ఈ ఆటగాళ్లు అదరగొట్టారు.. కానీ, అవకాశమేది?

దిశ, స్పోర్ట్స్: జస్ప్రిత్ బుమ్రా.. ఎటువంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా తన ప్రతిభ కనబర్చి ఏకంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. పాండ్యా బ్రదర్స్‌ కూడా ఐపీఎల్ ద్వారానే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. కానీ కొంత మంది క్రికెటర్లు నిలకడగా పరుగులు రాబడుతున్నా.. వికెట్లు తీస్తున్నా సెలెక్టర్లు మాత్రం వారిపై దయ చూపించడం లేదు. ఎన్నో సీజన్లు ఎదురు చూస్తున్నా జాతీయ జట్టు కోసం పిలుపు అందడం […]

Update: 2020-11-04 07:45 GMT

దిశ, స్పోర్ట్స్: జస్ప్రిత్ బుమ్రా.. ఎటువంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా తన ప్రతిభ కనబర్చి ఏకంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. పాండ్యా బ్రదర్స్‌ కూడా ఐపీఎల్ ద్వారానే టీమ్ ఇండియాలో చోటు దక్కించుకున్నారు. కానీ కొంత మంది క్రికెటర్లు నిలకడగా పరుగులు రాబడుతున్నా.. వికెట్లు తీస్తున్నా సెలెక్టర్లు మాత్రం వారిపై దయ చూపించడం లేదు. ఎన్నో సీజన్లు ఎదురు చూస్తున్నా జాతీయ జట్టు కోసం పిలుపు అందడం లేదు. ఇక కొంత మందిని టెస్టు ఫార్మాట్ కోసమే అన్నట్లు ఉంచారు. కానీ వాళ్లు టీ20ల్లో కూడా రాణిస్తున్నారు. అసలు సెలెక్టర్లు ఏ ప్రాతిపదికన క్రికెటర్లను ఎంపిక చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

బుమ్రానే మించిపోయాడు.. కానీ

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడుతున్న సందీప్ శర్మకు లీగ్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నది. సన్‌రైజర్స్ కూడా ముందు అతడిని పక్కకు పెట్టింది. కానీ భువనేశ్వర్ కుమార్ గాయంతో లీగ్‌కు దూరమవడంతో అతడికి ఛాన్స్ ఇచ్చారు. సన్‌రైజర్స్ జట్టుకు మొదట్లోనే వికెట్లు తీస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జస్ప్రిత్ బుమ్రా 105 వికెట్లు తీయగా.. సందీప్ ఖాతాలో 108 ఉండటం గమనార్హం. 2013లోనే బుమ్రా, సందీప్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశారు. ఇద్దరూ 90 మ్యాచ్‌లు ఆడారు. బుమ్రా కంటే సందీప్‌కే మెరుగైన స్ట్రైక్ రేట్ ఉన్నది. అయితే సందీప్ కేవలం ఐపీఎల్‌కు పరిమితం అవగా.. బుమ్రా జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. సెలెక్టర్లు అరకొర ఛాన్స్‌లు ఇచ్చినా నిరూపించుకోలేక పోయాడు. అతడిని పూర్తి స్థాయిలో ఆడిస్తే తప్పక వికెట్లు తీస్తాడని విశ్లేషకులు చెబుతున్నారు.

వీరిది మరో కథ..

వృద్దిమాన్ సాహ టీమ్ ఇండియా టెస్టు కీపర్. అతడికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్థానం దక్కడం లేదు. అతడు టీ20, వన్డేల్లో రాణించలేడని సెలెక్టర్లు అంటున్నారు. కానీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఓపెనర్‌గా విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. జట్టుకు కీలక సమయంలో తన బ్యాటింగ్ ద్వారా విజయాలు అందించాడు. ఐపీఎల్‌లో అతడు ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు. కానీ జాతీయ స్థాయిలో మాత్రం అతడిని కేవలం టెస్టులకే పరిమితం చేశారు.

ఇన్నాళ్లు ధోని ఉన్నాడని సాహాకు అవకాశాలు రాలేదు. ఇప్పుడు పంత్ విఫలమైతే కేఎల్ రాహుల్‌కు ఛాన్స్ ఇచ్చారు తప్ప సాహాను కనీసం పరిశీలించలేదు. మరోవైపు ఐపీఎల్‌లో విశేషంగా ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేక పోయాడు. అతడు ఆసీస్‌లోని బౌన్సీ పిచ్‌లలో చక్కగా ఆడగలడని విశ్లేషకులు చెబుతున్నారు. అతడిని ఎంపిక చేయకపోవడంపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే భవిష్యత్ పర్యటనల్లో అతడికి అవకాశం ఇస్తామని గంగూలీ చెప్పాడు. యువ క్రికెటర్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వకపోతే వారు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీరందరికీ గుర్తింపు ఎప్పుడు దక్కుతుందో చూడాలి.

Tags:    

Similar News