కరోనా కష్టకాలం.. చే‘నేతన్నల’ ఆత్మహత్యలు

కేసీఆర్ సార్… ‘‘చేనేత నిల్వలు పేరుకుపోయినయి. చీరలు వందల్లో ఉన్నయి. రూ.లక్షల మాల్ అది. మాకు వేరే పని ఏదీ రాదు. వ్యవసాయం బాగా చేస్తున్నరు. అందరూ కరోనాకు భయపడుతున్నరు. మేం ఆకలికి భయపడుతున్నం. మా గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు. మీరు పట్టించుకోకపోతే మాకు ఉరే గతి’’ – మహిళా చేనేత కార్మికుల ఆవేదన ఇది దిశ, న్యూస్ బ్యూరో: కరోనా చేనేత కార్మికులను రోడ్డున పడేసింది. చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ రాష్ట్రంలో నెల రోజుల […]

Update: 2020-07-22 23:56 GMT

కేసీఆర్ సార్…
‘‘చేనేత నిల్వలు పేరుకుపోయినయి. చీరలు వందల్లో ఉన్నయి. రూ.లక్షల మాల్ అది. మాకు వేరే పని ఏదీ రాదు. వ్యవసాయం బాగా చేస్తున్నరు. అందరూ కరోనాకు భయపడుతున్నరు. మేం ఆకలికి భయపడుతున్నం. మా గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు. మీరు పట్టించుకోకపోతే మాకు ఉరే గతి’’
– మహిళా చేనేత కార్మికుల ఆవేదన ఇది

దిశ, న్యూస్ బ్యూరో:
కరోనా చేనేత కార్మికులను రోడ్డున పడేసింది. చేనేత రంగాన్ని ఆదుకోవాలంటూ రాష్ట్రంలో నెల రోజుల నుంచి ఏదో ఓ చోట ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నరు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నరు. కరోనా వైరస్ వ్యాప్తితో బట్టల కొనుగోలు పూర్తిగా నిలిచిపోయింది. చేనేత వస్త్రాలు, చీరల అమ్మకాలు జీరోకు పడిపోయినయి. చేనేత మగ్గాలన్నీ దాదాపుగా ఆగిపోయినయి. ఇపుడు మగ్గం మీద ఉన్న ఐదు నుంచి పది శాతం పడుగు నేత కూడా పూర్తయితే మళ్లీ పని లభించే అవకాశమే కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల ఉత్పత్తులు పేరుకుపోయాయి. మాస్టర్ వీవర్లు మగ్గాలు నేయించేందుకు వెనుకడుగు వేస్తున్నరు. తమ దగ్గరే రూ.లక్షలు, రూ.కోట్ల విలువైన స్టాకు పేరుకుపోయిన తర్వాత మళ్లీ నూలు కొనుగోలు చేసే శక్తి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నరు. ఇప్పుడున్న స్టాకు అమ్ముడుపోతే తప్ప మళ్లీ నేయించే ధైర్యం చేయలేమని తేల్చి చెబుతున్నరు. దిక్కు తోచని స్థితిలో నల్లగొండ జిల్లా చండూరులో వందలాది కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగిండ్రు. పని కల్పించమని వేడుకుంటున్నరు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన పోచంపల్లిలోనూ ధర్నాలు చేస్తున్నరు. చౌటుప్పల, గట్టుప్పల, పుట్టపాక, ఆమనగల్లు, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల, జడ్చర్ల, వరంగల్, జనగామల్లో నిరసన జ్వాలలు రేగినయి. ఈ నేపథ్యంలోనే చేనేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండడంతో కుటుంబాలు కుంగిపోతున్నయి. అప్పుల బాధలు, పనులు దొరకడం లేదన్న ఆందోళనతో నెలకొన్న బలవన్మరణాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నయి. ఐనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలేవీ స్పందించడం లేదు. భరోసానిచ్చే ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు.

తెలంగాణ వచ్చినా అంతేనా?
తెలంగాణ రాష్ట్రావిర్భావం తర్వాత అన్ని వర్గాల బతుకులు బాగుపడుతాయన్న ఆశలు ఉండేవి. 2010 కి ముందు 260 మంది, ఆ తర్వాత 363 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డరు. పని కల్పనకు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ చేనేత, జౌళి శాఖ ఉదాసీనత కారణంగానే నిర్వీర్యమవుతున్నయని చేనేత వర్గాలు ఆరోపిస్తున్నాయి. టెస్కో, చేనేత, జౌళి శాఖలలో మగ్గం గురించిన అవగాహన కలిగిన వ్యక్తుల సంఖ్య తగినంత లేకపోవడమే ప్రధాన కారణమన్న అభిప్రాయం నెలకొంది. మరోవైపు పవర్ లూం వస్త్రాలను చేనేత వస్త్రాలుగా విక్రయిస్తున్నరు. బహుళ జాతి సంస్థలే ఈ దందా ఎక్కవగా చేస్తున్నయి. తాము ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. పైగా తమపైనే కేసులు పెట్టి వేధిస్తున్నారని నేతన్నల ఐక్య కార్యాచరణ కమిటీ నేత దాసు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి ఈ పవర్లూం వస్త్రాలే అధికంగా చేనేత వస్త్రాలుగా షోరూంల్లో ఉన్నాయి. అందుకే అసలైన చేనేత కార్మికుల ఉత్పత్తులు మార్కెటింగ్ ను సాధించలేకపోతున్నాయని తెలుస్తోంది. ధర్నాలు, రిలే నిరాహార దీక్షలకు రాజకీయ మద్దతు లభించడం లేదు. అధికార పక్షం ఎటూ పట్టించుకోవడం లేదు. వినడానికి కూడా సమయం ఇవ్వడం లేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా కార్మికులతో మమేకం కావడం లేదని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తోటి మనుషులుగానైనా గుర్తించకుండా పోలీసులు కూడా ధర్నాలను అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. చండూరులో రిలే నిరాహర దీక్ష చేస్తున్న కార్మికులను కోవిడ్-19 నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ వెళ్లగొట్టారు. దాంతో దేవాలయంలో దీక్షలు చేపట్టారు.

