Migraine Headache:మైగ్రేన్ సమస్యకి న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్‌తో చెక్?
ఇటీవల జీవన విధానంలో వచ్చే మార్పుల వలన, అధిక పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, మానసిక ఇబ్బందుల కారణంగా చాలా మంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు.
దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల జీవన విధానంలో వచ్చే మార్పుల వలన, అధిక పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, మానసిక ఇబ్బందుల కారణంగా చాలా మంది విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. ఈ సమస్య కారణంగా ఏ పని సరిగ్గా చేయలేకపోతుంటారు. కొందరు దీర్ఘకాలికంగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే వీరు వైద్యులను సంప్రదించి ట్రిట్‌మెంట్ తీసుకున్నప్పటికి తాత్కలిక ఉపశమనమే తప్ప సమస్య నుంచి విముక్తి లభించడం లేదని చింతిస్తున్నారు. ఈ క్రమంలోనే మైగ్రేన్ బాధితులకు Asian Institute of Gastroenterology(AIG) వైద్యులు గుడ్ న్యూస్ చెప్పారు. అది ఏంటో తెలుసుకుందాం..!
ఈ సమస్యకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ వైద్యులు చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ అయిందని సమాచారం. మైగ్రేన్‌తో బాధపడుతున్న మారిషస్‌కు చెందిన 24 ఏళ్ల మహిళ పలు దేశాల్లో తన సమస్యకు చికిత్స తీసుకున్నా పూర్తిస్థాయిలో నయం కాకపోవడంతో ఆమె హైదరాబాద్‌కు వచ్చి ఏఐజీ వైద్యులను సంప్రదించారంట. అప్పుడు ఏఐజీ వైద్యులు ఆమెకు పేస్‌మేకర్ మాదిరిగా న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ ద్వారా మైగ్రేన్‌కు చికిత్స అందించారు.
సీనియర్ కన్సల్టెంట్ క్రానిక్ పెయిన్, న్యూరోమాడ్యులేషన్ నిపుణులు డాక్టర్ సిద్ధార్థ్ చావలి, న్యూరో సర్జరీ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుబోధ్ కలిసి బాధితురాలిని పరిశీలించారు. ఆ తర్వాత ఆమెకు హై సర్వైకల్ స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్ ఇంప్లాంటేషన్ ప్రక్రియతో చికిత్స చేయాలని నిర్ణయించుకున్నారంట. అయితే శరీరంలో ఎక్కడ నొప్పి కలిగిన ఆ సంకేతాలు మెదడుకు అందుతాయని.. న్యూరో స్టిమ్యూలేటర్ ద్వారా నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు చేరుకోక ముందే అడ్డుకుని ఉపశమనం కలిగించే అవకాశం ఉందని గమనించారు. ఈ చికిత్సా పద్ధతినే మారిషస్ మహిళకు చేశారు. న్యూరో స్టిమ్యూలేటర్ ఇంప్లాంట్ ద్వారా చికిత్స సక్సెస్ అవటమనేది ఆసియాలోనే తొలిసారి అని ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి తెలిపారు. ఈ న్యూరో స్టిమ్యులేటర్ ఇంప్లాంట్ కోసం 11 నుంచి 12 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు.