ప్రతీ ఇంట్లో ఒకరికి అనారోగ్యం.. గ్రామాల్లో భయంకరంగా పరిస్థితి!

రాష్ట్రంలో వైరస్‌లు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ‘25 ’లక్షల మంది వైరల్​ఫీవర్లతో బాధపడుతున్నట్లు ఆరోగ్యశాఖ అంచనా వేసింది. గ్రేటర్

Update: 2022-10-08 23:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వైరస్‌లు దడ పుట్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు '25 'లక్షల మంది వైరల్​ఫీవర్లతో బాధపడుతున్నట్లు ఆరోగ్యశాఖ అంచనా వేసింది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్​నగర్, నల్లగొండ జిల్లాల్లో విష జ్వరాల ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఈ మేరకు మందులు, టెస్టింగ్​కిట్లు, ఇతర మెడికేషన్​సౌకర్యాలన్నింటినీ ఆయా పరిధిలోని సర్కార్ ఆసుపత్రులకు సమకూర్చుతున్నారు. అర్బన్‌తో పాటు రూరల్‌లోనూ ఫీవర్లు ఎటాక్​చేస్తున్నాయి. గ్రామాల్లో ఇంటికొకరికి సుస్తీ అయినది. దీంతో ప్రతీ ఏటా గ్రాండ్‌గా నిర్వహించుకునే దసరా పండుగను ఈ సారి దయనీయంగా జరుపుకోవాల్సి వచ్చింది. రోగాలతోనే కుటుంబాలన్నీ సతమతం అవుతున్నాయి. ఇప్పటికీ లక్షల మంది దావఖానల చుట్టూ తిరుగుతున్నారు. 33 జిల్లాల వారీగా వైరస్​ప్రభావం కొనసాగుతున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పెరిగిన బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిన్నట్లు క్షేత్రస్థాయిలో డాక్టర్లు చెబుతున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా విషజ్వరాలు విజృంభించడం గమనార్హం. ప్రతీ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రోగాల అనుమానితులు క్యూ కడుతున్నారు. ప్రతీ పేషెంట్‌కు జ్వరం, ఒళ్లు నొప్పులు తప్పనిసరిగా ఉంటున్నాయి. రెండు వారాల పాటు సర్కారీ మందులు వాడినా.. వ్యాధులు తగ్గని పరిస్థితి ఉన్నది. దీంతో ప్రతీ ఒక్కరికీ డెంగీ, మలేరియా వంటి టెస్టులను కూడా కంపల్సరీగా చేస్తున్నారు. గత పదిహేను రోజుల నుంచి చేస్తున్న పరీక్షల్లో సుమారు 92 శాతం మందికి డెంగీ, మలేరియా నిర్ధారణ కావడం లేదు. కేవలం వైరల్​ ఫీవర్లే వణికిస్తున్నాయి. వీరిలో కొందరికీ ప్లేట్​లెట్స్​కూడా పడిపోతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. విష జ్వరాల వేధింపులకు జనాలతో పాటు డాక్టర్లు పరేషాన్​అవుతున్నారు. కొందరికీ హెవీ డోసులతో కూడి యాంటీబయాటిక్స్​ ఇచ్చినా, వైరల్​లోడ్ కంట్రోల్ కావడం లేదని వైద్యులు వివరిస్తున్నారు. అంటే వైరస్​తీవ్రత స్పష్టంగా అర్థం అవుతున్నది.

లెక్కలు లేవా..?

సీజనల్ వ్యాధుల సమయంలో సహజంగానే విష జ్వరాల తీవ్రత అధికంగా ఉంటుంది. కానీ గడిచిన రెండేళ్లతో పోల్చితే ఈసారి ఊహించని స్థాయిలో విష జ్వరాల బాధితులు తేలుతున్నారు. డెంగీ, మలేరియా వంటివి కాకుండానే వైరల్​ఫీవర్లు సంఖ్య భారీగా కనిపిస్తున్నది. అయితే వైద్యాధికారులు కేవలం డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, వంటి జ్వరాల లెక్కలను మాత్రమే రికార్డులలోకి ఎక్కిస్తున్నారు. అవి కూడా సగం మంది పేషెంట్ల వివరాలను దాస్తూ నమోదు చేస్తున్నారనే ఆరోపణలు అధికంగా ఉన్నాయి. అయితే జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడే పేషెంట్లు లక్షల్లో ఉండగా, వాటిని ప్రభుత్వ లెక్కల్లో పరిగణలోకి తీసుకోకపోవడం విచిత్రంగా ఉన్నది. ఇలాంటి లక్షణాలు ఉన్న పేషెంట్లకు కేవలం మందులు ఇచ్చి పంపిస్తున్నారు. గడిచిన పదిహేను రోజుల్లో వైరల్​ఫీవర్ల పేషెంట్లు సంఖ్య ప్రతీ రోజూ భారీగా పెరుగుతున్నది.

డెంగీ షాక్

రాష్ట్ర ప్రభుత్వానికి డెంగీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 11,114 డెంగీ కేసులు తేలాయి. వీటిలో ప్రభుత్వంలో 9,430, ప్రైవేట్‌లో 1684 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లో సుమారు 1,13,236 మందికి డెంగీ స్క్రీనింగ్, పరీక్షలు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఒరిజినల్ కేసులను కూడా పరిగణలోకి తీసుకుంటే డెంగీ బాధితుల సంఖ్య భారీగా ఉంటుందని స్వయంగా ఆఫీసర్లే ఆఫ్​ది రికార్డులో స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, 2019 తర్వాత ఈ స్థాయిలో డెంగీ కేసులు తేలడం ఇదే మొదటి సారి. అప్పట్లో ఏకంగా 13 వేల మార్కు దాటి డెంగీ దడ పుట్టించింది. యంటీ లార్వా, ఇతర ముందస్తు నివారణ చర్యలను మున్సిపల్, వైద్యశాఖలు తీసుకోలేనందున, ఈ ఏడాదీ ఇప్పటికే 12 వేల మార్కుకు డెంగీ చేరువలో ఉన్నది. గతంలో తేలిన కేసుల సంఖ్యను క్రాస్​చేస్తుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.

నీటి కలుషితం కూడా..

వర్షాలు కారణంగా దోమలు వృద్ధి చెంది విష జ్వరాలు ప్రబలుతున్నట్లే, నీటి కలుషితంతో కూడా రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ములుగు, నారాయణపేట్, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి కలుషితం కూడా జరుగుతున్నది. దీంతో డయేరియా, టైఫాయిడ్‌తో పాటు పేషెంట్లకు ఒళ్లు నొప్పులు వంటివి తీవ్రంగా వేధిస్తున్నట్లు క్షేత్రస్థాయిలోని డాక్టర్లు వివరిస్తున్నారు.

Tags:    

Similar News