దొరకని న్యాయం..
న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టు లో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. 2010 నుంచి ఇప్పటి వరకు 323 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని చేనేత, జౌళి శాఖ సంచాలకులు శైలజారామయ్యాయ్యర్ అఫిడవిట్ సమర్పించారు. ‘నేతన్నలకు చేయూత’ పథకం కింద కరోనా సంక్షోభంలో రూ.92 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో జియో ట్యాగ్ వేసిన చేనేత మగ్గాల సంఖ్య 17,573. దానికి కనీసం నాల్గింతలైనా ఆధారపడి జీవిస్తున్నారు. పవర్లూంల సంఖ్య: 35,588. కార్మికుల సంఖ్య 8,898. వీటిపై కూడా నాల్గింతల మంది ఆధారపడ్డారు. దేశ వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు వీవర్స్ యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ జూన్ 26న ఫిర్యాదు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే 350 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వివరించింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపించింది. కేంద్ర చేనేత, జౌళి శాఖ అదనపు డెవలప్ మెంట్ కమిషనర్ బదులిస్తూ 157 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినవేనన్నారు. కేవలం 31 ఆత్మహత్యల కేసులు మాత్రమే నమోదైనట్లు పేర్కొన్నారు.

సహకార రంగం నిర్వీర్యమైంది..
రాష్ట్రంలో చేనేత వర్గాల బతుకు దుర్భరంగా మారింది. రైతులను ఎంపవర్ చేస్తున్నారు. అలాగే చేనేత కార్మికులను చేయాలి. సహకార రంగాన్ని నిర్వీర్యం చేయడం వల్ల కార్మికులంతా మాస్టర్ వీవర్ల పై ఆధారపడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ విధానం మారాలి. మార్కెట్లో హ్యాండ్లూం, పవర్ లూం వస్త్రాలను వేర్వేరుగా విక్రయించాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం గుర్తించిన జియో ట్యాగింగ్ నంబర్ ను నేసిన వస్త్రాలపై పేర్కొనాలి. అప్పుడే చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరుగుతుంది. కార్మికుల ఆత్మహత్యల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. టోల్ ఫ్రీ నంబరు పెట్టాలి. ముందుగానే వాళ్లను గుర్తించాలి. ఆత్మహత్య చేసుకోకుండా డాక్టర్, మానసిక నిపుణులతో మాట్లాడించాలి. వాళ్ల బాధలు తెలుసుకొని బ్యాంకుల ద్వారా కనీసం రుణాలు ఇప్పించాలి. చేనేత కార్మికులకు బాహ్య ప్రపంచం తెలియదు. అందుకే మరో పని చేయలేకపోతున్నారు. పద్మశాలి సంఘాలు కూడా చేనేత పేరిట దగా చేస్తున్నాయి. కొందరు పబ్లిసిటీ కోసం పని చేస్తున్నారు. రాజకీయ నాయకులేమో ఎన్నికలు వస్తే తప్ప చేనేతల ఆత్మహత్యల గురించి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం కూడా అలాగే మారింది. ఆర్ధిక సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం చేపట్టాలి. – దాసు సురేష్, చైర్మన్, వీవర్స్ యునైటెడ్ జేఏసీ

కరోనా కాలంలో ఆత్మహత్యలు..
నారాయణపేట కోటకొండకు చెందిన సాక రాకేశ్ (28) జూలై ఎనిమిదిన ఓ చెట్టుకు ఊరేసున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా దేశాయిపేటలోని ఎంహెచ్ నగర్ కు చెందిన తుల రమేష్ (40) మే 11న చనిపోయాడు. సిరిసిల్లలో బొద్దుల రాజమౌళి (50) జూన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సిరిసిల్లలో ఎలిగేటి సత్యనారాయణ కూడా జూన్ 24న ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామంలో ఎనగందుల రాణి మే తొమ్మదిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ నగర శివార్లలోని కుంట్లూరులో జిల్లా వెంకటేశ్ (52) జూన్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జనగామలో ఇద్దరు, సిరిసిల్లలో ఇద్దరు, వరంగల్ లో ఒకరు, నారాయణపేటలో ఒకరు.. ఇలా పలు ప్రాంతాల్లో చేనేత కార్మికుల బలవన్మరణాలు నమోదయ్యాయి. అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ, చికిత్స చేయించుకునే ఆర్ధిక స్థోమత లేక చనిపోయినవారి సంఖ్య 20 వరకు ఉందని జాతీయ చేనేత మండలి మాజీ సభ్యుడు తడక యాదగిరి తెలిపారు. కరోనా సమయంలో తినడానికే తిండి దొరకని ధైన్యం నెలకొందని, ఇక ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకొని, మందులు వాడే పరిస్థితి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. వీటితోపాటు రిపోర్టు కాని ఆత్మహత్యలు కూడా ఉన్నాయని చేనేత అధ్యయన వేదికలు చెబుతున్నాయి. అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ చికిత్స చేయించుకునే స్థోమత లేక చనిపోయిన వారి సంఖ్య కూడా పెద్దదేనంటున్నారు. ఇవేవీ అధికార వర్గాల దాకా చేరలేదంటున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారం ఆత్మహత్యలు..

సంవత్సరం రిపోర్టు
2000 4
2001 11
2002 6
2003 12
2004 40
2005 41
2006 50
2007 34
2008 49
2009 9
2010 4
మొత్తం 260
Tags:    

Similar News