బ్లూ ప్రింట్ సమర్పించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్లూ ప్రింట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు తీసుకుంటున్న చర్యలపై ఇప్పటికే కేబినెట్‌కు నివేదిక సమర్పించడం, బెడ్‌ల సంఖ్యను పెంచడం మొదలు ఆక్సిజన్ ప్లాంట్లను స్వంతంగా రూపొందించుకోవడం వరకు అనేక కోణాల నుంచి ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే అంచనాతో […]
దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బ్లూ ప్రింట్ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర రాజధాని వరకు తీసుకుంటున్న చర్యలపై ఇప్పటికే కేబినెట్‌కు నివేదిక సమర్పించడం, బెడ్‌ల సంఖ్యను పెంచడం మొదలు ఆక్సిజన్ ప్లాంట్లను స్వంతంగా రూపొందించుకోవడం వరకు అనేక కోణాల నుంచి ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని అడ్వొకేట్ జనరల్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందనే అంచనాతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ సన్నాహక చర్యలను నివేదిక రూపంలో కోర్టుకు సమర్పించాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బెంచ్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
కరోనా కట్టడి, టెస్టులు, వ్యాక్సిన్ పంపిణీ, థర్డ్ వేవ్ ఏర్పాట్లపై హైకోర్టులో బుధవారం జరిగిన విచారణకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సైతం స్వయంగా హాజరయ్యారు. రాష్ట్రంలో కొత్తగా 16 ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు చేసే లాబ్‌లను ప్రభుత్వం నెలకొల్పనున్నట్లు గత విచారణ సందర్భంగా స్పష్టం చేశామని, అందులో ఇప్పటికే ఎనిమిది లాబ్‌లు పనిచేస్తున్నాయని, మిగిలినవాటికి ఢిల్లీలోని ఐసీఎంఆర్ నుంచి అనుమతి రాగానే పని చేయడం ప్రారంభిస్తాయని కోర్టుకు డైరెక్టర్ వివరించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్…కు సంబంధించి కమిటీ ఏర్పాటుపై ప్రధాన కార్యదర్శికి ఫైల్ పంపామని, త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లోనే కమిటీపై జీవో జారీ అవుతుందని తెలిపారు.
అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులపై తమకు 223 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 135 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని, 22 ఆస్పత్రులకు కరోనా ట్రీట్‌మెంట్ అనుమతుల్ని రద్దు చేశామని, ఫిర్యాదు చేసినవారికి సుమారు రూ. 65 లక్షల మేర రీఫండ్ చేయించినట్లు కోర్టుకు వివరించారు. పరిహారం చెల్లించడంతో వాటికి కరోనా ట్రీట్‌మెంట్ అనుమతులను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలను ఇప్పుడు 19 జిల్లాలకు విస్తరింపజేశామని, అన్ని జిల్లా కేంద్రాల్లో నెలకొల్పాలని మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకున్నదని డైరెక్టర్ వివరించారు.
పౌరసరఫరాల శాఖకు నోటీసులు
రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సమయంలో విధుల్లో పాల్గొన్న టీచర్లు కరోనా బారిన పడిన విషయాన్ని హైకోర్టు బెంచ్ ప్రస్తావిస్తూ, వారిని కొవిడ్ వారియర్లుగా గుర్తించి మృతుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా గత విచారణ సందర్భంగా ఆదేశించామని, ఇప్పటివరకు ఎంత మందికి పరిహారం అందజేశారని అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. విద్యాశాఖ నుంచి వివరాలు రాలేదని, అవి వచ్చిన వెంటనే అఫిడవిట్‌ను దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలిపారు. ప్రైవేటు టీచర్లకు రేషను దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ అంశాన్ని గుర్తుచేస్తూ, పౌర సరఫరాల శాఖ అఫిడవిట్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేయాల్సిందిగా ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం పూర్తి వివరాలతో ఈ నెల 22వ తేదీకల్లా అఫిడవిట్‌ను సమర్పించాలని బెంచ్ స్పష్టం చేసింది.
రెండు నెలల్లో 8.79 లక్షల కేసులు
కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ ఆంక్షలకు సంబంధించి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలపై డీజీపీ ఒక అఫిడవిట్‌ను కోర్టుకు సమర్పించారు. రెమిడెసివిర్, ఆంఫొటెరిసిన్ లాంటి మందులను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నవారిపై 160 కేసులు నమోదు చేసినట్లు అందులో పేర్కొన్నారు. ఎపిడమిక్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి లాక్‌డౌన్ ఆంక్షలు పాటించనందుకు 8.79 లక్షల కేసులను నమోదు చేశామని, సుమారు రూ. 38 కోట్లను ఫైన్ రూపంలో వసూలు చేసినట్లు డీజీపీ ఆ నివేదికలో పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించనివారిపై 48,364 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.