తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో పశ్చిమ-మధ్య భాగంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండ్రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, దాని ఫలితంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు స్థానిక సిబ్బంది ద్వారా పరిస్థితిని తెలుసుకుంటూ తగిన చర్యలను చేపట్టాలని ప్రధాన కార్యదర్శిని […]

Update: 2020-10-11 21:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో పశ్చిమ-మధ్య భాగంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండ్రోజులపాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ అల్పపీడనం పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని, దాని ఫలితంగా అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. అధికారులు ఎప్పటికప్పుడు స్థానిక సిబ్బంది ద్వారా పరిస్థితిని తెలుసుకుంటూ తగిన చర్యలను చేపట్టాలని ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు తాజా పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ప్రాణనష్టం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వర్షాలతోపాటు వరదలు కూడా సంభవించే అవకాశం ఉన్నందున నీటితో నిండిపోయే కల్వర్టులు, కాజ్‌వేల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను, వాహనాల డ్రైవర్లను సీఎం, సీఎస్ హెచ్చరించారు.

పొంగిపొర్లుతున్న వరద..

రెండ్రోజులుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కొన్ని కల్వర్టులు, కాజ్‌వేలపై వరదనీరు పొంగిపొర్లుతోంది. గ్రామాల్లో కళ్లాల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది. చేతికొచ్చిన వరిచేలు నీట మునిగిపోయాయి. ఎండబెట్టిన మొక్కలు జొన్నలు తడిచిపోయాయి. వర్షాల కారణంగా పాత ఇళ్లు కూలిపోయి హైదరాబాద్‌లో ఇద్దరు చనిపోయారు. అనేక మారుమూల ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని ఇరుకైన, దిగువ ప్రాంతంలో ఉండే కల్వర్టులపై నుంచి నీరు పారుతుండగా ప్రయాణించిన ఒక ట్రాక్టర్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ గ్రామంలో గరిష్ఠంగా 14 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా నార్లపూర్‌లో 9.2 సెం.మీ., నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో 8.2 సెంమీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

సీఎస్‌తో పరిస్థితిని సమీక్షించిన సీఎం..

వాతావరణ కేంద్రం సూచనల మేరకు రానున్న రెండ్రోజులపాటు కురిసే భారీ వర్షాలపై ప్రధాన కార్యదర్శితో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు కురిసిన వర్షాల కారణంగా గ్రామాల్లోని పరిస్థితి, పంటలకు ఏర్పడిన నష్టం, పట్టణాల్లోని రోడ్ల పరిస్థితి, ఇకపైన కురిసే వర్షాలతో ఏర్పడే ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై సీఎం చర్చించారు. అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. భారీ వర్షాలు, వాటితోపాటే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ కోరారు.

అన్ని జిల్లాలను అప్రమత్తం చేసిన సీఎస్..

రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అప్రమత్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించడంతో అక్కడి లొతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసంతోపాటు ఆహార అవసరాలను కూడా సమకూర్చాలని స్పష్టం చేశారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడే అవకాశం ఉందని, ఇలాంటప్పుడు ప్రాణ నష్టం జరగకుండా నివారించడానికి ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలించాలని నొక్కిచెప్పారు. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఓవర్ ఫ్లో అయ్యే అవకాశం ఉంటే లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం అవుతాయని, అలాంటి పరిస్థితిని గమనిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు ఇస్తూ అప్రమత్తం చేయాలన్నారు.

Tags:    

Similar News