అధిక ఒత్తిడికి లోనవుతున్నారా.. ఈ చిట్కాలతో దూరం చేసుకోండి..
ఈ రోజుల్లో చాలా మంది ప్రజల బిజీ లైఫ్ స్టైల్, ఆఫీసులో పనిభారం కారణంగా అధికంగా ఒత్తిడికి గురవుతుంటారు.
దిశ, పీచర్స్ : ఈ రోజుల్లో చాలా మంది ప్రజల బిజీ లైఫ్ స్టైల్, ఆఫీసులో పనిభారం కారణంగా అధికంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ రెండు కారణాలే కాకుండా సంబంధాలు, కుటుంబ బాధ్యతలు కూడా ఒత్తిడికి కారణం కావచ్చు. అయితే ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అధిక ఒత్తిడి కారణంగా, నిద్రలేమి, ఆకలి లేకపోవడం, మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
అయితే ఈ ఒత్తిడిని తట్టుకోలేని చాలామంది ప్రజలు వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. అందులో తప్పు ఏమీ లేదు. కానీ ఒత్తిడిని ఎదుర్కోవడంలో మీకు సహాయపడే కొన్ని విషయాలను కూడా అనుసరించవచ్చు. ఈ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రకృతికి దగ్గరగా..
ప్రకృతికి దగ్గరగా ఉండడం, మంచి వాతావరణంలో సమయం గడపడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. ఉదయాన్నే పార్కులు, మంచి లొకేషన్లకు వెళ్లినట్టయితే ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. దీంతో మనసు రిలాక్స్ అవుతుంది.
మీకు మీరు సమయం కేటాయించుకోవాలి..
ఒత్తిడిని ఎదుర్కోవటానికి ఉత్తమ మార్గం మీకు మీరు సమయం ఇవ్వడం. మీకు సంతోషాన్ని కలిగించే అన్ని కార్యకలాపాలను చేయండి. పెయింటింగ్, డ్యాన్స్ వంటి మీకు ఇష్టమైన పనులను చేయడానికి మీ బిజీ షెడ్యూల్ నుండి సమయాన్ని వెచ్చించండి. ఇది మీకు ఉత్పాదకత, మంచి అనుభూతిని కలిగిస్తుంది.
ప్రజలను కలుసుకోవడం..
ఒత్తిడిని ఎదుర్కొనే వారికి ఎవరినైనా కలవడం కాస్త కష్టమే. అలాంటి వ్యక్తులు సామాజిక సమావేశాలకు దూరంగా ఉంటారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి, ప్రజలను కలవండి. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి. సామాజిక పరస్పర చర్య మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
ఆటలు..
ఒత్తిడి నుండి బయటపడేందుకు మీరు గేమ్‌లను మీ స్నేహితుడిగా చేసుకోవచ్చు. మీరు పజిల్స్, క్రాస్‌వర్డ్‌లు లేదా స్ట్రాటజీ గేమ్‌లను కూడా ఆడవచ్చు. ఇది మీ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మీలో సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది.