మూట ఎత్తేది లేదు.. పూట గడిచేది లేదు.. దీనస్థితిలో రైల్వే కూలీలు
దిశ, తెలంగాణ బ్యూరో : ఒంటిపై ఎర్ర చొక్కా, ఖాకీ నిక్కర్ వేసుకుని కూలీ సార్.. కూలీ.. అంటూ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా పలకరించి ఉపాధి పొందే కూలీలు కుదేలయ్యారు. వచ్చిపోయే ప్రయాణికుల సామగ్రి భారాన్ని మోసే పోర్టర్ల బతుకు నేడు భారంగా కొనసాగుతోంది. ప్లాట్ ఫాంలనే నమ్ముకుని సాగిస్తున్న వారి జీవితాలను కరోనా ప్లాట్ ఫాంలపై పడేలా చేసింది. కొవిడ్ తో ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయడంతో వారి పరిస్థితి మరింత […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఒంటిపై ఎర్ర చొక్కా, ఖాకీ నిక్కర్ వేసుకుని కూలీ సార్.. కూలీ.. అంటూ రైల్వేస్టేషన్లలో ప్రయాణికులతో మర్యాద పూర్వకంగా పలకరించి ఉపాధి పొందే కూలీలు కుదేలయ్యారు. వచ్చిపోయే ప్రయాణికుల సామగ్రి భారాన్ని మోసే పోర్టర్ల బతుకు నేడు భారంగా కొనసాగుతోంది. ప్లాట్ ఫాంలనే నమ్ముకుని సాగిస్తున్న వారి జీవితాలను కరోనా ప్లాట్ ఫాంలపై పడేలా చేసింది.
కొవిడ్ తో ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పూట గడవక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అద్దె కట్టేందుకు కూడా డబ్బులు లేక అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తుండటంతో ఒక్కొక్కరికి నెలలో వారం రోజులు మాత్రమే పని దొరుకుతోంది. మిగిలిన రోజుల్లో వేరే పనులకు వెళ్దామన్నా కొవిడ్ కారణంగా ఎవరూ రానివ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరోనాకు ముందు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1000కి పైగా కూలీలు ఉండగా దక్షిణ మధ్య రైల్వేకు కేంద్ర బిందువైన సికింద్రాబాద్ స్టేషన్‌లో మొత్తం 220 మంది లైసెన్స్‌డ్ కూలీలు ఉన్నారు. కాచిగూడలో 40, నాంపల్లిలో 50, లింగంపల్లిలో ముగ్గురు చొప్పున కూలీలు పని చేస్తున్నారు. కొవిడ్‌కు ముందు సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రతి రోజు 110 మంది చొప్పున రెండు షిప్టుల్లో పని చేసేవారు. ఈ మేరకు దినం తప్పి దినం లెక్కన ఒక్కో కూలీకి 15 రోజులపాటు పనులు లభించేవి. మిగిలిన పదిహేను రోజుల్లో ఏదైనా ఇతర కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. పని చేసిన రోజు ఒక్కొక్కరికి రూ.1000-1200 వరకు కూలీ గిట్టేది. 2020 మార్చికి ముందు వరకు కరోనా వ్యాప్తి లేకపోవడంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతి రోజూ 121 ఎక్స్ ప్రెస్ రైళ్లు దేశవ్యాప్తంగా రాకపోకలు సాగించగా, దాదాపు 1.40 లక్షల మంది ప్రయాణించేవారు. దీంతో కూలీలకు 24 గంటలపాటు పని దొరికేది.
అయితే కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. లాక్ డౌన్ విధించడంతో రైల్వే కూలీల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. దీంతో కొంతమంది నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సాకారు. మొదటి వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో రైళ్ల్లు ఒక్కొక్కటిగా పట్టాలెక్కడంతో తిరిగి నగరానికి వచ్చి పనులు సాగించారు. పరిస్థితులు చక్కబడ్డాయి అనుకునేలోపే సెకండ్ వేవ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
రెండో దశ పంజా..
గతేడాది జూన్, జూలై నుంచి దక్షిణ మధ్య రైల్వేలో పదుల సంఖ్యలో ప్రారంభమైన రైళ్లు దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వచ్చేసరికి భారీగా పెరిగాయి. డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ప్రతి రోజూ 300 రైళ్లు రాకపోకలు సాగించగా.. ఇందులో 210 రైళ్లు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి నుంచి నేరుగా ప్రారంభమయ్యేవి. దీంతో రైల్వే కూలీలకు కొంత మేరకు పనులు దొరికాయి.
అయితే కొవిడ్ తగ్గుముఖం పట్టి మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చాయనుకుంటున్న తరుణంలో వైరస్ రెండో దశ పంజా విసురుతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతోపాటు మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో ఆయా స్టేషన్ల నుంచి నడుస్తున్న 210 రైళ్లలో ఇప్పటి వరకు 86 రైళ్లను రద్దు చేశారు. కొవిడ్‌తో ఆయా రైళ్లలో ప్రయాణికుల సంఖ్య తగ్గిన కారణంగా కొన్ని రోజులపాటు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రకటించింది.
