ఓట్లు ఎవనికి గావాలే.. మాకు ‘నోట్లే’ కావాలే.. అక్కడ ఎవర్ని పలకరించినా ఇదే మాట!

దిశ ప్రతినిధి, కరీంనగర్ : వాడియ్యలే..వీడియ్యలే కవర్. ఎవనెవనికో ఇచ్చిరంట లీడర్లు. నేను ఓటేసేటోన్ని కాదా..? నాకు ఓటు లేదా అంటూ చర్చలు సాగుతున్నాయి ఇక్కడి పల్లెల్లో. రెండు రోజులుగా నియోజకవర్గం అంతటా కూడా సీల్డ్ కవర్ల గురించే చర్చ సాగుతోంది తప్ప ఓట్లు ఎవరికి వేయాలి అన్న విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. పోలింగ్ తేదీ సమీపించగానే ఓటర్ల ఇళ్ల వద్దకు సీల్డ్ కవర్లు వెల్లడంతో ఇప్పటివరకు ఆయా పార్టీల చుట్టూ సాగిన చర్చంతా […]

Update: 2021-10-29 05:02 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : వాడియ్యలే..వీడియ్యలే కవర్. ఎవనెవనికో ఇచ్చిరంట లీడర్లు. నేను ఓటేసేటోన్ని కాదా..? నాకు ఓటు లేదా అంటూ చర్చలు సాగుతున్నాయి ఇక్కడి పల్లెల్లో. రెండు రోజులుగా నియోజకవర్గం అంతటా కూడా సీల్డ్ కవర్ల గురించే చర్చ సాగుతోంది తప్ప ఓట్లు ఎవరికి వేయాలి అన్న విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. పోలింగ్ తేదీ సమీపించగానే ఓటర్ల ఇళ్ల వద్దకు సీల్డ్ కవర్లు వెల్లడంతో ఇప్పటివరకు ఆయా పార్టీల చుట్టూ సాగిన చర్చంతా నోట్ల వైపు మల్లింది. నియోజకవర్గంలోని ఐదు మండలాలు, రెండు మునిసిపాలిటీలలోనూ ఇదే పరిస్థితి నెలకొనడం గమనార్హం.

దారి మళ్లించిన ‘నోటు’

ఐదు నెలలు నిరంతరంగా సాగిన ప్రచార హోరులో ప్రధాన పార్టీలు తమ ఉనికిని ఓటర్ల హృదయాల్లోకి చొచ్చుకపోయే విధంగా ప్రచారం చేసుకున్నాయి. మంత్రుల నుంచి మొదలు సామాన్య నాయకుని వరకు ప్రతి ఒక్కరూ కూడా తమ పార్టీకి ఓటెయ్యాలంటూ అభ్యర్థించారు. నిత్యం ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు సాగాయి. దీంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారోనన్న విషయంపై ఆరా తీశాయి సర్వే ఏజెన్సీలు, నిఘా వర్గాలు. ఇక్కడి ఓటర్లలో తమ పట్టు సాధించుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ప్రచారం ఇక్కడి ప్రజల జీవన విధానంలో భాగంగా మారిపోయింది. అయితే, చివరి మూడు రోజుల్లో నగదు పంపిణీ కార్యక్రమానికి పొలిటికల్ పార్టీలు శ్రీకారం చుట్టడంతో ఓటర్లంతా కూడా ఇదే అంశంపై చర్చించుకుంటుండటం గమనార్హం. ఏ పల్లెలో చూసినా సీల్డ్ కవర్ల గురించే మాట్లాడుకుంటున్న పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామాల్లో ఓట్ల కన్నా నోట్లకే ఎక్కువగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కవర్లే కవర్లు…

సార్ మీ ఇంట్లో ఇద్దరు ఓటర్లు ఉన్నారు కదా మీకు సంబంధించిన కవర్ తీసుకోండి. అంటూ ఓ పార్టీకి చెందిన లీడర్లు ఇచ్చి వెళ్లగానే మరో పార్టీకి చెందిన కార్యకర్తలు మరో కవర్ తీసుకొచ్చి ఇచ్చిపోతున్నారు. దీంతో నియోజవకర్గంలో నగదు పంపిణీ తీరు బాజాప్తాగానే కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రలోభాలకు గురి చేస్తున్న ప్రతీ ప్రక్రియను కట్టడి చేసేందుకు పకడ్భందీగా కట్టడి చేస్తున్నామని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కానీ ఇంటింటికీ వెళ్లి సీల్డ్ కవర్లు ఇస్తున్నా వారిని మాత్రం పట్టుకోకపోవడం విడ్డూరంగా ఉంది. బాహాటంగానే సాగుతున్న ఈ చర్చ గురించి అడ్డుకునే వారు లేకుండా పోయారన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారు లేకపోలేదు.

ఫోన్లతో లోకల్ లీడర్ల తిప్పలు..

ఏం అన్న నేనేం అన్యాయం చేశానే… నా పేరు మీ పార్టీ వాళ్లు పంపిన కవర్లలో లేదు.. నీ ప్రత్యర్థి పార్టీతో తిరిగిన్నా.. నాకు ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట కొంతమంది. అన్ని చోట్లా ఆయా పార్టీల లోకల్ లీడర్లకు ఇలాంటి ఫోన్లే వస్తుండటంతో ఏం చేయాలో అర్థంకాక స్థానిక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల నాటికి దీని ప్రభావం చుట్టుకుంటుందా అన్న భయం వారిలో నెలకొంటుంటే, మరో వైపున ఫోన్లు చేస్తున్న వారికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాకుండా సతమతమవుతున్నారు. పార్టీ ఇంచార్జీలుగా వ్యవహరించిన వారి ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్లు లిఫ్ట్ చేయకపోవడంతో చాలామంది సీరియస్ అవుతున్నారని తెలుస్తోంది.

వాళ్లకూ పరేషానే…

ఐదు నెలలుగా సర్వే ఏజెన్సీలు ఓటర్ల నాడి పట్టుకుని ఎవరు ఎటు వైపు మొగ్గు చూపుతున్నారన్న విషయంపై ఆరా తీశాయి. అయితే, మూడు రోజుల్లో సినిమా అంతా మారిపోయింది. ఓటర్ల చేతుల్లోకి సీల్డ్ కవర్లు వెళ్లడంతో ఇప్పుడంతా అయోమయంగా మారిపోయింది వారికి. రెండు రోజులుగా గ్రామాల్లో తిరుగుతున్న ఏజెన్సీలు ఓటరు ఎటు వైపు మొగ్గుతున్నాడన్న విషయంపై క్లారిటీగా కనిపెట్టలేకపోతున్నారు. ఇదేంట్రా బాబు ఇంతకాలం గ్రౌండ్ లెవల్లో చేసిన సర్వే అంచనాలను ప్రలోభాల పర్వం తలకిందులు చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈ పరిస్థితి నిఘా వర్గాల వారికి కూడా తలెత్తినట్టుగా తెలుస్తోంది. ఓటర్లకు సీల్డ్ కవర్లు అందించిన తరువాత వారి మనసులో మాటను బయట పెట్టకపోవడంతో పోలింగ్ నాటికి ఎటు వైపు మొగ్గు చూపుతారోనన్న విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags:    

Similar News