కఠోరంగా శ్రమించిన ఆటగాడు.. లక్ష్యాన్ని సాధించాడు
దిశ, స్పోర్ట్స్: సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ 13వ సీజన్ నుంచి ఈ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబయి తరఫున నిలకడగా ఆడుతూ.. సూర్యకుమార్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 480 పరుగులతో రాణించిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని ప్రతీ ఒక్కరూ భావించారు. సూర్యకుమార్ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవుతాననే ధీమాతో ఉన్నాడు. కానీ అదృష్టం అతడి తలుపు తట్టలేదు. దీంతో […]
దిశ, స్పోర్ట్స్: సూర్యకుమార్ యాదవ్.. ఐపీఎల్ 13వ సీజన్ నుంచి ఈ పేరు మీడియాలో ప్రముఖంగా వినిపించింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్‌లో ముంబయి తరఫున నిలకడగా ఆడుతూ.. సూర్యకుమార్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో మొత్తం 480 పరుగులతో రాణించిన సూర్యకుమార్ యాదవ్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారని ప్రతీ ఒక్కరూ భావించారు. సూర్యకుమార్ కూడా ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అవుతాననే ధీమాతో ఉన్నాడు. కానీ అదృష్టం అతడి తలుపు తట్టలేదు. దీంతో అతడు చాలా నిరాశ చెందాడు. సూర్యకుమార్‌ను ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ సెలెక్టర్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగిన ఒక మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ, సూర్యకుమార్ మధ్య చోటు చేసుకున్న ఒక వివాదం వల్లే కోహ్లీ పగబట్టాడని క్రికెట్ అభిమానులు ఆరోపణలు కూడా గుప్పించారు. అయితే సూర్యకుమార్‌కు సరైన సమయంలో జాతీయ జట్టులో అవకాశం వస్తుందని అప్పుడే కోచ్ రవిశాస్త్రి చెప్పారు.
తనను తానే కష్టపెట్టుకున్న సూర్య..
2019లో ఇండియాలో ఐపీఎల్ జరిగిన సమయంలో సూర్యకుమార్ యాదవ్‌కు గత ఏడాది యూఏఈలో జరిగిన సూర్యకుమార్ యాదవ్‌కు చాలా మార్పును గమనించవచ్చు. బరువు ఎక్కువగా ఉండటంతో సూర్య మైదానంలో కాస్త అసౌకర్యంగా కనిపించేవాడు. దీంతో ఎలాగైనా బరువుతగ్గాలని నిర్ణయించుకున్నాడు. దీనికి తోడు అతడికి లాక్‌డౌన్ కూడా కలసి వచ్చింది. తనకు ఇష్టమైన మిఠాయిలను పూర్తిగా వదిలేశాడు. రైస్, గోధుమ పిండిని కూడా 90 శాతం వరకు తగ్గించాడు. కఠినమైన డైట్‌ను ఫాలో అవడం మొదలు పెట్టాడు. హై క్రాబ్ ఫుడ్‌తో పాటు జోవర్, బజ్రా, రాగి రొట్టెలు తినడం, దానికి తోడు పనీర్ లేదా పప్పు, కూరగాయలను కూడా వాడటం మొదలు పెట్టాడు. దీంతో పాటు ప్రతీరోజు రెండు దఫాలు వ్యాయామం చేశాడు.
అంతకు ముందు వారానికి కేవలం 5 సార్లు మాత్రమే వ్యాయామం చేసే అలవాటున్న సూర్య.. లాక్‌డౌన్ సమయంలో రోజుకు రెండు సార్లు చొప్పున వారానికి 14 సెషన్ల వ్యాయామం చేశాడు. రాత్రి 7.30 గంటలకే భోజనం ముగించి రాత్రి 11 లోపు పడుకునేవాడు. అయితే మొదట్లో అతడికి బాగా ఆకలి వేసేదంటా.. కానీ రానురానూ అతడు దానికి అలవాటు పడిపోయాడు. ఇంతటి కఠినమైన డైట్ ఫాలో కావడంతో 4 వారాల తర్వాత నుంచి ఫలితాలు రావడం గమనించాడు. గత ఏడాది సెప్టెంబర్‌లో యూఏఈ వెళ్లేనాటికి అతడు పూర్తి ఫిట్‌గా మారిపోయాడు. అతడి ఆత్మవిశ్వాసం కూడా పెరగడంతో లీగ్‌లో బాగా రాణించగలిగినట్లు స్వయంగా సూర్య చెప్పాడు.
ఆ రోజు ఏడ్చేశాడంటా..
తన శరీరాన్ని ఎంతో కష్టపెట్టుకొని ఫిట్‌నెస్ సాధించడమే కాకుండా.. 13వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున మంచి ప్రదర్శన కనబర్చాడు. కానీ అతడిని ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రం ఎంపిక చేయలేదు. అయినా సరే ఒపికతో ఉన్న సూర్యకుమార్‌కు ఎట్టకేలకు పిలుపు అందించింది. ఇంగ్లాండ్‌తో జరుగనున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్నది. ఒక జూమ్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు సూర్య పక్కన తల్లిదండ్రులు, సోదరి, భార్య ఉన్నారు. అతడు టీ20 సిరీస్‌కి ఎంపికయ్యాడని తెలియగానే ఒక్కసారిగా ఏడ్చేశాడంటా. ఫోన్ కాల్ మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నట్లు సూర్య చెప్పాడు. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పటికీ తన కళ్లముందు కదలాడుతున్నట్లు సూర్య చెప్పాడు. ఆ రోజు తాను టీ20 జట్టుకు ఎంపికైన విషయాన్ని చాలా సేపు నమ్మలేకపోయానని సూర్య అన్నాడు. టీమ్ ఇండియా తరఫున ఆడాలన్నది తన జీవిత లక్ష్యమని.. ఎట్టకేలకు ఆడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని సూర్య చెప్పాడు. అయితే, అరంగేట్రంలో సూర్య కుమార్ యాదవ్ పర్ఫామెన్స్ ఏ విధంగా ఉండబోతుందో అని క్రికెట్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.