అమ్మాయి పెళ్లి @21

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో ఎవరికైనా 18 ఏళ్లు వచ్చాయంటే.. ఓటు హక్కు వస్తుంది. కానీ అమ్మాయిలకు మాత్రం దాంతో పాటు పెళ్లి చేసే వయసు కూడా వచ్చినట్లే. ఆడపిల్లలు టీనేజ్ దాటుతున్నారంటే వారి తండ్రులు కంగారు పడిపోతారు. ఆలోపే పెళ్లి చేసి.. తమ బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు. అయితే, ఈ తరహా ఆలోచనా విధానంలో ఇప్పుడిప్పుడే మార్పు కనబడుతోంది. కొన్నేళ్లుగా ఆడపిల్లల పెళ్లి వయసులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కొన్ని కారణాలుండగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అమ్మాయిల […]

Update: 2020-08-18 03:29 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియాలో ఎవరికైనా 18 ఏళ్లు వచ్చాయంటే.. ఓటు హక్కు వస్తుంది. కానీ అమ్మాయిలకు మాత్రం దాంతో పాటు పెళ్లి చేసే వయసు కూడా వచ్చినట్లే. ఆడపిల్లలు టీనేజ్ దాటుతున్నారంటే వారి తండ్రులు కంగారు పడిపోతారు. ఆలోపే పెళ్లి చేసి.. తమ బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు. అయితే, ఈ తరహా ఆలోచనా విధానంలో ఇప్పుడిప్పుడే మార్పు కనబడుతోంది. కొన్నేళ్లుగా ఆడపిల్లల పెళ్లి వయసులో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కొన్ని కారణాలుండగా.. ఇప్పుడు ప్రభుత్వం కూడా అమ్మాయిల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది.

మన దేశంలో అబ్బాయికి పెళ్లి చేయాలంటే.. 21 సంవత్సరాలు ఉంటే చాలు. అదే అమ్మాయికైతే 18. కానీ నగరాలు, పట్టణాల్లో జరిగే పెళ్లిళ్లను చూస్తుంటే.. ఆ వయసులో జరిగేవి చాలా చాలా తక్కువే. ఎందుకంటే.. అబ్బాయిలు కెరీర్‌లో స్థిరపడేవరకు తమ పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. తమ చదువు పూర్తిచేసి, జాబ్ తెచ్చుకునేందుకు కనీసం 24 ఏళ్లు తీసుకుంటున్నారు. ఇక లైఫ్ సెటిల్మెంట్ పేరుతో.. మరో మూడేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు. దీంతో 26-28 ఏళ్ల వరకు బ్రహ్మచారులుగానే ఉండిపోతున్నారు. ఇప్పుడు అమ్మాయిల విషయంలోనూ ఇదే జరుగుతోంది. చదువు, కెరీర్ గురించి అమ్మాయిల ఆలోచనలు కూడా ఇంచుమించు ఇలానే ఉంటున్నాయి. వారు కూడా 18 ఏళ్లు దాటగానే లేదా 20-22 ఏళ్లు మించి పోగానే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఉద్యోగం సంపాదించి, లైఫ్‌లో తమ కాళ్ల మీద తాము నిలబడాలని కోరుకుంటున్నారు. అందుకే నగరాలు, పెద్ద పట్టణాల్లో ప్రభుత్వం తెచ్చిన నిబంధన ప్రభావం పెద్దగా ఉండబోదు.

అయితే పల్లెలు, చిన్న చిన్న పట్టణాల్లో ఈ ప్రభావం కొంతమేర కనిపించవచ్చు. ఒకప్పటితో పోల్చుకుంటే పల్లె ప్రజల జీవన విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి. పల్లెల్లోనూ విద్యావకాశాలు పెరిగాయి. దీంతో అమ్మాయిలకు పెళ్లి చేసే వయసులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కానీ కొందరు మాత్రం ఇందుకు మినహాయింపు. సాధారణంగా ఇక్కడ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల చదువుకు, వారితో ఉద్యోగాలు చేయించడానికి తక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందుకే, వారికి త్వరగా పెళ్లిళ్లు చేసేస్తుంటారు. ఇదేగాక ఈ ప్రాంతాల్లో బాల్య వివాహాల వల్ల బాలికల చదువు ఆగిపోవడం, గృహ హింసకు గురవడం, ప్రసవ సమయంలో చనిపోయే ముప్పు పెరగడం జరుగుతుంది. వివాహ కనీస వయసును పెంచడం వల్ల ఇలాంటి అమ్మాయిల జీవితాలు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, కఠిన చట్టాలు అమలు చేస్తేనే.. 21 ఏండ్లకు పెళ్లి అనే నిబంధన ఇలాంటి ప్రాంతాల్లో అమలవుతుంది. లేదంటే.. మళ్లీ పాత పద్ధతే ఉంటుంది.

మనదేశంలో ఏటా 1.5 మిలియన్ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొస్తే ఇంకా ఈ తరహా కేసులు పెరిగే అవకాశం ఉంది. కాగా, ఇలాంటి అంశాలను పక్కనబెట్టి, అసలు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటని ఆలోచిస్తే మాత్రం చాలానే ఉన్నాయి. ఒక అమ్మాయికి 18 ఏళ్లు రాగానే పెళ్లి చేస్తే.. అది ఆ అమ్మాయి ఆరోగ్యంతో పాటు తనకు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యానికి అంతమంచిది కాదు. 18 ఏళ్ల ఆడపిల్లల శరీరం చైల్డ్ బర్త్‌కు సిద్ధంగా ఉండదు. 18 ఏళ్లు నిండిన తర్వాతే బర్త్ కెనాల్ ఫార్మేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ వయసులో.. మెంటల్‌గానూ వారి శరీరం పిల్లల్ని కనాలని కోరుకోదు. అందుకే ఆ వయసులో పెళ్లిల్లు చేసుకున్న అమ్మాయిల్లో.. గర్భవిచ్చిత్తి ఎక్కువగా జరుగుతుంటుంది. అంతేకాదు, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, అనారోగ్య సమస్యలతో జన్మించడం లాంటివి జరుగుతుంటాయి. అడల్ట్ మదర్స్‌తో పోల్చుకుంటే.. టీనేజ్ మదర్స్ చాలా వీక్‌గా ఉంటారు. పిల్లలకు సరిపడే పాలు కూడా వారిలో ఉండవు. దాంతో డబ్బా పాలు పట్టాల్సి వస్తుంది. దీనివల్ల తల్లి పాల నుంచి బిడ్డకు అందాల్సిన పోషక విలువలు సరిగా అందక, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇది ఆ పిల్లలు ఎదిగిన తర్వాత పలు అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే వైద్య నిపుణుల సలహా మేరకు 21 వయసు అనేది సరైన నిర్ణయమని చెప్పొచ్చు.

ఆడపిల్లల కనీస పెళ్లి వయసును 21 ఏండ్లకు పెంచడం వల్ల.. వుమెన్ ఎంపవర్‌మెంట్‌కు కూడా దోహదపడుతుంది. ఆడపిల్లలు మరింత చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యపరంగానూ, ఆలోచనా విధానాల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. విద్య, ఆరోగ్యం, ఉపాధి ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. అమ్మాయిల వివాహ వయసు పెంచే నిర్ణయం హర్షించదగ్గదే.

Tags:    

Similar News