ఉపాధ్యాయులను పొట్టన పెట్టుకుని.. పరిహారం కూడా ఇవ్వరా..?
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక 17 ఏప్రిల్ 2021న జరిగింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లతో పాటుగా, మరికొన్ని మునిసిపాలిటీలకు 30 ఏప్రిల్ 2021న ఎన్నికలు నిర్వహించారు. కరోనా రెండవ దశ ఉధృతంగా ఉన్నప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు పురమాయించారు. పరిస్థితులు అనుకూలంగా లేనందున ఎన్నికలను వాయిదా వేయాలని, ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల […]
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక 17 ఏప్రిల్ 2021న జరిగింది. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లతో పాటుగా, మరికొన్ని మునిసిపాలిటీలకు 30 ఏప్రిల్ 2021న ఎన్నికలు నిర్వహించారు. కరోనా రెండవ దశ ఉధృతంగా ఉన్నప్పటికీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు పురమాయించారు. పరిస్థితులు అనుకూలంగా లేనందున ఎన్నికలను వాయిదా వేయాలని, ప్రజలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించకుండా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటున్నది.
‘కరోనా విజృంభిస్తున్న వేళ మీరు స్వయం నిర్ణయం తీసుకోలేరా..? ’అని హైకోర్టు ప్రశ్నించినా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులను సంసిద్ధం చేసింది. కరోనా విధులు నిర్వహించలేమంటూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కరోనా బాధితులు ఎంతగానో ప్రాధేయపడినప్పటికీ వినిపించుకోకుండా ఎన్నికల విధులకు హాజరు కావాలని ఆర్డర్లు పంపించారు. లేకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగాలు కాపాడుకునేందుకు ఉపాధ్యాయులందరూ ఎన్నికల విధులకు సంబంధించిన ఉత్తర్వులు అందుకున్నారు. ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులను రెండు విడతలుగా నిర్వహించారు. చాలా మంది ఉపాధ్యాయులు కరోనాతో బాధపడుతూ శిక్షణా తరగతులకు హాజరు కాలేదు.
నిబంధనలు బేఖాతరు..
భౌతిక దూరం ఏమాత్రం పాటించకుండా, కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయకుండా శిక్షణా తరగతులను ఇరుకైన గదులలో నిర్వహించడంతో మరికొంత మందికి పాజిటివ్ వచ్చింది. మొదటిసారి శిక్షణకు హాజరుకాని వారికి మెమోలు ఇచ్చారు. రెండవ సారి హాజరు కాకపోతే సస్పెండ్ చేస్తామన్నారు. కరోనాతో బాధపడుతున్నవారికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరినప్పటికీ ఇవ్వలేదు. విధిలేక ఉపాధ్యాయులందరూ ఎన్నికల విధులకు హాజరయ్యారు. పోలింగ్ కేంద్రాలలో ఇరుకైన గదులలో ఎన్నికల సిబ్బంది పదిమంది ఓటింగ్ ప్రక్రియను నిర్వహించవలసి వచ్చింది. చాలామంది ఓటర్లు కరోనా నిబంధనలు పాటించకపోవడం వలన, పాజిటివ్ వారు కూడా ఓటు వేయడానికి రావడం వల్ల ఉపాధ్యాయులకు తిప్పలు తప్పలేదు. అనంతరం చాలా మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఆసుపత్రులలో చికిత్స పొందారు. ఈ క్రమంలోనే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన కొలగాని రవి, జటంగి సోమయ్య , పరీదుల ఎల్లగౌడ్, పున్నంచందర్, కె.సమ్మయ్య , వి.రాధాకృష్ణ, చిన్నాల రాజారాం, మోహన్‌ప్రసాద్, స్వరూప్‌రెడ్డి తదితరులు 14 మంది, ఖమ్మంలో ఇద్దరు, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో పాల్గొన్న నలుగురు ఉపాధ్యాయులు కరోనాతో మృతిచెందారు. చాలా మంది ఉపాధ్యాయులు ఇప్పటికీ ఇంకా మందులు వాడుతూ అవస్థల పాలవుతున్నారు.
పరిహారం అందలేదు..
చనిపోయినా, చికిత్స పొందుతున్నా, పొందిన ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యత వహించాలి. వారి నిర్లక్ష్యం వల్లనే ఈ ఉపాధ్యాయుల మరణాలు సంభవించినవి. ఈ 20 మంది ఉపాధ్యాయుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి. చనిపోయినవారి కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈ మేరకు పత్రికల ద్వారా కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఏడు రోజులలో ఉద్యోగం కల్పించాలని 26-5-2021 న మున్సిపల్ కమిషనర్, డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. రెండు నెలలు కావొస్తున్నా ఇంతవరకు ఏ ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదు. ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదు. ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన రూ. 30 లక్షలు ఎక్స్‌గ్రేషియా కూడా చెల్లించలేదు. జీవనోపాధిలేక ఆ కుటుంబాలవారు అప్పుల పాలవుతున్నారు. బాధిత కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా, ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవ హైకోర్టు ఆదేశిస్తుందని కుటుంబసభ్యులు, ఉపాధ్యాయులు ఆశతో ఎదురు చూస్తున్నారు.