కరోనాపై యుద్ధానికి వెంటిలేటర్లు రెడీ చేస్తున్న మహీంద్రా గ్రూప్!
దిశ, వెబ్‌డెస్క్: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ అప్పట్లో సైనికుల కోసం వాహనాలను తయారుచేసింది. ప్రస్తుతం ఈ శతాబ్దంలో అత్యంత ప్రమాదకరమైన మహమ్మారిగా మారిన కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాడ్డానికి భారత ఆటోరంగంలో దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా కలిసి వెంటిలేటర్లను ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమయ్యాయి. దీనికి సంబంధించి మహీంద్రా గ్రూప్ సంస్థల ఎండీ పవన్ గోయెంకా గురువారం తమ ఫ్యాక్టరీలో వెంటిలేటర్లను ఉత్పత్తి చేయడంపై ట్వీట్ చేశారు. కరోనా వ్యాధిని వీలయినంత […]
దిశ, వెబ్‌డెస్క్: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ అప్పట్లో సైనికుల కోసం వాహనాలను తయారుచేసింది. ప్రస్తుతం ఈ శతాబ్దంలో అత్యంత ప్రమాదకరమైన మహమ్మారిగా మారిన కరోనా వైరస్(కోవిడ్-19)పై పోరాడ్డానికి భారత ఆటోరంగంలో దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా కలిసి వెంటిలేటర్లను ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమయ్యాయి. దీనికి సంబంధించి మహీంద్రా గ్రూప్ సంస్థల ఎండీ పవన్ గోయెంకా గురువారం తమ ఫ్యాక్టరీలో వెంటిలేటర్లను ఉత్పత్తి చేయడంపై ట్వీట్ చేశారు.
కరోనా వ్యాధిని వీలయినంత తక్కువ సమయంలో అధిగమించేందుకు మహీంద్రా గ్రూప్ అతితక్కువ ధరకే వెంటిలేటర్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించింది. కేవలం రూ. 7,500 కే అధునాతనమైన వెంటిలేటర్‌ను అందించనున్నట్టు, ఇది ఆటోమేటెడ్ వెర్షన్ మాస్క్ వెంటిలేటర్ డిజైన్‌తో తయారు చేశామని, రానున్న మూడు రోజుల్లో అనుమతులు వస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చాలా వేగంగా వ్యాప్తి చెందే కరోనా వైరస్‌ను నిలువరించేందుకు అవసరమైన వెంటిలేటర్ల కొరతను అధిగమించాల్సి ఉందని, దానికోసం దేశీయంగా ఉన్న వెంటిలేటర్ల తయారీ సంస్థలతో, మరో రెండు భారీ ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని ఎండీ పవన్ గోయెంకా ట్విటర్ ద్వారా స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ సంస్థకు చెందిన బృందం అనుక్షణం శ్రమిస్తోందని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే అవసరమైన వెంటిలేటర్ల తయారీకి పూర్తీగా సమయాన్ని వెచ్చిస్తామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ..మన దేశంలో ఈ వ్యాధి వ్యాప్తికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఈ మహమ్మారి దేశీయ వైద్య మౌలిక సదుపాయాలపై అధిక ఒత్తిడిని కలుగజేస్తుంది. పైగా, వ్యాధి సోకిన వారికి దేశంలో సరిపడా వెంటిలేటర్ల కొరత కూడా అతిపెద్ద సవాలుగా నిలుస్తుంది. బ్రూకింగ్స్ సంస్థ వివరాల ప్రకారం…ఇండియాలో కేసుల సంఖ్య పెరిగితే మే నెల నాటికి సుమారు 2 లక్షల వెంటిలేటర్లు అవసరమవుతాయి. ప్రస్తుతం దేశంలో గరిష్ఠంగా 57,000 వెంటిలేటర్లే ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. మొత్తం రోగుల్లో 10 శాతం మందికి వెంటిలేటర్లు అవసరమవుతాయి. ఎంత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ కనీసం మే నాటికి 20 లక్షల కరోనా కేసులు నమోదవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం 2 లక్షల వరకు వెంటిలేటర్లు అవసరమవుతాయి.
ప్రభుత్వ రంగంలో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న వెంటిలేటర్ల సంఖ్యకు సంబంధించి అధికారిక గణాంకాలు లేవు. కానీ, ప్రభుత్వ రంగంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రి పడకల సంఖ్యను బట్టి అంచనాలను కలిగి ఉన్నాం. మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులలో పడకల సంఖ్య 7,13,986. ఇందులో ఐసీయూ పడకలు 5 నుంచి 8 శాతం ఉన్నాయి. అంటే, ఐసీయూ పడకల సంఖ్య 57,119 వరకూ ఉంటాయని..దీనికి అనుగుణంగానే వెంటిలేటర్ల తయారీ చేపట్టామని సంస్థలు చెబుతున్నాయి.
దేశీయంగా ఉన్న వెంటిలేటర్ల తయారీ కంపెనీలతో కలిసి దీనికోసం కష్టపడుతున్నాం. సాధారణంగా ఆధునిక మెషీన్ల కోసం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ అవుతుంది. తమ సంస్థకు చెందిన బృందం అధునాతన వెంటిలేటర్లను అతితక్కువ ధరకే అంటే, రూ. 7,500 కే అందించేందుకు ప్రయత్నాలు చేస్తోందని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్ ద్వారా వివరించారు. ఈ ఆధునికమైన వెంటిలేటర్‌ను తయారు చేస్తున్న టీమ్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఆనంద్ మహీంద్రా ఒక వీడియోను విడుదల చేశారు. కరోనా వ్యాప్తిని ఎదుర్కోనేందుకు దేశీయంగా అనేక కంపెనీలు తమ సాయాన్ని అందిస్తున్నాయి. మహీంద్రా గ్రూప్ సంస్థ గనక అనుకున్న సమయానికి వెంటిలేటర్లను అందించగలిగితే కరోనాను చికిత్స దశలోనే తరిమేసే గొప్ప బలాన్ని మన దేశం అందుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
tags : Coronavirus, Mahindra, Ventilator, Mahindra Ventilator Production Plan, Maruti Ventilator Production Plan, Mahindra And Mahindra, Maruti Suzuki, Covid 19 Infected Cases In India, Severe COVID-19, Coronavirus Updates