నల్లగొండలో హై అలర్ట్.. వర్ధమానుకోటలో మంత్రి పర్యటన
దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్ (కొవిడ్ -19) పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసుల సంఖ్య ఆరు నుంచి 23కు చేరుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మొత్తం ప్రైమరి కాంటాక్ట్ అనుమానితులైన 162 మంది పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో ఇంక ఎంత మందికి పాజిటివ్ వస్తుందో చూడాలి. అయితే, కొవిడ్ -19 కట్టడికి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా మంత్రి […]
దిశ, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్ (కొవిడ్ -19) పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేసుల సంఖ్య ఆరు నుంచి 23కు చేరుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మొత్తం ప్రైమరి కాంటాక్ట్ అనుమానితులైన 162 మంది పరీక్షలకు సంబంధించిన రిపోర్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరిలో ఇంక ఎంత మందికి పాజిటివ్ వస్తుందో చూడాలి. అయితే, కొవిడ్ -19 కట్టడికి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి స్వయంగా వర్ధమానుకోట గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. వైద్య సిబ్బందిని పెంచాలనీ, పరిస్థితి చేయి దాటకుండా చూడాలని అధికారులతో అన్నారు.
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత మండలమైన నాగారం పరిధిలోని వర్ధమానుకోటలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా (కొవిడ్ -19) పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు కొవిడ్ 19 పాజిటివ్ వ్యక్తుల నివాస ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాల్లో రాకపోకలు నిలపేశారు. అయితే, ఆ జోన్ ప్రాంతాల్లో కొందరు చాటుగా తిరుగుతున్నారనీ పలువురు ఆందోళన చెందుతున్నారు.
కరోనా కట్టడికి కృషి చేసే వైద్యులు, ఉద్యోగులు, ఇతర సిబ్బందికి, ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రి సిబ్బందికి ఎన్-95 మాస్కులు, పీపీఈ(పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) అందలేదని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలో ఇప్పటికే ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులు నివాసం ఉండే ప్రాంతాల్లో సర్వే చేసే వైద్య, ఆరోగ్య సిబ్బందికీ పీపీఈలు అందుబాటులో లేవనీ, కేవలం ఐసోలేషన్ కేంద్రాల్లో వారికే కిట్లు ఇస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఉద్యోగులకు మాస్కులు, పీపీఈ కిట్లు అందించాలని పలువురు కోరుతున్నారు.
ప్రజలు ఆందోళన చెందొద్దు:జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లాలోనే ఇప్పటి వరకు 8 మందికి కొవిడ్ -19 పాజిటివని తేలడంతో ఈ పరిణామాలను మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గరుండి అధికారులతో పరిస్థితులను సమీక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగరం మండలం వర్ధమానుకోట గ్రామాన్ని మంత్రి సందర్శించారు. ఢిల్లీలోని మార్కజ్‌కు వెళ్తొచ్చిన వారి నుంచి వర్ధమాన్ కోటలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయంటూ అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజలెవరూ భయాందోళనలకు గురి కావొద్దని ఆయన భరోసా ఇచ్చారు. వైద్య పరీక్షలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అక్కడి నుంచే వైద్యారోగ్య శాఖా అధికారులతో మాట్లాడుతూ, వైద్యసిబ్బందిని మరింత పెంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. అక్కడే ఉన్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులు చేయి దాటి పోకుండా చూడాల్సిన బాధ్యత మనమీదే ఉందంటూ అధికారులకు చెప్పిన మంత్రి జగదీష్ రెడ్డి ఈ మధ్యాహ్నం తర్వాత సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో జరిగే ప్రత్యేక సమీక్షా సమావేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించనున్నారు.
అధికారులు కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూసిన ప్రాంతాలు నల్లగొండ టౌన్‌లోని రహమత్‌బాగ్‌నగర్, మన్యంచెల్క, మీర్‌బాగ్‌కాలనీ, బర్కత్‌పుర, మిర్యాలగూడ మండలం సీతారంపురం, దామెరచర్ల, సూర్యపేట జిల్లా కేంద్రంలోని భగత్‌నగర్, కుడకుడ గ్రామం, నాగారం మండలం వర్ధమానుకోటలను రెడ్‌జోన్‌లుగా ప్రకటించారు. ఇక్కడ జనం ఇంటి నుంచి బయటకొస్తే కొవిడ్ 19 మహమ్మారి ఇతరులకు వచ్చే అవకాశముందని అత్యవసర వస్తువులు డోర్ డెలివరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, కొందరు రెడ్ జోన్లు దాటి మరి పోలీసుల కండ్లు గప్పి బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. నల్లగొండలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పని చేసే డ్రైవర్ పోలీసుల కండ్లు గప్పి ఆఫీసుకు వెళ్లడంతో అక్కడ విధులు నిర్వహిస్తోన్న మిగతా ఉద్యోగులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. దాంతో వెంటనే ఆయన్ను హోం క్వారంటైన్ చేయాలని పోలీసులకు ఆదేశాలొచ్చాయి. అత్యవసర వస్తువులు అరకొరగా అందడమే వీరు బయటకు రావడానికి కారణమని తెలుస్తోంది. సోమవారం మిర్యాలగూడకు చెందిన కొంత మంది అక్కడి ఎమ్మేల్యే భాస్కర్‌రావుకు ఈ విషయమై మెరపెట్టుకున్నారు.
అష్టదిగ్బంధనంలో వర్ధమానుకోట..
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కొవిడ్ 19 పాజిటివ్ అని తేలడంతో వర్ధమాను కోట గ్రామాన్నిఅధికారులు అష్టదిగ్బంధనం చేశారు. వారితో సంబంధ బంధావ్యాలు కలిగి ఉన్న33 మందిని, మాసిరెడ్డి పల్లికి చెందిన 7 గురిని క్యారంటైన్‌కు తరలించారు. సూర్యాపేటలోనీ కుడ కుడ రోడ్‌లో కొవిడ్ 19 పాజిటివ్ తేలిన మొదటి వ్యక్తి నుంచే వర్ధమాన్ కోటకు మహమ్మారి సోకినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తికి వర్ధమాన్ కోట నివాసి అల్లుడు కావడంతో పాటు ఢిల్లీకి పోయిన వారిలో అతను కూడా ఉన్నారు. భగత్‌నగర్, కుడకుడ గ్రామానికి చెందిన 73 మంది నుంచి పరీక్షల కోసం రక్త శాంపిల్స్ నమూనాలు సేకరించారు. 126 మందిని ప్రభుత్వ క్యారంటైన్, మరో 283 మందిని హోం క్యారంటైన్‌లో ఉంచారు. వర్ధమానుకోట పాజిటివ్ ప్రైమరీ కాంటాక్ట్ అనుమానితులుగా భావిస్తోన్న 40 మంది రక్త శాంపిల్స్ సేకరించాల్సి ఉన్నది. ప్రభుత్వ క్వారంటైన్‌లో వీరితో కలిపి అనుమానితుల సంఖ్య 166కు చేరుకుంది.
Tags: alert, covid 19 effect, lockdown, positive cases increasing