హుజూరాబాద్ ఉపఎన్నికకు ముహూర్తం ఫిక్స్
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఆగస్టు మధ్యలో జరిగే అవకాశముంది. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది. హుజూరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర డజనుకు పైగా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి ఉప ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించనున్నట్లు సమాచారం. పంద్రాగస్టు తర్వాత ఎన్నికల ప్రక్రియ […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఆగస్టు మధ్యలో జరిగే అవకాశముంది. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు ప్రకటించే అవకాశం ఉంది. హుజూరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్, అసోం, మధ్యప్రదేశ్, కర్నాటక, తమిళనాడు తదితర డజనుకు పైగా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయడానికి ఉప ఎన్నికలకు షెడ్యూలు ప్రకటించనున్నట్లు సమాచారం. పంద్రాగస్టు తర్వాత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కరోనా పరిస్థితుల కారణంగా ఇప్పట్లో ఎలక్షన్లు నిర్వహించలేమంటూ కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న అనుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా సుమారు యాభై అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో 7, పశ్చిమబెంగాల్‌లో 7, మణిపూర్‌లో 6, మధ్యప్రదేశ్‌లో 3, పంజాబ్‌లో 3, అసోంలో 3, రాజస్థాన్‌లో 2 చొప్పున మొత్తం 50 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో రెండు నెలల వ్యవధిలో తప్పనిసరిగా ఎన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందో లెక్కలు తేల్చి దానికి అనుగుణంగా షెడ్యూలు విడుదల చేయనుంది. అయితే ఉత్తరప్రదేశ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరాఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వచ్చే ఏడాది మార్చిలోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఆరు నెలల కంటే తక్కువ గడువు ఉన్నట్లయితే వాటికి ఎన్నికలు నిర్వహించకుండా అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించే అవకాశం ఉన్నది.
కరోనా తీవ్రత లేనందువల్లనే ..
ఏయే రాష్ట్రాల్లోని ఏయే స్థానాలకు ఆగష్టు చివరికల్లా నిర్వహించనున్నదీ ఈ నెల 9వ తేదీన ఎన్నికల కమిషనర్లు సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు డిసెంబరు వరకూ గడువు ఉన్నప్పటికీ థర్డ్ వేవ్ లాంటి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వీలైనంత తొందరగా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మినహా తక్కువ కేసులు నమోదవుతున్నచోట నిర్వహించడానికి ఇబ్బందులు లేవనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.
రానున్న రెండు నెలల్లో తప్పనిసరిగా నిర్వహించాల్సిన ఉప ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నది. పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రస్తుతం ఏ స్థానం నుంచి గెలుపొందకుండానే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆమెకోసం ఒక ఎమ్మెల్యే రాజీనామా చేశారు. ఆ స్థానం నుంచి ఆమె పోటీ చేయాలనుకుంటున్నది. ఆ ప్రకారం అక్టోబరుకల్లా ఉప ఎన్నికను నిర్వహించాల్సి ఉంది. అలాంటి మరికొన్ని నియోజకవర్గాలతో పాటుగానే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు కూడా షెడ్యూలు ప్రకటించాలనుకుంటున్నది. గత నెల 12వ తేదీన హుజూరాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన గంటల వ్యవధిలోనే స్పీకర్ దాన్ని ఆమోదించారు. మరికొద్దిసేపటికే ఆ స్థానం ఖాళీ అయిందంటూ గెజిట్ కూడా విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి తెలియజేశారు.
అన్ని పార్టీలూ అదే అంచనాలో
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగవచ్చంటూ అధికార పార్టీ టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అంచనా వేస్తున్నాయి. ఆగస్టు చివరికల్లా ఎన్నికలు రావచ్చని అభిప్రాయపడుతున్నాయి. కానీ పంద్రాగష్టు తర్వాత పూర్తికావచ్చని బీజేపీ ఢిల్లీ వర్గాలు భావిస్తున్నాయి. తొలుత అక్టోబరులో జరగవచ్చని రాష్ట్రంలోని పార్టీలు అంచనా వేశాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఆగస్టు చివరికల్లా కొన్ని స్థానాలను భర్తీ చేయాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం వాటితోపాటే హుజూరాబాద్‌కు కూడా నిర్వహించాలనుకుంటున్నట్లు తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కూడా ఆగస్టు చివరన లేదా సెప్టెంబరు మొదటి వారంలో జరగవచ్చని అనుకుంటున్నాయి. కానీ బీజేపీ ఢిల్లీ వర్గాలు మాత్రం ఆగష్టులోనే వచ్చేస్తాయన్న నమ్మకంతో ఉన్నాయి.