగ్ స్టేషన్లలో ఒకటిగా నిలిచింది. కొవిడ్ -19 వ్యాక్సిన్‌ల నిర్వహణలో ప్రత్యేకమైన అవసరాల కోసం విమానాశ్రయం ల్యాండ్‌సైడ్, ఎయిర్‌సైడ్‌ సదుపాయాలను పెంచి, వాటిని ఒక క్రమంలో నిర్వహించే ప్రక్రియలను చేపడుతోంది.

Tags:    

Similar News