షర్మిలకు ఎదురుగాలి స్టార్ట్.. పాలేరులో పోటీ కూడా కష్టమేనా..?

వైఎస్సార్టీపీ అధినేత షర్మిలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.

Update: 2023-05-04 02:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్టీపీ అధినేత షర్మిలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఆమెకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్కినేని సుధీర్ బాబు గుడ్ బై చెప్పారు. అదేదారిలో పలు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు సైతం బయటకు వెళ్లిపోయారు. వైఎస్సార్ కుటుంబానికి విధేయుడుగా ఉన్న సుధీర్ బాబు పార్టీని వీడటం షర్మిలను ఆందోళనలో పడేసింది. పార్టీలోని కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కారణంగా తెలుస్తున్నది.

నాయకత్వంలోనే లుకలుకలు..

సుధీర్ బాబు జిల్లాలో పార్టీ నేతలను దిశానిర్దేశం చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు చేసినందునే రాజీనామా చేశారు. వీటితో పాటు ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. పార్టీ నాయకత్వంలోనే లుకలుకలు ఉన్నాయని, వారి గొడవలతో జిల్లా కో ఆర్డినేటర్లు, మండలాల అధ్యక్షులను ఇష్టం వచ్చినట్లుగా మార్చడమేనని తెలుస్తున్నది. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బుస్సాపూర్ శంకర్ తో పాటు పలువురు జిల్లా నేతలు కూడా పార్టీ నుంచి బయటకు వెళ్లారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నేతలు పలువురు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు.

సొంత పార్టీ నేతల తీరుతోనే..

రాష్ట్ర ప్రజలకు చేరువయ్యేందుకు ప్రజాప్రస్థానం పాదయాత్రను షర్మిల చేపట్టింది. పార్టీ ప్రోగ్రాంల నిర్వహణకు స్థానిక నేతలు సొంత డబ్బు ఖర్చు చేశారు. అయితే ముందుగా ఖర్చు పెట్టుకోవాలని.. ఆ తర్వాత డబ్బులు ఇస్తామని పార్టీకి చెందిన ఓ వ్యక్తి నమ్మించి దోచుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. గతంలోనూ పార్టీకి చెందిన ఓ మహిళా నేత తన పుస్తెలు అమ్ముకున్నది తెలిసిందే. ఇదిలా ఉండగా షర్మిల వెంటే షాడోలా ఉండే సతీష్ అనే వ్యక్తి రూ.11 లక్షలు తీసుకున్నట్లు స్వయంగా సుధీర్ బాబే వెల్లడించారు. సతీష్ అన్ని జిల్లాల్లోనూ ఇలాగే పలువురు నేతల నుంచి డబ్బులు దండుకున్నాడన్నారు. షర్మిలకు సన్నిహితంగా ఉండే మరో వ్యక్తిపైనా ఇలాంటివే వచ్చాయి. నేతలను ఎదగనీయకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.

ఆశలు అడియాసలే...

వైఎస్సీర్టీపీ ఏర్పాటు అనంతరం తర్వాత ఎంతోమంది చేరుతారని షర్మిల భావించారు. కానీ ఎవరూ చేరకపోవడంతో ఆమె ఆశలు అడియాసలే అయ్యాయి. ఆపై తమకు ఇతర పార్టీల నేతలు అక్కర్లేదని, కొత్త లీడర్లను సృష్టిస్తామని చెప్పారు. అది కూడా బెడిసికొట్టింది. కొత్త లీడర్ల సంగతి దేవుడెరుగు, ఉన్నవారిని కాపాడుకోవడం కూడా షర్మిలకు కష్టంగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగుతానని చెప్పిన షర్మిలకు గతంలో ఉన్న సమస్యలకు తోడు ఆ జిల్లా అధ్యక్షుడి రాజీనామా చేయడంతో మరిన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. అక్కడే మకాం వేసేందుకు సిద్ధమై పార్టీ ఆఫీసుకు సైతం భూమిపూజ చేసిన షర్మిల సమస్యలను ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే.

Read more:

షర్మిల పార్టీకి భవిష్యత్తు ఉందా!

Tags:    

Similar News