ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ పైనే ఆశలు.. ధర ఎంత ఉండొచ్చు..?

లండన్: కరోనా వైరస్‌ను సమూలంగా రూపుమాపడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక బృందాలు కలిసి వందకు పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నాయి. వీటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న పరిశోధనలే ఎక్కువగా సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో యావత్ ప్రపంచం ఆ వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించారు. తీరా ఇది మార్కెట్లో అందుబాటులో వచ్చిన తర్వాత ఎంత ధర ఉంటుంది..? సామాన్యుడు ఆ ధరను భరించగలడా అనే అనుమానాలు […]

Update: 2020-05-16 11:44 GMT

లండన్: కరోనా వైరస్‌ను సమూలంగా రూపుమాపడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక బృందాలు కలిసి వందకు పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్నాయి. వీటిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చేస్తున్న పరిశోధనలే ఎక్కువగా సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో యావత్ ప్రపంచం ఆ వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ పరిశోధనలకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించారు. తీరా ఇది మార్కెట్లో అందుబాటులో వచ్చిన తర్వాత ఎంత ధర ఉంటుంది..? సామాన్యుడు ఆ ధరను భరించగలడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా, ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్తల్లో ఒకరైన ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ వ్యాక్సిన్ ధరపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతోనే పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు. కోతులపై సింగిల్ డోస్ ఇచ్చిన తర్వాత కేవలం 14 రోజుల్లోనే అవి వైరస్‌తో పోరాడే యాంటీబాడీస్‌ను రూపొందిచాయనీ, 28 రోజుల తర్వాత వైరస్‌ను పూర్తిగా నాశనం చేయగలిగాయని చెప్పారు. మనుషులపై కూడా ప్రయోగం విజయవంతమయితే.. భారీ ఎత్తున ఉత్పత్తి చేయాలనీ, అంతేకాకుండా డిమాండ్ మేరకు సరఫరా చేయగలిగితే ధర అందుబాటులో ఉంటుందని తెలిపారు. సామాన్యులు భయపడాల్సిన అవసరం లేదనీ, తక్కువ ధరకే కరోనా వైరస్ వ్యాక్సిన్ లభించబోతోందని చెప్పారు. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన 10 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఆగస్టు చివరి నాటికి మనుషులపై జరిపిన ప్రయోగాల ఫలితాలు వస్తాయనీ, ఆ తర్వాత ఫార్మా కంపెనీల ద్వారా ఉత్పత్తి చేయొచ్చని స్పష్టం చేశారు.

అయితే, ChAdOx1 ఎన్‌కోవ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రపంచవ్యాప్తంగా ఏడు తయారీ కేంద్రాలకు ఉందని చెప్పారు. వీటిలో ఇండియాలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఒకటని తెలిపారు. సీరం సంస్థ ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి పరిశోధనల్లో కీలకంగా పాల్గొంటోంది. వ్యాక్సిన్ ఫలితాలు వచ్చిన వెంటనే భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి సిద్ధపడుతోంది. పూణేలోని సీరమ్‌తో పాటు అహ్మదాబాద్‌లోని కాడిలా హెల్త్ కేర్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ వంటి సంస్థలు కూడా వ్యాక్సిన్ రూపొందిస్తున్నాయి. వీటికి ఆక్స్‌ఫర్డ్ ఫార్ములా ఆధారంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా ఉంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే ఇండియాలో వ్యాక్సిన్ ఉత్పత్తి అయితే తక్కువ ఖర్చు అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక్కడ నాణ్యమైన పరిజ్ఞానంతో పాటు తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉండటమే కారణం. ఇండియాలోని మరికొన్ని ఫార్మా కంపెనీలకు కూడా అనుమతులు లభిస్తే కరోనా వ్యాక్సిన్ సామాన్యులకు అందుబాటు ధరలోనే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News