దీంతో రోజుకు రూ.200 కూలీ దొరకడమే గగనమైంది. దీనికి తోడు తుఫాన్, అకాల వర్షాల కారణంగా మరికొన్ని రైళ్లు, స్పెషల్ ట్రైన్లు రద్దు కావడంతో రోజుకు 200 సంపాదించడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బులతో పూట గడవడం ఇబ్బందిగా మారిందని ఆందోళన చెందుతున్నారు. వేరే పనులకు వెళ్దామంటే కరోనా నేపథ్యంలో ఎవరూ రానివ్వడం లేదని, తద్వారా కుటుంబ పోషణ భారంగా మారిందని మనోవేదనకు గురవుతున్నారు.
దగ్గరకు రానివ్వని ప్రయాణికులు
రైళ్లలో రాకపోకలు సాగించే ప్రయాణికలు సైతం కరనా కారణంగా కూలీలను ఎవరూ దగ్గరకు కూడా రానివ్వడంలేదు. వారి సామగ్రిని వారే మోసుకుంటూ రావడంతో ఉన్న పని కూడా కరువైంది. దానికి తోడు అభివృద్ధి పేరిట రైల్వే శాఖ చేపట్టిన ఎస్కలేటర్లు కూడా వారికి శాపంగా మారాయి. అందరూ లిఫ్ట్, ఎస్కలేటర్లను వినియోగించడంతో కూలీలకు ప్రాధాన్యం తగ్గింది. ట్రాలీ బ్యాగులు కూడా అందుబాటులోకి రావడంతో పోర్టర్లకు ఉపాధి కరువైంది. తాతల కాలం నుంచి ఇదే పనిని నమ్ముకున్న వారి జీవితాలు నేడు అగమ్యగోచరంగా మారాయి. కనీసం బస్సు చార్జీలు కూడా గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోర్టర్లు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకునే స్థితికి రైల్వే కూలీల పరిస్థితి మారింది.
కూలీ గిట్టడం లేదు
కరోనా కారణంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మునుపటి లెక్క రైళ్లు నడవడం లేదు. కొవిడ్‌కు ముందు నేను రోజుకు రూ.800 నుంచి రూ.1000 వరకు సంపాదించేవాడిని. ఇప్పుడు నాలుగు రోజులకోసారి వచ్చే పనితో కనీసం రూ.500 కూడా రావడం లేదు. ఏమాత్రం కూలీ గిట్టడం లేదు. పని దొరకుతుందని ఆశతో వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా లాభం లేకుండా పోయింది. రైల్వే శాఖ మమ్మల్ని ఆదుకోవాలి.
– గణేశ్, రైల్వే కూలీ, హైదరాబాద్
బస్సు చార్జీలు కూడా రావడంలేదు
కొవిడ్‌తో ఏడాదిన్నర కాలంగా కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మాదిరిగా చేతినిండా పనులు లేకపోవడంతో కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్నారు. రైళ్ల సంఖ్య తగ్గిపోవడంతో ఒక్కొక్కరికి నాలుగు రోజుల వరకు కూడా పని దొరకడం లేదు. కొవిడ్ కష్టకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక్కో కూలీకి నెలకు రూ.10 వేల చొప్పున జీవనభృతి అందించి ఆదుకోవాలి. చౌటుప్పల్ దగ్గర నేలపట్ల గ్రామం మాది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతదూరం నుంచి పని కోసం వస్తే కనీసం బస్సు చార్జీలు కూడా రావడంలేదు.
– కుమార్, రైల్వే కూలీ, నేలపట్ల గ్రామం
గ్రూప్ డీ పోస్టుల్లో భర్తీ చేయాలి
ప్రయాణికుల సామగ్రి మోస్తూ బతికేవాళ్లం. రైళ్లు రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్లు బతికేదెలా? ఇప్పటి వరకు ఎవరికీ రైల్వే శాఖ చేయూతనందించలేదు. కొన్ని రైళ్లు రాకపోకలు సాగిస్తున్నా కొవిడ్ వల్ల ఎవరూ దగ్గరికి రానివ్వడం లేదు. వాళ్ళ సామగ్రి వల్లే తెచ్చుకుంటున్నారు. తాతల కాలం నుంచి వంశ పారపర్యంగా పని చేస్తున్నాం. 2008 లో అప్పటి రైల్వేశాఖ మంత్రి లాలుప్రసాద్ యాదవ్ సికింద్రబాద్ లో పనిచేస్తున్న దాదాపు 180 మందికి గ్రూప్ డీ ఉద్యోగులుగా రిక్రూట్ చేశారు. మమ్మల్ని కూడా అలా భర్తీ చేసుకొని ఆదుకోవాలి.
– వెంకటేశ్, రైల్వే కూలీల సంఘం అధ్యక్షుడు, సికింద్రాబాద్