తెలిస్తే తప్పేంటి.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం జీవోల రూపంలోకి వచ్చిన తర్వాత అది ప్రజలకు తెలియాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. జీవోల్లోని సమాచారం ప్రజలకు తెలిస్తే తప్పేంటని ప్రశ్నించింది. పబ్లిక్‌ దృష్టికి వెళ్ళేలా వెబ్‌సైట్‌లో పెడితే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేంటని అడ్వొకేట్ జనరల్‌ (ఏజీ)ను నిలదీసింది. ప్రభుత్వం జీవో జారీ చేసిన 24 గంటల వ్యవధిలో అది ప్రజల్లోకి వెళ్ళాలని, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఏజీని ఆదేశించింది. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేంటో వివరించాలని […]

Update: 2021-08-18 09:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం జీవోల రూపంలోకి వచ్చిన తర్వాత అది ప్రజలకు తెలియాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. జీవోల్లోని సమాచారం ప్రజలకు తెలిస్తే తప్పేంటని ప్రశ్నించింది. పబ్లిక్‌ దృష్టికి వెళ్ళేలా వెబ్‌సైట్‌లో పెడితే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేంటని అడ్వొకేట్ జనరల్‌ (ఏజీ)ను నిలదీసింది. ప్రభుత్వం జీవో జారీ చేసిన 24 గంటల వ్యవధిలో అది ప్రజల్లోకి వెళ్ళాలని, వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఏజీని ఆదేశించింది. ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేంటో వివరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ విజయసేన్‌రెడ్డిలతో కూడిన బెంచ్ ప్రశ్నించడంతో ఏజీ వివరణ ఇచ్చారు. ఆ వివరణను హైకోర్టు నమోదు చేసింది. ఇకపైన జీవోల విషయంలో ఈ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో 76 దళిత కుటుంబాలకు తలా రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 7.60 కోట్లను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. ‘దళితబంధు‘కు ఇంకా నిబంధనలే రూపొందించకుండా నిధులను ఎలా జారీ చేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ‘వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్‘ అనే సంస్థ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలుచేసింది. దీనిపై హైకోర్టు బెంచ్ బుధవారం విచారణ జరిపింది. పిటిషన్‌తో పాటు ’దళితబంధు’కు ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను ఎందుకు జతచేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శశికిరణ్‌ను బెంచ్ ప్రశ్నించింది. దీనికి న్యాయవాది వివరణ ఇస్తూ, ’దళితబంధు ’ నిబంధనలకు ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, వెబ్‌సైట్‌లో లేదని బదులిచ్చారు.

ప్రభుత్వం తరపున హాజరైన అడ్వొకేట్ జనరల్‌ బీఎస్ ప్రసాద్‌ను ఇదే విషయమై బెంచ్ ప్రశ్నించింది. నిబంధనలు జారీ చేయకుండా నిధులు ఎలా విడుదలయ్యాయని ప్రశ్నించింది. ఏజీ స్పందిస్తూ, ’దళితబంధు’కు నిబంధనలను ఖరారు చేశామని, రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని వివరించారు. ఈ నిబంధనల జీవో వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదని పిటిషనర్ చెప్తున్నారని నొక్కిచెప్పింది. నిజంగా ’దళితబంధు’కు ప్రభుత్వం నిబంధనలను ఖరారు చేసినట్లయితే ఆ జీవోను పబ్లిక్ డొమెయిన్‌ (వెబ్‌సైట్)లో పెట్టడానికి ఉన్న ఇబ్బందేంటని నిలదీసింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రజలకు తెలియకుండా గోప్యత ఎందుకు పాటిస్తున్నారని ప్రశ్నించింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం జీవో జారీ చేసిన తర్వాత 24 గంటల్లో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది.

Tags:    

Similar News